CE Nanda kumar
-
హెచ్‌వీడీఎస్ పనులకు రూ.320 కోట్లు
ట్రాన్స్‌కో చీఫ్ ఇంజినీర్ నందకుమార్ సంగం: జిల్లాలో హెచ్‌వీడీఎస్ మిగులు పనుల కోసం రూ.320 కోట్లను మంజూరు చేసినట్లు ట్రాన్స్‌కో చీఫ్ ఇంజినీర్ నందకుమార్ తెలిపారు. సంగం సబ్‌స్టేషన్‌లో జరిగిన అభివృద్ధి పనులను మంగళవారం తనిఖీ చేసిన అనంతరం ఆయన మాట్లాడారు. హెచ్‌వీడీఎస్ పనులను ఆర్నెల్లో పూర్తి చేస్తామని చెప్పారు. జిల్లాలో 234 సబ్స్టేషన్లు ఉన్నాయని, మరో ఏడు మంజూరయ్యాయని వివరించారు. పనులను త్వరలో ప్రారంభిస్తామని పేర్కొన్నారు. రైతులకు ఏడు గంటల విద్యుత్‌ను నిరంతరం ఇస్తున్నామని, ఎక్కడైనా పంటలు ఎండిపోతున్న విషయాన్ని తమ దృష్టికి తీసుకొస్తే అదనంగా ఇచ్చేందుకు యత్నిస్తామని వివరించారు. జిల్లాలో దీనదయాళ్ ఉపాధ్యాయ యోజన పథకం కొనసాగుతోందన్నారు. జిల్లాలో 26 వేల సర్వీసులు లక్ష్యం కాగా, ఇప్పటికే 38 వేల సర్వీసులను మంజూరు చేశామని చెప్పారు. అవసరమైన వారు వెంటనే దీనదయాళ్ పథకంలో భాగంగా రూ.125ను చెల్లిస్తే మీటర్ బాక్స్, ఎల్ఈడీ బల్బును అందజేస్తామని వివరించారు. ఎస్సీ, ఎస్టీ కాలనీల్లో ఎక్కువగా విద్యుత్ బకాయిలు ఉన్నాయని, వారు కులధ్రువీకరణ సమర్పించకపోవడమే దీనికి ప్రధాన కారణమన్నారు. పత్రాలను అందజేసి 50 యూనిట్లలోపు విద్యుత్‌ను వాడుకుంటే సబ్సిడీ ఇస్తామని తెలిపారు. ట్రాన్స్‌ఫారాలను మార్చేందుకు విద్యుత్ శాఖ వాహనాలను ఏర్పాటు చేసిందని వెల్లడించారు. విద్యుత్ సమస్యలు ఉంటే 1800 – 425 – 155555 టోల్ ఫ్రీ నంబర్‌కు తెలపాలని సూచించారు. దీనికి కాల్ రాగానే సబ్‌స్టేషన్‌కు ఆటోమేటిక్‌గా వెళ్తుందన్నారు. సెల్ఫోన్లకు మేసెజ్‌లు సైతం వస్తున్నాయన్నారు. ఇప్పటివరకు జిల్లాలో విద్యుత్ లైన్‌లాస్ 9.62గా ఉందని వివరించారు. జిల్లాలో 1.64 లక్షల వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయని, వీరి నుంచి రూ.16 లక్షల బకాయిలు రావాల్సి ఉందని చెప్పారు. రాత్రి విద్యుత్ వల్ల రైతులు ఇబ్బందులు పడుతున్న అంశాన్ని విలేకరులు ప్రస్తావించారు. పగటి పూట వాడకం ఎక్కువగా ఉన్న కారణంగా ఇవ్వలేకపోతున్నామని బదులిచ్చారు. నెలకు ఒక షిఫ్ట్ మాత్రమే రాత్రి కరెంట్ ఇస్తున్నామన్నారు. అనంతరం సబ్‌స్టేషన్ ఆవరణలో మొక్కలు నాటారు. డీఈ శివప్రసాద్, ఏడీఏ భానునాయక్, ఏఈ మన్మథరావు పాల్గొన్నారు. -
రూ.125 కోట్ల విద్యుత్ బకాయిలు
