రొనాల్డో ఏం చేశాడంటే..
సెలబ్రిటీ స్టైల్..
కోట్ల మంది ఫుట్‌బాల్ అభిమానులకు ఫేవరెట్ స్టార్ అయిన క్రిస్టియానో రొనాల్డో పోర్చుగల్‌కు చెందిన ప్లేయర్. మైదానంలో ఎంత దూకుడుగా ఉంటాడో, పెట్టుబడుల విషయాల్లోనూ అంతే చురుగ్గా ఉంటాడు. ప్రపంచంలోనే అత్యధికంగా సంపాదిస్తున్న ఫుట్‌బాల్ ప్లేయర్ రొనాల్డో. జీతం, బోనస్‌లు, ఇతరత్రా అడ్వర్టైజ్‌మెంట్లు మొదలైన వాటి రూపంలో గడిచిన ఏడాది కాలంలో అతని ఆదాయం దాదాపు రూ. 440 కోట్లుగా ఒక పత్రిక లెక్కగట్టింది.
అతని మొత్తం సంపద విలువ రూ. 1,220 కోట్లని అంచనా. లైఫ్‌స్టయిల్‌పై విమర్శలు ఎలా ఉన్నా.. ఇన్వెస్ట్‌మెంట్ల విషయంలో రొనాల్డోకి మంచి మార్కులే ఉంటాయి. రొనాల్డో ప్రత్యేకంగా రియల్ ఎస్టేట్‌లో ఎక్కువగా పెట్టుబడులు పెడతాడు. అయిదేళ్ల క్రితం రూ. 80 కోట్లతో పోర్చుగల్‌లో ఒక లగ్జరీ హోటల్‌ని కొన్నాడు రొనాల్డో. అప్పటికే రాజధాని లిస్బన్‌లో నాలుగు ఇళ్లని కొనేశాడు. ఇవి కాకుండా ఒక నలభై కోట్ల రూపాయలు పెట్టి ఒక మాన్షన్‌ని, అరవై కోట్లు పెట్టి మరో ప్రాపర్టీని కొన్నాడు.
కొన్నాళ్ల క్రితం ఓ ఐదంతస్తుల బిల్డింగ్‌ను కొన్నాడు. దాన్ని హోటల్‌గానో డిస్కోగానో మారుద్దామనుకున్నాడు. చివరికి ఆ రెండూ కాకుండా తనకొచ్చిన ట్రోఫీలతో మ్యూజియంగా మార్చేశాడు. సీఆర్ 7 పేరుతో దుస్తులు, కీచెయిన్స్ లాంటివన్నీ కూడా అక్కడి స్టోర్స్ విక్రయిస్తుంటాయి. రొనాల్డో గ్యారేజ్‌లో లాంబోర్గినీ, పోర్షే, మెర్సిడెస్, బెంట్లీ లాంటి లగ్జరీ కార్లు కొలువుదీరి ఉంటాయి. పొదుపు, పెట్టుబడుల విషయం అలా ఉంచితే రొనాల్డో అడపా దడపా ఫ్యాన్స్‌కి ఇతోధికంగా ఆర్థిక సహాయం కూడా చేస్తుంటాడు.
మెస్సీ.. అనుకోకుండా రియల్టీలోకి..
రియల్ ఎస్టేట్‌పై ఆసక్తితో రొనాల్డో పెట్టుబడులు పెట్టగా.. మరో సాకర్ స్టార్, అర్జెంటీనా ఫుట్‌బాల్ ప్లేయర్ లియోనెల్ మెస్సీ ఊహించని విధంగా ఇందులోకి దిగాల్సి వచ్చింది. పొరుగింటి వారి గోల నుంచి ప్రశాంతత దక్కించుకునేందుకు మెస్సీ బలవంతంగా ఇన్వెస్ట్ చేయాల్సి వచ్చింది. స్పెయిన్‌లోని అతని పొరుగింటి వారు తమ ఇంటికి రిపేర్లు చేసుకుంటూ.. డబ్బులు సరిపోక మధ్యలో ఆపేశారట. ఎంతో కొంతకు దాన్ని కొనమని మెస్సీని అడిగారు. అతను ససేమిరా అనడంతో.. ఆ ఇంట్లో గదులను వాళ్లు లీజుకు ఇచ్చారు. అందులో దిగినవారు రోజూ నానా గోల చేస్తుండటంతో భరించలేక రెండు ఇళ్లకు మధ్య భారీ గోడ కట్టేశాడు మెస్సీ. దీనిపై కోర్టుకెళతామని పొరుగువారు బెదిరించడంతో.. చివరికి గత్యంతరం లేక ఆ ఇంటిని కొనుక్కున్నాడు మెస్సీ. ఆ విధంగా ఇష్టం లేకున్నా రియల్టీలో ఇన్వెస్ట్ చేశాడు.