ccl tournament
-
తారా తోరణం
అనంతలో ఆదివారం సినీతారలు సందడి చేశారు. స్థానిక నీలం సంజీవరెడ్డి క్రీడా మైదానంలో సినీతారల క్రీసెంట్ క్రికెట్ కప్ చైర్మన్ షకీల్‌షఫీ ఆధ్వర్యంలో సినీతారల క్రికెట్ టోర్నీని ఆదివారం నిర్వహించారు. దీంట్లో ప్రముఖ నటీనటులతో సహా కమెడియన్లు, ఇతర తారాగణం పాల్గొన్నారు. తమ అభిమాన నటీనటులందరినీ ఒకే చోట చూసిన అభిమానులు పులకించిపోయారు. సెల్ఫీలు తీసుకోవడానికి ఎగబడ్డారు. అభిమానులకు సినీతారలు అభివాదం చేస్తూ ఉత్సాహం నింపారు. ఓ వైపు ఉత్కంఠగా మ్యాచ్ జరుగుతూ ఉండగా కమెడియన్లు పంచ్‌డైలాగులతో హాస్యాన్ని పండించారు. తరుణ్ జట్టు విజయం మొదట బోర్డ్ ఆఫ్ డిజేబుల్డ్ క్రికెట్ అసోసియేషన్(బీడీసీఏ) దివ్యాంగుల 5 ఓవర్ల ఫ్రెండ్లీ మ్యాచ్ జరిగింది. అనంతరం మంత్రి కాలవ శ్రీనివాసులు టాస్ ఎగరేశారు. తరుణ్ జట్టు టాస్ గెలిచి ఫీల్డింగ్‌ను ఎంచుకుంది. శ్రీకాంత్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 141 పరుగులు చేసి 6 వికెట్లు కోల్పోయింది. సుధీర్ 26 బంతుల్లో 4 ఫోర్లతో 29 పరుగులు చేయగా, నిఖిల్ 14 బంతుల్లో 2 ఫోర్ల సహాయంతో 17 పరుగులు జోడించాడు. అనంతరం బ్యాటింగ్ చేసిన ప్రిన్స్ 3 ఫోర్లతో 18 బంతుల్లో 21 పరుగులు చేశాడు. నందకిశోర్ మెరుపు ఇన్నింగ్స్‌తో 36 బంతుల్లో 3 సిక్సర్లు, ఒక ఫోర్ కొట్టి 44 పరుగులు చేసి జట్టుకు భారీ లక్ష్యాన్ని అందించాడు. చివరగా ఖయ్యూం 14 బంతుల్లో 12 పరుగులు చేశాడు. తరుణ్ జట్టు బౌలర్లలో సామ్రాట్ 4 ఓవర్లలో 16 పరుగులు ఇచ్చి 4 వికెట్లు సాధించాడు. ఆదర్శ్ 4 ఓవర్లు వేసి 24 పరుగులు ఇచ్చి 1 వికెట్ పడగొట్టాడు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన తరుణ్ జట్టులో ఓపెనర్లు ఆదర్శ్, విశ్వ మెరుపు ఇన్నింగ్స్‌తో లక్ష్యాన్ని చేధించి విజయం సాధించింది. శ్రీకాంత్ జట్టు బౌలర్లు అశ్విన్ 3 వికెట్లు తీసి జట్టును విజయం వైపుకు తీసుకెళ్లాడు. మరో బౌలర్ ఖయ్యూం 4 ఓవర్లలో 13 పరుగులు ఇచ్చి ఒక వికెట్ తీశాడు. అనంతరం బ్యాటింగ్ చేసిన రఘు 24 బంతుల్లో 2 ఫోర్లతో 22 పరుగులు జోడించాడు. శేషగిరి 12 బంతుల్లో 3 ఫోర్ల సహాయంతో 17 పరుగులు చేసి జట్టును ఆదుకున్నారు. వీరిద్దరిని అశ్విన్ అద్భుతమైన బౌలింగ్‌తో ఒకే ఓవర్లో బౌల్డ్ చేసి తరుణ్ జట్టును ముప్పతిప్పలు పెట్టాడు. చివరికి కార్తీక్, ప్రభులు బ్యాటింగ్ చేసి జట్టుకు విజయాన్నందించారు. దీంతో తరుణ్ జట్టు ఒక ఓవర్ మిగిలి ఉండగానే 5 వికెట్లతో విజయాన్ని సాధించింది. బెస్ట్ బౌలర్‌గా సామ్రాట్, బెస్ట్ బ్యాట్స్‌మన్‌గా విశ్వ, బెస్ట్ క్యాచర్‌గా భూపాల్, మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఆదర్శ్, బెస్ట్ ఎంటర్టైనర్గా శివారెడ్డి, బెస్ట్ బ్యాట్స్‌మన్(డిజేబుల్డ్)గా వసంత్కుమార్లను ఎంపిక చేశారు. డ్యాన్సులు.. కేరింతలు ముందుగా ర్యాప్ ర్యాప్ షకీల్ తన గీతాలతో సందడి చేశారు. అనంత