నోటు పాట్లు
– నేటి నుంచి రూ.500, వెయ్యి నోట్లు చిత్తుకాగితాలే
– ఈ నెల 11 వరకూ ఆస్పత్రులు, రైల్వేస్టేషన్లు, పెట్రోలు బంకుల్లో చెల్లుబాటు
– నేడు, రేపు బ్యాంకులు, ఏటీఎంలు మూసివేత
– డిసెంబర్ ఆఖరు వరకు బ్యాంకులు, పోస్టాఫీసుల్లో నోట్లు మార్చుకునే అవకాశం
– మంగళవారం రాత్రి నుంచే నోట్లు తీసుకునేందుకు నిరాకరించిన వ్యాపారులు
– నేటి నుంచి తీవ్ర ఇబ్బందులు పడనున్న సామాన్య, మధ్య తరగతి కుటుంబాలు
సాక్షిప్రతినిధి, అనంతపురం : ఏంటి? రూ. 500, రూ.వెయ్యి నోట్లు నేటి నుంచి చెల్లవని చెబుతున్నారనుకుంటున్నారా? అవునండి! నిజం! ఇది సాక్షాత్తు ప్రధాని నరేంద్రమోడీ చేసిన ప్రకటన! రూ.500, వెయ్యినోట్లను మంగళవారం అర్ధరాత్రి నుంచి రద్దు చేస్తున్నట్లు మంగళవారం ప్రకటించారు. ఈ ప్రకటన టీవీల్లో వస్తుండగనే...వ్యాపారులు వినియోగదారుల నుంచి రూ.500, వెయ్యినోట్లు తీసుకునేందుకు నిరాకరించారు. జేబులో వందనోట్లు లేకపోవడం, ఉన్ననోట్లు తీసుకునేందుకు వ్యాపారులు నిరాకరించడంతో 'అనంత' ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. నేడు, రేపు బ్యాంకులు, ఏటీఎంలు మూసేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అంటే శుక్రవారం వరకూ ఉన్ననోట్లను బ్యాంకులు, పోస్టాఫీసుల్లో మార్పు చేసుకునేందుకు కూడా అవకాశం ఉండదు. దీంతో ఇంట్లో వంద నోట్లు లేకుండా కేవలం పెద్దనోట్లు మాత్రమే ఉన్నవారికి ఇబ్బందులు తప్పవు.
కేంద్రం ప్రభుత్వం రూ.500, వెయ్యినోట్లు రద్దు చేస్తున్నట్లు మంగళవారం రాత్రి 8.30గంటల నుంచే టీవీల్లో ప్రకటనలు వచ్చాయి. ఇది దావానలంలా నగరం మొత్తం వ్యాపించింది. ఈ ప్రకటన వెలువడిన నిమిషాల్లోనే వినియోగదారులు కొన్ని బేకరీలు, సూపర్మార్కెట్లలో రూ.500, వెయ్యినోట్లు ఇస్తే చెల్లవనే మాట చెప్పకుండా 'చిల్లర లేదు' అని సింపుల్గా తప్పించుకున్నారు. దీంతో మంగవారం రాత్రి నుంచే పెద్దనోట్ల లావాదేవీలు నిలిచిపోయాయి. ఎందుకు అందరూ ఇలా చెబుతున్నారో అర్థం కాక వినియోగదారులు తలలు పట్టుకున్నారు. చివరకు పక్కన ఉన్నవారు 'ఈరోజు రాత్రి నుంచి నోట్లు చెల్లవండి, కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అందుకే ఇలా అంటున్నారు' అని వివరించే ప్రయత్నం చేశారు. కొంతమంది వ్యాపారులతో వాదులాటకు దిగారు. కొన్ని దుకాణాలు ఎందుకొచ్చిన గొడవ అని మూసేశారు. దీంతో అనంతపురంతో పాటు జిల్లా వ్యాప్తంగా పట్టణ ప్రాంతాల్లో మంగళవారం రాత్రి గందరగోళం నెలకొంది.
బ్యాంకుల మూసివేతతో ఇక్కట్లు:
నెల ప్రారంభమై వారమే అయింది. ప్రభుత్వ ఉద్యోగులకు ఇటీవల జీతాలు వచ్చి ఉంటాయి. ప్రైవేటు ఉద్యోగులకు కాస్త ఆలస్యంగా వేతనాలు ఇస్తారు. నెల ఆరంభం కావడంతో ఇంట్లోకి కావల్సిన కిరణా, పాలవారికి డబ్బులు, తదితర ఖర్చులు ఉంటాయి. నేడు, రేపు బ్యాంకులు, ఏటీఎంలు బంద్ కావడంతో ఇంట్లో వందనోట్లు లేకపోతే రెండురోజుల పాటు ఇబ్బందులు పడాల్సిందే! పెద్దనోట్లు తీసుకుని చిల్లర ఇవ్వండని ఇరుగు, పొరుగును అడిగినా ఎవ్వరూ స్పందించి ఇచ్చే ప్రసక్తి ఉండదు. దీంతో ఇబ్బందులు పడక తప్పదు. పెట్రోలు బంకులు, రైల్వేస్టేషన్లు, ఆస్పత్రులు, పాలకేంద్రాల్లో ఈ నెల 11 వరకూ పెద్దనోట్లు చెల్లుబాటు అవుతాయి. కానీ పెట్రోలు బంకులు, ఆస్పత్రుల్లో కూడా తీసుకోలేదు. దీంతో వాహనదారులు, రోగులు మరింత ఇబ్బందులు పడ్డారు.
సామాన్య, మధ్యతరగతి కుటంబాల్లో కల్లోలం
రూ.500, వెయ్యినోట్ల రద్దు సామాన్య, మధ్యతరగతి కుటుంబాల్లో కల్లోలం సృష్టిస్తోంది. ఆస్తులు కొనేందుకు, పిల్లల వివాహాల కోసం నెలనెలా వచ్చే జీతాల్లో తినీతినక, పొదుపుగా సంసారం చేసుకుంటూ డబ్బులు దాచుకున్నారు చాలామంది ఉన్నారు. ఇలా రూ.5లక్షల నుంచి 15 లక్షలు 20లక్షల వరకూ దాచుకున్నవారు ఇప్పుడు నోట్లు చెల్లుబాటు కావంటే, వాటిని బ్యాంకుల్లో మార్చుకోవాలి. అంత మొత్తం మార్చుకోవాలంటే ఆదాయమార్గాలు చూపించాలి. ప్రతి నెలా దాచామంటే బ్యాంకులు ఒప్పుకునే పరిస్థితి ఉండదు. ఇలాంటి వారు భారీగా ఆదాయపన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఈ దెబ్బ మధ్యతరగతి కుటుంబాల్లో తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది.
డిపాజిట్ సెంటర్లు కిటకిట:
అర్ధరాత్రి 12 గంటల తర్వాత నుంచి నోట్లు చెల్లవనే ప్రకటనతో రెండు గంటల్లోనే డిపాజిట్ చేయాలనే ఆతృతతో పలువురు డిపాజిట్సెంటర్లకు చేరుకున్నారు. రద్దీ అధికంగా ఉండటంతో తోపులాట జరిగింది. ఒకరికొకరు వాదనలకు దిగారు. నోట్ల ప్రకటనతో పెద్దనోట్లు భారీగా నిల్వ ఉన్నవారంతా నిద్రలే కుండా మంగళవారం గడిపారు.