breaking news
Celebrity Style ..
-
ఇంటి కోసం పొదుపు..
సెలబ్రిటీ స్టైల్.. బాలీవుడ్ డెరైక్టర్ మహేష్ భట్ కుమార్తె ఆలియా భట్ (21) .. లుక్స్, యాక్టింగ్ నైపుణ్యాలపరంగా బాలీవుడ్లో బోలెడంత పేరు తెచ్చుకుంది. ఇప్పటికే నాలుగు సినిమాల్లో నటించిన ఆలియా.. ప్రతి సినిమాకు రూ. 2-5 కోట్ల దాకా రెమ్యునరేషన్ తీసుకుంటుందని పరిశ్రమలో టాక్. సిల్వర్ స్పూన్‌తో పుట్టినప్పటికీ ఆలియా భట్ డబ్బు విషయంలో ఆచి తూచే వ్యవహరిస్తుందట. బడ్జెట్‌కు లోబడే ఖర్చు చేస్తుంది. తాను పాటించే ఆర్థిక క్రమశిక్షణకు సంబంధించిన మరిన్ని వివరాలు తన మాటల్లోనే.. ‘నా పాకెట్ మనీ రూ. 500తో మొదలైంది. నేను, మా అక్క జాగ్రత్తగా ఖర్చు చేయడాన్ని బట్టి పాకెట్ మనీ పెరిగేది. ఇంటర్లో ఉన్నప్పుడు నెలకు రూ. 4,000కు చేరింది. రెండేళ్ల క్రితం వచ్చిన స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ సినిమాకి ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ కింద మొట్టమొదటిసారిగా రూ. 2.5 లక్షల చెక్ అందుకున్నాను. మేం ఏదైనా బ్రాండెడ్ వస్తువులు కొనుక్కోవాలంటే మా సంపాదనతోనే కొనుక్కోమంటారు మా పేరెంట్స్. నా పారితోషికంతో ఖరీదైన ప్రాదా బ్యాగ్ కొందామనుకున్నాను. కానీ, అంతలోనే డబ్బు విషయంలో బాధ్యతగా ఉండాలన్నది గుర్తొచ్చింది. దీంతో, ఆ డబ్బు అలా బ్యాంకులోనే ఉంచేశాను. నేను సంపాదించడం మొదలుపెట్టిన తర్వాతే డెబిట్ కార్డు చేతికొచ్చింది. ఈ ఏడాదే నా ఇరవై ఒకటో పుట్టినరోజు నాడు మొట్టమొదటిసారిగా క్రెడిట్ కార్డు వచ్చింది. రోజువారీ చేసే ఖర్చుల విషయంలో బాధ్యతగా ఉండాలన్నది ఇవి నేర్పాయి. ఖర్చుల విషయానికొస్తే.. నా బిల్స్ అన్నీ మా అమ్మే కడుతుంది. కానీ వాటికి సంబంధించిన చెక్కులపై నేనే సంతకం చేస్తాను కాబట్టి అన్ని ఖర్చుల గురించీ నాకు తెలుసు. అంతే కాదు నేను ఎంత ఇన్‌కం ట్యాక్స్ కట్టేదీ నాకు తెలుసు. ఇన్వెస్ట్‌మెంట్స్‌పై నాకు ఆసక్తి ఎక్కువే. ఫిక్సిడ్ డిపాజిట్లు, రియల్ ఎస్టేట్ వంటి సాధనాల గురించి తెలుసుకుంటుంటాను. ఇల్లు కొనుక్కోవాలన్నది నా ఆలోచన. దీనికోసమే నేను పొదుపు చేస్తున్నాను. అఫ్కోర్స్ కారు కూడా కొనుక్కోవాలని ఉంది. అయితే, మూడు నెలలకోసారి మనసు మారిపోతుంటోంది కనుక.. ఏది కొంటానో చూడాలి’. -
రొనాల్డో ఏం చేశాడంటే..