అభిమానులను ప్రణీత పలకరించగా, అర్చన, మధుశాలినీలు తమ మాటలతో అలరించారు. అనంతరం ముమైత్‌ఖాన్ తనదైన శైలీలో జోష్ నింపారు. మనారా చోప్రా స్టెప్పులతో కుర్రాళ్లను ఉర్రూతలూగించారు. సత్యా మాస్టర్ తన స్టెప్పులతో అలరించారు. మొదటి ఇన్నింగ్స్ ముగిసిన తరువాత శ్రీకాంత్ రా రా.. సినిమా ఆడియోను లాంచ్ చేశారు. అనంతరం అనంతలక్ష్మి ఇంజినీరింగ్ కళాశాలల సారథ్యంలో తెరకెక్కిన సినిమా ‘టూ ఫ్రెండ్స్, ట్రూ లవ్’ ఆడియోను విడుదల చేశారు. మ్యాచ్ సాగుతున్నంత సేపూ టిల్లు వేణు, ధన్‌రాజ్, శివారెడ్డిల పంచ్‌లతో హాస్యం పండించారు. చివరిగా శ్రీకాంత్ తన కామెంట్రీతో అలరించగా, తనీష్ తను శ్రీకాంత్‌కు సబ్‌స్టిట్యూట్‌గా బరిలోకి దిగాడు. బహుమతుల ప్రదానోత్సవం సందర్భంగా గాయకుడు రేవంత్ బాహుబలి చిత్రంలోని మనోహరి పాటతో ఆకర్షించారు. శివారెడ్డి మిమిక్రీతో అలరించారు. సంపూర్ణేష్‌బాబు, గీతాసింగ్, అల్లరి నరేష్, మాధవిలత, సుధీర్‌బాబు, తారక్, అయ్యప్ప, రాజీవ్, అజయ్, ఇతర సినీ తారలు తమ అనుభూతులను పంచుకున్నారు. చివరిగా సత్యా మాస్టర్, ఇతర డ్యాన్సర్లు సందడి చేశారు. అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే ప్రభాకర్‌చౌదరి, జడ్పీ చైర్మెన్ పూల నాగరాజు, మాజీ జడ్పీ చైర్మన్ చమన్‌సాబ్, నగర మేయర్ స్వరూప, కమిషనర్ పీవీవీఎస్ మూర్తి తదితరులు పాల్గొన్నారు. -
సినీ తారల క్రికెట్
సినీ తారల క్రికెట్ సందడి మొదలైంది. తారలు వెండి తెర నుంచి క్రికెట్ పిచ్‌పైకి వచ్చారు. ఈ సీసీఎల్ టోర్నమెంట్ వారం క్రితం ముంబైలో మొదలైంది. రే పు బెంగళూరులో జరగబోయే మ్యాచ్‌లో చెన్నై తారల టీం పాల్గొంటోంది. దీనికి త్రిష అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నారు. ఆటయినా, పాటయినా ఆ మాట కొస్తే ఏ క్రీడయినా సై అంటోంది సీసీఎల్‌లోని చెన్నై రైనోస్ టీమ్. సినిమా, క్రీడలు ఈ రెండింటికీ అవినాభావ సంబంధం ఉంది. వీటి నుంచి ప్రేక్షకులు కోరుకునేది ఎంటర్ టెయిన్మెంట్. క్రీడల్లో హాకీ మన జాతీయ క్రీడ కంటే క్రికెట్ అంటేనే ఎక్కువ క్రేజ్. ఈ క్రీడకు సాధారణ ప్రేక్షకుడితోపాటు ప్రముఖ స్థాయికి చెందిన వారు ఎడిక్ట్ అనే చెప్పాలి. అశేష అభిమానులు ప్రేమించే సినీ కళాకారులు కూడా క్రికెట్ ప్రియులే. అలాంటి తారలు క్రీడాకారులయితే అయితే ఆ మజానే వారు. అలా పుట్టిందే క్రికెట్ సెలబ్రెటీస్ లీగ్ (సీసీఎల్) 2011లో నాలుగు భాషలకు చెందిన (తమిళం, తెలుగు, ముంబై, కర్ణాటక) టీమ్స్‌తో మొదలైన ఈ క్రికెట్ సెలబ్రెటీ లీగ్ ఒక్కో ఏడాది ఒక నైపుణ్యాన్ని పెంచుకుంటూ ఐపీఎల్‌కు దీటుగా తయారైందంటే అతిశయోక్తి కాదు. చెన్నై రైనోస్ టీమ్‌కు విశాల్ కెప్టెన్సీ బాధ్యతలను నిర్వహిస్తుండగా, విక్రాంత్, రమణ, విష్ణు, శాంతను, శ్యామ్, జిత్తన్ రమేష్, జీవా, శ్రీకాంత్, సుందరం తదితరులు టీమ్ సభ్యులుగా వ్యవహరిస్తున్నారు. తెలుగు వారియర్స్‌కు నటుడు వెంకటేష్ నాయకత్వ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఈ జట్టులో శ్రీకాంత్, అల్లరి నరేష్, అఖిల్ తదితరులు ఆడుతున్నారు. ముంబై హీరోస్ జట్టుకు నటుడు సునిల్ శెట్టి, కర్ణాటక బుల్డోజర్స్ జట్టుకు సుదీప్ కెప్టెన్సీ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఇంతింతై - వటుడింతైనట్లు 2011లో చెన్నై రైనోస్, తెలుగు వారియర్స్, కర్ణాటక బుల్డోజర్స్, ముంబై హీరోస్ టీమ్‌లుగా బరిలోకి దిగి, క్రికెట్, సినీ అభిమానుల్ని అలరించాయి. ఈ లీగ్‌లో చెన్నై రైనోస్ విజేతగా నిలిచింది. 2012లో జరిగిన రెండవ సీజన్లో ఈ నాలుగు టీమ్‌లకు మరో రెండు కేరళ స్ట్రైకర్స్, బెంగాల్ టైగర్స్ అదనంగా వచ్చి చేరాయి. రసవత్తరంగా సాగిన ఈ మ్యాచ్‌లోనూ కప్‌ను చెన్నై రైనోస్నే కైవసం చేసుకోవడం విశేషం. 2013లో జరిగిన మూడవ సీజన్లో మరో రెండు టీమ్‌లు వీర మరాఠి, బోజ్‌పూరి డేబాగ్స్ వచ్చి చేరాయి. ఈ సిరీస్ కప్‌ను కర్ణాటక బుల్డోజర్స్ తన్నుకుపోయింది. నాలుగు సీజన్ ఆట మొదలైంది నాలుగో సీజన్ సీసీఎల్ ఆటలో కప్ ఎవరిదన్నపై ఎవరికి వారే తమదేనన్న ధీమాను వ్యక్తం చేస్తున్నారు. ఈ సీజన్ ఆట జనవరి 25న ముంబాయిలో మొదలైంది. మలి ఆట రేపు (ఆదివారం) బెంగుళూర్లోని చిన్నసామి స్టేడియంలో ప్రారం భం కానుంది. ఆ రోజున నాలుగు జట్లు తలపడబోతున్నాయి. సాయంత్రం 7 గంటలకు మొదల య్యే ఆటలో చెన్నై రైనోస్, కర్ణాటక బుల్డోజర్స్తో తలపడనుంది. ఈ సీజన్ తొలి మ్యాచ్‌లో విజ యాన్ని కైవసం చేసుకున్న చెన్నై రైనోస్ మంచి రైజింగ్‌లో ఉంది. నాలుగో సీజన్ కప్ తామే సాధించి తీరుతామనే ధీమాను వ్యక్తం చేస్తోంది. ఈ టీమ్‌కు తాజాగా నటి త్రిష బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించడం విశేషం. టీమ్ కెప్టెన్ విశాల్ శుక్రవారం చెన్నైలో మీడియూతో మాట్లాడుతూ తమ టీమ్‌లో యూనిటీ ఉందన్నారు. తమ టీమ్‌కు సంతోష్ గోపి కోచ్‌గా వ్యవహరించ డం ఆనందంగా ఉందని పేర్కొన్నారు. మూడు సీజన్ మ్యాచ్‌ల్లో ప్రతిభ ఆధారంగా ఈ లీగ్‌కు చాలా మార్పులు చేర్పు లు చేసుకున్నామని తెలిపారు. తమ టీమ్‌లో ప్రతి ఒక్కరూ కప్ గెలవాలన్న లక్ష్యంతోనే ఉన్నట్టు మళ్లీ విజేతగా నిలుస్తామనే నమ్మకంతో ఆడుతున్నట్లు తెలిపారు. ఆనందంగా ఉంది చెన్నై రైనోస్ జట్టుకు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించడం ఆనందంగా ఉందని నటి త్రిష పేర్కొన్నారు. తొలి సీజన్ నుంచి ఈ జట్టును ఉత్సాహపరచాలని కాంక్షించానని ఇప్పటికి అది నెరవేరిందని తెలిపారు. చెన్నై రైనోస్ టీమ్ చాలా పటిష్ఠంగా ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు. చెన్నై అభిమానులకు నిరాశే ఈ సీసీఎల్ పోటీ ఫిబ్రవరి 2న చెన్నై చేపాక్ స్టేడియంలో జరగాల్సి ఉంది. అయితే ప్రభుత్వానికి క్రికెట్ బోర్డుకు మధ్య విభేదాలతో సీసీఎల్ పోటీకి అనుమతి లభించలేదని కెప్టెన్ విశాల్ తెలిపారు. దీంతో చెన్నైలో సీసీఎల్ మ్యాచ్ లేనట్లేనని తెలుస్తోంది.