ఇంటి కోసం పొదుపు..
సెలబ్రిటీ స్టైల్..
బాలీవుడ్ డెరైక్టర్ మహేష్ భట్ కుమార్తె ఆలియా భట్ (21) .. లుక్స్, యాక్టింగ్ నైపుణ్యాలపరంగా బాలీవుడ్‌లో బోలెడంత పేరు తెచ్చుకుంది. ఇప్పటికే నాలుగు సినిమాల్లో నటించిన ఆలియా.. ప్రతి సినిమాకు రూ. 2-5 కోట్ల దాకా రెమ్యునరేషన్ తీసుకుంటుందని పరిశ్రమలో టాక్. సిల్వర్ స్పూన్‌తో పుట్టినప్పటికీ ఆలియా భట్ డబ్బు విషయంలో ఆచి తూచే వ్యవహరిస్తుందట. బడ్జెట్‌కు లోబడే ఖర్చు చేస్తుంది. తాను పాటించే ఆర్థిక క్రమశిక్షణకు సంబంధించిన మరిన్ని వివరాలు తన మాటల్లోనే..
‘నా పాకెట్ మనీ రూ. 500తో మొదలైంది. నేను, మా అక్క జాగ్రత్తగా ఖర్చు చేయడాన్ని బట్టి పాకెట్ మనీ పెరిగేది. ఇంటర్‌లో ఉన్నప్పుడు నెలకు రూ. 4,000కు చేరింది. రెండేళ్ల క్రితం వచ్చిన స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ సినిమాకి ఫస్ట్ ఇన్‌స్టాల్‌మెంట్ కింద మొట్టమొదటిసారిగా రూ. 2.5 లక్షల చెక్ అందుకున్నాను.
మేం ఏదైనా బ్రాండెడ్ వస్తువులు కొనుక్కోవాలంటే మా సంపాదనతోనే కొనుక్కోమంటారు మా పేరెంట్స్. నా పారితోషికంతో ఖరీదైన ప్రాదా బ్యాగ్ కొందామనుకున్నాను. కానీ, అంతలోనే డబ్బు విషయంలో బాధ్యతగా ఉండాలన్నది గుర్తొచ్చింది. దీంతో, ఆ డబ్బు అలా బ్యాంకులోనే ఉంచేశాను. నేను సంపాదించడం మొదలుపెట్టిన తర్వాతే డెబిట్ కార్డు చేతికొచ్చింది. ఈ ఏడాదే నా ఇరవై ఒకటో పుట్టినరోజు నాడు మొట్టమొదటిసారిగా క్రెడిట్ కార్డు వచ్చింది. రోజువారీ చేసే ఖర్చుల విషయంలో బాధ్యతగా ఉండాలన్నది ఇవి నేర్పాయి.
ఖర్చుల విషయానికొస్తే.. నా బిల్స్ అన్నీ మా అమ్మే కడుతుంది. కానీ వాటికి సంబంధించిన చెక్కులపై నేనే సంతకం చేస్తాను కాబట్టి అన్ని ఖర్చుల గురించీ నాకు తెలుసు. అంతే కాదు నేను ఎంత ఇన్‌కం ట్యాక్స్ కట్టేదీ నాకు తెలుసు. ఇన్వెస్ట్‌మెంట్స్‌పై నాకు ఆసక్తి ఎక్కువే. ఫిక్సిడ్ డిపాజిట్లు, రియల్ ఎస్టేట్ వంటి సాధనాల గురించి తెలుసుకుంటుంటాను. ఇల్లు కొనుక్కోవాలన్నది నా ఆలోచన. దీనికోసమే నేను పొదుపు చేస్తున్నాను. అఫ్‌కోర్స్ కారు కూడా కొనుక్కోవాలని ఉంది. అయితే, మూడు నెలలకోసారి మనసు మారిపోతుంటోంది కనుక.. ఏది కొంటానో చూడాలి’.