సెలబ్రిటీ స్టైల్.. కోట్ల మంది ఫుట్‌బాల్ అభిమానులకు ఫేవరెట్ స్టార్ అయిన క్రిస్టియానో రొనాల్డో పోర్చుగల్‌కు చెందిన ప్లేయర్. మైదానంలో ఎంత దూకుడుగా ఉంటాడో, పెట్టుబడుల విషయాల్లోనూ అంతే చురుగ్గా ఉంటాడు. ప్రపంచంలోనే అత్యధికంగా సంపాదిస్తున్న ఫుట్‌బాల్ ప్లేయర్ రొనాల్డో. జీతం, బోనస్‌లు, ఇతరత్రా అడ్వర్టైజ్మెంట్లు మొదలైన వాటి రూపంలో గడిచిన ఏడాది కాలంలో అతని ఆదాయం దాదాపు రూ. 440 కోట్లుగా ఒక పత్రిక లెక్కగట్టింది. అతని మొత్తం సంపద విలువ రూ. 1,220 కోట్లని అంచనా. లైఫ్స్టయిల్పై విమర్శలు ఎలా ఉన్నా.. ఇన్వెస్ట్మెంట్ల విషయంలో రొనాల్డోకి మంచి మార్కులే ఉంటాయి. రొనాల్డో ప్రత్యేకంగా రియల్ ఎస్టేట్‌లో ఎక్కువగా పెట్టుబడులు పెడతాడు. అయిదేళ్ల క్రితం రూ. 80 కోట్లతో పోర్చుగల్‌లో ఒక లగ్జరీ హోటల్ని కొన్నాడు రొనాల్డో. అప్పటికే రాజధాని లిస్బన్లో నాలుగు ఇళ్లని కొనేశాడు. ఇవి కాకుండా ఒక నలభై కోట్ల రూపాయలు పెట్టి ఒక మాన్షన్‌ని, అరవై కోట్లు పెట్టి మరో ప్రాపర్టీని కొన్నాడు. కొన్నాళ్ల క్రితం ఓ ఐదంతస్తుల బిల్డింగ్‌ను కొన్నాడు. దాన్ని హోటల్‌గానో డిస్కోగానో మారుద్దామనుకున్నాడు. చివరికి ఆ రెండూ కాకుండా తనకొచ్చిన ట్రోఫీలతో మ్యూజియంగా మార్చేశాడు. సీఆర్ 7 పేరుతో దుస్తులు, కీచెయిన్స్ లాంటివన్నీ కూడా అక్కడి స్టోర్స్ విక్రయిస్తుంటాయి. రొనాల్డో గ్యారేజ్‌లో లాంబోర్గినీ, పోర్షే, మెర్సిడెస్, బెంట్లీ లాంటి లగ్జరీ కార్లు కొలువుదీరి ఉంటాయి. పొదుపు, పెట్టుబడుల విషయం అలా ఉంచితే రొనాల్డో అడపా దడపా ఫ్యాన్స్‌కి ఇతోధికంగా ఆర్థిక సహాయం కూడా చేస్తుంటాడు. మెస్సీ.. అనుకోకుండా రియల్టీలోకి.. రియల్ ఎస్టేట్‌పై ఆసక్తితో రొనాల్డో పెట్టుబడులు పెట్టగా.. మరో సాకర్ స్టార్, అర్జెంటీనా ఫుట్‌బాల్ ప్లేయర్ లియోనెల్ మెస్సీ ఊహించని విధంగా ఇందులోకి దిగాల్సి వచ్చింది. పొరుగింటి వారి గోల నుంచి ప్రశాంతత దక్కించుకునేందుకు మెస్సీ బలవంతంగా ఇన్వెస్ట్ చేయాల్సి వచ్చింది. స్పెయిన్‌లోని అతని పొరుగింటి వారు తమ ఇంటికి రిపేర్లు చేసుకుంటూ.. డబ్బులు సరిపోక మధ్యలో ఆపేశారట. ఎంతో కొంతకు దాన్ని కొనమని మెస్సీని అడిగారు. అతను ససేమిరా అనడంతో.. ఆ ఇంట్లో గదులను వాళ్లు లీజుకు ఇచ్చారు. అందులో దిగినవారు రోజూ నానా గోల చేస్తుండటంతో భరించలేక రెండు ఇళ్లకు మధ్య భారీ గోడ కట్టేశాడు మెస్సీ. దీనిపై కోర్టుకెళతామని పొరుగువారు బెదిరించడంతో.. చివరికి గత్యంతరం లేక ఆ ఇంటిని కొనుక్కున్నాడు మెస్సీ. ఆ విధంగా ఇష్టం లేకున్నా రియల్టీలో ఇన్వెస్ట్ చేశాడు.