నాన్న స్క్రిప్టు రాసిస్తానన్నారు
భవిష్యత్తులో నాన్న తనకోసం స్క్రిప్టు రాసిస్తానన్నారని ప్రముఖ నిర్మాత మహేశ్‌భట్ కుమార్తె అలియాభట్ చెప్పింది. ‘ నాన్న ఆ సినిమాకు దర్శకత్వం వహించరు. అయినప్పటికీ కచ్చితంగా నాకోసం ఓ స్క్రిప్టు రాసిస్తానని హామీ ఇచ్చారు.ఆ సినిమాలో నా ప్రతిభ చూపుతా. ఇది కచ్చితంగా జరిగి తీరుతుంది’ అని అంది. త్వరలో విడుదల కానున్న ‘హంప్టీ శర్మ కీ దుల్హనియా’ సినిమా ప్రమోషన్ ఈవెంట్‌లో పాల్గొన్న అలియా అనేక విషయాలు చెప్పింది. అలియా గతంలో హైవే సినిమాలో పాడింది. దీంతోపాటు ‘మైన్ తెన్ను సంఝావా’ అనే ఆల్బంకు కూడా తనస్వరాన్ని అందించింది. నగరంలో బుధవారం జరిగిన ఈ ఆల్బం విడుదల కార్యక్రమానికి అలియా తండ్రి, బాలీవుడ్ నిర్మాత మహేశ్‌భట్‌కూడా హాజరయ్యాడు. ఈ సందర్భంగా మహేశ్ మాట్లాడుతూ ‘కుమార్తె అలియా పాడిన పాట వినగానే ఆనందంతో కళ్లు చెమర్చాయి.
సాధారణంగా అలియా పాల్గొనే కార్యక్రమాలకు నేను హాజరుకాను. అయితే ఇవాళ వచ్చా. ఇందుకు కారణం రెండు రోజుల క్రితం అలియా తాను పాడిన పాటను నాకు పంపింది. దానిపై నా అభిప్రాయం కోరింది. ఈ పాట వినగానే నా కళ్లల్లో నీళ్లు వచ్చాయి. ఈ పాట తన హృదయంతో పాడినట్టు నాకు అనిపించింది. గీతాలాపనకు సంబంధించి అలియా ఎటువంటి శిక్షణ పొందలేదు. అయినప్పటికీ ఇదే చెప్పుకోదగ్గ విషయం’ అని అన్నాడు. అనంతరం అలియా మాట్లాడుతూ ‘గీతాలాపన తనకు వారసత్వంగా వచ్చింది. మా నాన్న వయోలిన్ వాయించేవారు. మా కుటుంబంలో సంగీతం నిరంతరం ప్రవహిస్తూ ఉంటుంది. మా కుటుంబమంతా సంగీతాన్ని ఆస్వాదిస్తుంది’ అని ఈ 21 ఏళ్ల ముగ్ధమనోహరి తెలిపింది.