భవానీపురం (విజయవాడ): గొల్లపూడి మార్కెట్ యార్డ్ సమీపంలోని ప్రగతి రోడ్డు క్యారియర్స్ గోడౌన్‌లో సుమారు కోటి రూపాయల విలువైన గుట్కాలను పట్టుకున్న కొద్ది రోజుల్లోనే గట్టు వెనుక సుమారు రూ.40 లక్షల విలువైన ఖైనీ ప్యాకెట్లను శనివారం భవానీపురం పోలీసులు పట్టుకున్నారు. మళ్లీ అదే ట్రాన్స్‌పోర్ట్‌కు చెందిన గోడౌన్‌లోనే ఈ సరుకు కూడా పట్టుబడడం విశేషం. గట్టు వెనుక ప్రాంతంలోని ఆర్టీసీ వర్క్‌షాపుదగ్గరగల బీరువాల కంపెనీ రోడ్డులో తెల్లవారు జామున 6.30కు ఒక గోడౌన్‌లో గుట్కాలను దిగుమతి చేస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది.
పోలీసులు అక్కడికి వెళ్లేసరికే ఒక లారీ దిగుమతి చేసి వెళ్లగా మరోలారీని పోలీసులు పట్టుకున్నారు. అంతకుముందు వెళ్లిన లారీనుంచి 200 ఖైనీ బస్తాలను దిగుమతి చేయగా, పోలీసులు పట్టుకున్న లారీలో మరో 100 బస్తాలు ఉన్నాయి. ఈ మొత్తం సరుకు దిగుమతి కాకముందే 30 బస్తాలు గోడౌన్‌లో ఉన్నాయి. మొత్తంమ్మీద రూ.40లక్షల విలువ చేసే 330 ఖైనీ బస్తాలను పట్టుకున్నారు. భవానీపురం ఎస్సై రామకృష్ణుడు జిల్లా ఫుడ్ ఇనస్పెక్టర్లు ఎ. శ్రీనివాస్, సుందరరామయ్యలకు, విద్యాధరపురం, భవానీపురం వీఆర్వోలు బి. శ్రీనివాస్, కామయ్యశాస్త్రిలకు సమాచారం అందించటంతో వారు అక్కడికి చేరుకున్నారు.సరుకును పరిశీలించి పంచనామా చేశారు. అనంతరం సరుకును గోడౌన్‌లోనే ఉంచి సీజ్ చేశారు.
జేసీకి నివేదిక సమర్పిస్తాం
ఫుడ్ ఇనస్పెక్టర్లు మాట్లాడుతూ కేసును నమోదు చేసి చార్జిషీట్‌ను ఫైల్‌చేసిన తర్వాత జాయింట్ కలెక్టర్‌కు నివేదికను సమర్పిస్తామని, ఆయన ఆదేశాల మేరకు తదుపరి చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇటీవల పట్టుబడిన కోటి రూపాయల సరుకుకూడా ఇదే ట్రాన్స్‌పోర్ట్ కార్యాలయంలో పట్టుకున్న నేపథ్యంలో ఆ సంస్థపై క్రిమినల్ కేసులు పెడతారా అన్న ప్రశ్నకు అది జేసీ నిర్ణయం మేరకు ఉంటుందన్నారు.
ఢిల్లీ నుంచి ఒరిస్సాకు..
పోలీసులు పట్టుకున్న ఖైనీ లారీకి సంబంధించి డ్రైవర్ అందించిన వే బిల్లులో ఢిల్లీ నుంచి ఒడిశాకు లోడు వెళుతున్నట్లు ఉంది. జమ్మూ-కశ్మీర్ ఖతార్‌లోని ఎస్‌కే ఎంటర్‌ప్రజైస్ నుంచి ఒరిస్సాకు చెందిన గణేష్ ఎంటర్‌ప్రజైస్ అధినేత గణేష్ 200 బస్తాలు కొనుగోలు చేసినట్లు బిల్లులో ఉంది.