విద్యుత్ శాఖ సీఈ నందకుమార్ చిల్లకూరు: జిల్లాలో సుమారు రూ.125 కోట్ల విద్యుత్ బిల్లులు బకాయిలు ఉన్నాయని విద్యుత్‌శాఖ సీఈ నందకుమార్ తెలిపారు. చిల్లకూరు సబ్‌స్టేషన్‌ను గురువారం ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోని ప్రభుత్వ శాఖలు, పంచాయతీల నుంచి రూ.80 కోట్ల మేర బకాయిలు వసూలు కావాల్సి ఉందన్నారు. చిల్లకూరు మండలంలో రూ.2 కోట్ల మేర బకాయిలు ఉండగా, ఆక్వా రైతులు 50 శాతం మేర చెల్లించాల్సి ఉందన్నారు. మిగిలిన బకాయిలు పరిశ్రమల నుంచి రావాల్సి ఉందన్నారు. కడివేడు ఫీడర్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతుండడంతో మరో విద్యుత్ సబ్‌స్టేషన్ ఏర్పాటుకు రూ.1.25కోట్లు మంజూరు చేసినట్లు తెలిపారు. కాంట్రాక్టు సిబ్బందికి మూడు నెలలుగా జీతాలు చెల్లించడం లేదని విలేకరులు ఆయన దృష్టికి తీసుకురాగా నెలఖారులోగా జీతాలు చెల్లిస్తామని తెలిపారు. విద్యుత్ సిబ్బందిపై ఆగ్రహం చిల్లకూరు సబ్‌స్టేషన్ సిబ్బందిపై సీఈ నందకుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సబ్‌స్టేషన్‌కు ఎంత మేర విద్యుత్ వస్తుంది..ఏ ఫీడర్‌కు ఎంత సరఫరా చేస్తున్నారని ప్రశ్నించగా సమాధానం ఇవ్వలేదు. దీంతో ఎందుకు పని చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు, బకాయిలు వసూళ్లపై దృష్టి సారిచంకపోవడంతో అసహనం వ్యక్తం చేశారు. ఆయన వెంట డీఈలు అనీల్‌కుమార్, జగదీశ్వర్‌రెడ్డి ఇస్మాయిల్, రాఘవేంద్రరావు, ఏడీలు శ్రీధర్, నరేంద్రరెడ్డి, ఏఈలు చినస్వామి నాయక్, శ్రీనివాసులు, సుబ్రహ్మణ్యం, తదితరుల ఉన్నారు. -
ఏడు సబ్స్టేషన్లు మంజూరు
సీఈ నందకుమార్ రాపూరు : జిల్లాకు ఏడు 132 కేవీ సబ్స్టేషన్లు, 33–11 కేవీ సబ్స్టేషన్లు 11 మంజూరయ్యాయని, వీటి పనుల త్వరలో ప్రారంభిస్తారని విద్యుత్‌శాఖ సీఈ నందకుమార్ తెలిపారు. ఆధునీకరణ చేసిన రాపూరు విద్యుత్ సబ్‌స్టేషన్‌ను బుధవారం ఆయన పరిశీలించారు. అనంతరం మొక్కలు నాటారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాకు హెచ్‌వీడీఎస్ (వ్యవసాయ రైతులకు మూడు విద్యుత్ మెటార్లకు ఒక ట్రాన్స్ఫారం) పథకానికి రూ.320 కోట్లు మంజూరైనట్లు వెల్లడించారు. విద్యుత్ సమస్యలుంటే ప్రజలు టోల్‌ఫ్రీ నంబర్ 180042515333 ఫోన్‌చేసి ఫిర్యాదు చేయాలని సూచించారు. రాపూరు సమీపంలో నిర్మిస్తున్న 132 కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్ పూర్తయితే విద్యుత్ సమస్య ఉండదని ఇక్కడి నుంచి చుట్టుపక్కల మండలాలకు విద్యుత్ సరఫరాచేస్తామని చెప్పారు. రాపూరుకు ఏఈని పుష్కరాల అనంతరం నియమిస్తామన్నారు. జిల్లాలో విద్యుత్ శాఖలో 1,000 పోస్టులు ఖాళీగా ఉన్నాయని ప్రభుత్వనికి నివేదిక పంపామని చెప్పారు. అనంతరం విద్యుత్‌శాఖ ఉద్యోగులతో సమావేశం నిర్వహించారు. పాత బకాయిల వసూళ్లను వేగవంతం చేయాలని ఆదేశించారు.ఆయన వెంట డీఈలు అనీల్‌కుమార్, రాఘవేంద్ర ఇస్మాయిల్, జగదీష్, ఏడీఈ ప్రసాద్, ఏఈ సుబ్రమణ్యం ఉన్నారు.