Cell Phone Charger
-
సెల్ చార్జర్ కోసం దారుణ హత్య
వల్లూరు: సెల్‌ఫోన్ చార్జర్ విషయమై మొదలైన చిన్న పాటి ఘర్షణ ఒక యువకుని దారుణ హత్యకు దారి తీసింది. మాటకుమాట పెరిగి కట్టెలు, కత్తితో దాడి చేయడంతో మాదాని మధుసూదన్ (22) మృతి చెందాడు. వల్లూరు ఎస్ఐ రాజగోపాల్ తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. వల్లూరు గ్రామ పంచాయతీ పరిధిలోని లింగాయపల్లెకు చెందిన మాదాని మధుసూదన్ సమీప బంధువైన శివక్రిష్ణ సెల్‌ఫోన్ చార్జర్ తెచ్చుకున్నాడు. ఆదివారం మధ్యాహ్నం దీనిపై మధుసూదన్, శివక్రిష్ణ మధ్య చిన్న పాటి వాగ్వాదం జరిగింది. ఇది ఘర్షణకు దారి తీయడంతో గ్రామస్తులు ఇద్దరినీ మందలించి పంపించి వేశారు. దీంతో సెల్‌ఫోన్ చార్జర్‌ను మధుసూదన్ తిరిగి ఇచ్చేశాడు. అయితే దీనిపై కక్ష పెంచుకున్న శివక్రిష్ణ గ్రామానికి చెందిన మరో నలుగురు యువకులతో కలిసి.. తమ ఇంటి ముందు నుంచి వెళుతున్న మధుసూదన్‌పై కట్టెలు, కత్తులతో దాడి చేశారు. కత్తులతో పొడవడంతో రక్తపు మడుగులో పడిన అతను అక్కడికక్కడే మృతి చెందాడు. నిందితులు ద్విచక్ర వాహనాల్లో అక్కడి నుంచి పరారయ్యారు. కాగా మృతునికి తండ్రి లేకపోగా జీవనోపాధి కోసం వెళ్లిన తల్లి కువైట్‌లో ఉన్నారు. ప్రస్తు తం మధుసూదన్ అమ్మమ్మ దగ్గర ఉంటూ కడపలోని ప్రభుత్వ కళాశాలలో చదువుకుంటున్నాడు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం కడపకు తరలించారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ రాజగోపాల్ తెలిపారు. సంఘటన స్థలానికి కడప డీఎస్పీ సూర్యనారాయణ, కడప రూరల్ సీఐ వినయ్‌కుమార్‌రెడ్డి, ఎస్ఐ రాజగోపాల్ చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని పరిశీలించి సంఘటన గురించి ఆరా తీశారు. -
బ్యాటరీ.. నో వర్రీ!
సెల్‌ఫోన్ చార్జ్ అయిపోతోంది..! చార్జర్ మరచిపోయా.. ఫోన్ డెడ్ అయింది.. కరెంటు పోయింది.. ఫోన్ చార్జ్ చేసుకునేదెలా? ఇలా ఎన్నోసార్లు మీరు అనుకునే ఉంటారు. ఇకపై వీటికి రాం! రాం! చెప్పేయొచ్చు. ఎలాగంటారా? యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్ శాస్త్రవేత్తలు బ్యాటరీనే అవసరం లేని సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను అభివృద్ధి పరిచారు. బ్యాటరీ లేకుండా ఎలా పని చేస్తుందా అనే కదా మీ అనుమానం. గాల్లోని రేడియో తరంగాలు.. సౌర శక్తితో ఈ ఫోన్ పనిచేస్తుందన్న మాట. స్మార్ట్ఫోన్లలో అతి ముఖ్యమైన ప్రక్రియ ఏది? మన మాటల్ని ఫోన్‌కు అర్థమయ్యే డిజిటల్ భాషలోకి మార్చడం. డిజిటల్ రూపంలోని మాటలను మనకు వినపడేలా చేయడం. ఈ రెండు ప్రక్రియలకు బోలెడంత విద్యుత్తు ఖర్చవుతుంది. ఈ కారణంగానే రేడియో తరంగాల గురించి చాలాకాలంగా తెలిసినప్పటికీ దాన్ని వాడుకోగల టెక్నాలజీ అభివృద్ధి కాలేకపోయింది. ఈ నేపథ్యంలో యూనివర్సిటీ ఆఫ్ వాసింగ్టన్ శాస్త్రవేత్తలు ఫోన్లలోని మైక్రోఫోన్ లేదా స్పీకర్ తాలూకు ప్రకంపనల వల్ల పుట్టే శక్తితోనే మాటలు డిజిటల్లోకి.. డిజిటల్ సంకేతాలు మాటల్లోకి మారేలా చేయగలిగారు. అయినా ఈ ఫోన్‌కు దాదా పు 3.5 మైక్రోవాట్ల విద్యుత్తు అవసరమైంది. ఈ విద్యుత్‌ను ఫోన్‌కు దూరంగా ఉన్న ఓ పరికరం ద్వారా విడుదల చేసిన ఖీరేడియో సంకేతాల ద్వారా పుట్టించారు. ఒకవేళ రేడియో తరంగాల ప్రసారానికి అవకాశం లేకపోతే.. చిన్న సైజు సౌర ఫలకాల ద్వారా కూడా ఈ విద్యుత్‌ను ఉత్పత్తి చేయొచ్చు. భవిష్యత్తులో ప్రతి సెల్‌ఫోన్ టవర్ లేదా వైఫై రూటర్ల ద్వారా కొన్ని రేడియో సంకేతాలను ప్రసారం చేస్తే చాలు.. ఎక్కడైనా బ్యాటరీల్లేకుండానే ఫోన్లు పనిచేస్తాయని వంశీ తాళ్ల అనే భారత సంతతికి చెందిన శాస్త్రవేత్త పేర్కొంటున్నారు. ఈ టెక్నాలజీతో సిద్ధం చేసిన ఓ నమూనా ఫోన్‌ను ఇప్పటికే విజయవంతంగా పరీక్షించామని బ్యాటరీ లేకుండానే స్కైప్ కాల్స్ కూడా చేశామని గొల్లకోట శ్యామ్ అనే మరో శాస్త్రవేత్త తెలిపారు.