నువ్వెంత.. నువ్వెంత
కడప అగ్రికల్చర్,న్యూస్‌లైన్: ఏయ్ నువ్వెంత.. నువ్వెంత అంటూ దూషించుకున్నారు... పార్టీ తరపున టికెట్టు పొంది ప్రచారానికి రాకుండా సెల్‌ఫోన్ స్విచ్ఛాప్ చేసి కూర్చోవడానికి సిగ్గుగా లేదని ఒకరంటే... ఏయ్ ఏమనుకుంటున్నావ్... నీలాంటోళ్లను చాలా మందిని చూశా..నాకేంది నువ్వు చెప్పేది అంటూ మరొకరు వాగ్వాదం చేసుకున్నారు. శనివారం కడప నగరంలోని ఇందిరాభవన్‌లో సార్వత్రిక ఎన్నికల ఓటమికి దారితీసిన కారణాలపై ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశంలో చోటు చేసుకున్న వ్యాఖ్యానాలు ఇవి.
పులివెందుల అసెంబ్లీకి పోటీ చేసిన రాజగోపాల్‌రెడ్డి మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ తరపున అభ్యర్థులు పోటీ చేయకపోవడం వల్లే కేడర్ దెబ్బతిందన్నారు. దీనిపై డీసీసీ ఉపాధ్యక్షుడు వేలూరి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికల్లో నామినేషన్ వేసి ప్రచారం కూడా చేయకపోతే ఎలా ఓట్లు వస్తాయన్నారు. ప్రచారానికి రావాలని బతిమలాడాల్సివచ్చిందన్నారు. దీంతో ఇరువురూ నువ్వెంత అంటే నువ్వెంత అంటూ వాగ్వాదానికి దిగారు.
అదే సందర్భంలో ఏపీసీసీ మహిళా సభ్యురాలు చిక్కెరూరు జానకీ మాట్లాడుతూ కాంగ్రెస్‌పార్టీ బఫేలాగా మారిందని అన్నారు. ఆమె మాటలకు అభ్యంతరం వ్యక్తం చేస్తూ 150 సంవత్సరాల చరిత్ర కలిగిన పార్టీని ఇలా తులనాడుతారా అంటూ మైదుకూరుకు చెందిన ఇంతియాజ్భాష ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో మళ్లీ వాగ్వాదం చోటు చేసుకుంది. ఒక మహిళా నాయకురాలు మాట్లాడుతుంటే పెడార్థాలు తీస్తూ మాట్లాడటం తగదని చిక్కెరూరు జానకి ఆవేదన వ్యక్తం చేశారు.
జమ్మలమడుగు అభ్యర్ధి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ విభజనకు దారితీసిన కారణాలు చెప్పడంలో రాష్ట్ర నాయకత్వం విఫలమైంద న్నారు. జిల్లా ఇన్చార్జ్ అధ్యక్షుడు ఎస్. నజీర్ అహ్మద్ మాట్లాడుతూ పార్టీకి కేడర్ ఉందన్నారు. పార్టీలో ఉండి ఇతర పార్టీల్లోకి పోయిన నేతలు కాంగ్రెస్‌పార్టీ పని అయిపోయిందని లేనిపోని అపోహలు, భయాలు కలిగించడంవల్లే కొంత కేడర్ వివిధ పార్టీల్లో చేరిందని అన్నారు. ఇప్పుడున్న కేడర్‌ను కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. సమావేశంలో చర్చించిన విషయాలను పార్టీ హైకమాండ్ దృష్టికి తీసుకుపోతామన్నారు.
డుమ్మా కొట్టిన మాజీ మంత్రులు.....
సమావేశానికి మాజీ మంత్రులు అహ్మదుల్లా, రామచంద్రయ్య డుమ్మా కొట్టడం పట్ల కార్యకర్తలు అసహనం వ్యక్తం చేశారు. కీలక సమావేశానికి రాకపోవడం ఏమీ బాగోలేదని కార్యకర్తలు గుసగుసలాడుకోవడం కనిపించింది. సమావేశానికి వస్తే ఎక్కడ నిలదీస్తారోనని రాలేదని చర్చించుకున్నారు. మాజీ మంత్రి రామమునిరెడ్డి, జిల్లా సేవాదళ్ అధ్యక్షుడు బండి జకరయ్య, ఏపీసీసీ ఎస్సీ సెల్ కన్వీనర్ దాసరి శ్రీనివాసులు, జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు జోజప్ప, డీసీసీ ప్రధాన కార్యదర్శి నజీర్భాష, పార్టీ అధికార ప్రతినిధి నీలి శ్రీనివాసరావు, ఎన్ఎస్యుఐ అధ్యక్షుడు ఫిరోజ్‌ఖాన్, ప్రొద్దుటూరు, కమాపురం, బద్వేలు అభ్యర్థులు జి శ్రీనివాసులు, సోమశేఖరరెడ్డి, కమల్ప్రభాష్ తదితరులు పాల్గొని మాట్లాడారు.