రూ.125 కోట్ల విద్యుత్ బకాయిలు
-
విద్యుత్ శాఖ సీఈ నందకుమార్
చిల్లకూరు: జిల్లాలో సుమారు రూ.125 కోట్ల విద్యుత్ బిల్లులు బకాయిలు ఉన్నాయని విద్యుత్‌శాఖ సీఈ నందకుమార్ తెలిపారు. చిల్లకూరు సబ్‌స్టేషన్‌ను గురువారం ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోని ప్రభుత్వ శాఖలు, పంచాయతీల నుంచి రూ.80 కోట్ల మేర బకాయిలు వసూలు కావాల్సి ఉందన్నారు. చిల్లకూరు మండలంలో రూ.2 కోట్ల మేర బకాయిలు ఉండగా, ఆక్వా రైతులు 50 శాతం మేర చెల్లించాల్సి ఉందన్నారు. మిగిలిన బకాయిలు పరిశ్రమల నుంచి రావాల్సి ఉందన్నారు. కడివేడు ఫీడర్‌లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతుండడంతో మరో విద్యుత్ సబ్‌స్టేషన్ ఏర్పాటుకు రూ.1.25కోట్లు మంజూరు చేసినట్లు తెలిపారు. కాంట్రాక్టు సిబ్బందికి మూడు నెలలుగా జీతాలు చెల్లించడం లేదని విలేకరులు ఆయన దృష్టికి తీసుకురాగా నెలఖారులోగా జీతాలు చెల్లిస్తామని తెలిపారు.
విద్యుత్ సిబ్బందిపై ఆగ్రహం
చిల్లకూరు సబ్‌స్టేషన్ సిబ్బందిపై సీఈ నందకుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సబ్‌స్టేషన్‌కు ఎంత మేర విద్యుత్ వస్తుంది..ఏ ఫీడర్‌కు ఎంత సరఫరా చేస్తున్నారని ప్రశ్నించగా సమాధానం ఇవ్వలేదు. దీంతో ఎందుకు పని చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు, బకాయిలు వసూళ్లపై దృష్టి సారిచంకపోవడంతో అసహనం వ్యక్తం చేశారు. ఆయన వెంట డీఈలు అనీల్‌కుమార్, జగదీశ్వర్‌రెడ్డి ఇస్మాయిల్, రాఘవేంద్రరావు, ఏడీలు శ్రీధర్, నరేంద్రరెడ్డి, ఏఈలు చినస్వామి నాయక్, శ్రీనివాసులు, సుబ్రహ్మణ్యం, తదితరుల ఉన్నారు.