హెచ్‌వీడీఎస్‌ పనులకు రూ.320 కోట్లు | Rs.320 crores for HVDS works | Sakshi
Sakshi News home page

హెచ్‌వీడీఎస్‌ పనులకు రూ.320 కోట్లు

Published Wed, Sep 7 2016 1:21 AM | Last Updated on Sat, Oct 20 2018 6:19 PM

హెచ్‌వీడీఎస్‌ పనులకు రూ.320 కోట్లు - Sakshi

హెచ్‌వీడీఎస్‌ పనులకు రూ.320 కోట్లు

 
  •  ట్రాన్స్‌కో చీఫ్‌ ఇంజినీర్‌ నందకుమార్‌
 
సంగం: జిల్లాలో హెచ్‌వీడీఎస్‌ మిగులు పనుల కోసం రూ.320 కోట్లను మంజూరు చేసినట్లు ట్రాన్స్‌కో చీఫ్‌ ఇంజినీర్‌ నందకుమార్‌ తెలిపారు. సంగం సబ్‌స్టేషన్లో జరిగిన అభివృద్ధి పనులను మంగళవారం తనిఖీ చేసిన అనంతరం ఆయన మాట్లాడారు. హెచ్‌వీడీఎస్‌ పనులను ఆర్నెల్లో పూర్తి చేస్తామని చెప్పారు. జిల్లాలో 234 సబ్‌స్టేషన్లు ఉన్నాయని, మరో ఏడు మంజూరయ్యాయని వివరించారు. పనులను త్వరలో ప్రారంభిస్తామని పేర్కొన్నారు. రైతులకు ఏడు గంటల విద్యుత్‌ను నిరంతరం ఇస్తున్నామని, ఎక్కడైనా పంటలు ఎండిపోతున్న విషయాన్ని తమ దృష్టికి తీసుకొస్తే అదనంగా ఇచ్చేందుకు యత్నిస్తామని వివరించారు. జిల్లాలో దీనదయాళ్‌ ఉపాధ్యాయ యోజన పథకం కొనసాగుతోందన్నారు. జిల్లాలో 26 వేల సర్వీసులు లక్ష్యం కాగా, ఇప్పటికే 38 వేల సర్వీసులను మంజూరు చేశామని చెప్పారు. అవసరమైన వారు వెంటనే దీనదయాళ్‌ పథకంలో భాగంగా రూ.125ను చెల్లిస్తే మీటర్‌ బాక్స్, ఎల్‌ఈడీ బల్బును అందజేస్తామని వివరించారు. ఎస్సీ, ఎస్టీ కాలనీల్లో ఎక్కువగా విద్యుత్‌ బకాయిలు ఉన్నాయని, వారు కులధ్రువీకరణ సమర్పించకపోవడమే దీనికి ప్రధాన కారణమన్నారు. పత్రాలను అందజేసి 50 యూనిట్లలోపు విద్యుత్‌ను వాడుకుంటే సబ్సిడీ ఇస్తామని తెలిపారు. ట్రాన్స్‌ఫారాలను మార్చేందుకు విద్యుత్‌ శాఖ వాహనాలను ఏర్పాటు చేసిందని వెల్లడించారు. విద్యుత్‌ సమస్యలు ఉంటే 1800 – 425 – 155555 టోల్‌ ఫ్రీ నంబర్‌కు తెలపాలని సూచించారు. దీనికి కాల్‌ రాగానే సబ్‌స్టేషన్‌కు ఆటోమేటిక్‌గా వెళ్తుందన్నారు. సెల్‌ఫోన్లకు మేసెజ్‌లు సైతం వస్తున్నాయన్నారు. ఇప్పటివరకు జిల్లాలో విద్యుత్‌ లైన్‌లాస్‌ 9.62గా ఉందని వివరించారు. జిల్లాలో 1.64 లక్షల వ్యవసాయ విద్యుత్‌ కనెక్షన్లు ఉన్నాయని, వీరి నుంచి రూ.16 లక్షల బకాయిలు రావాల్సి ఉందని చెప్పారు. రాత్రి విద్యుత్‌ వల్ల రైతులు ఇబ్బందులు పడుతున్న అంశాన్ని విలేకరులు ప్రస్తావించారు. పగటి పూట వాడకం ఎక్కువగా ఉన్న కారణంగా ఇవ్వలేకపోతున్నామని బదులిచ్చారు. నెలకు ఒక షిఫ్ట్‌ మాత్రమే రాత్రి కరెంట్‌ ఇస్తున్నామన్నారు. అనంతరం సబ్‌స్టేషన్‌ ఆవరణలో మొక్కలు నాటారు. డీఈ శివప్రసాద్, ఏడీఏ భానునాయక్, ఏఈ మన్మథరావు పాల్గొన్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement