cell Tower
-
బిడ్డలతో సెల్ టవర్ ఎక్కిన తండ్రి
సాక్షి, చింతామణి: తన తండ్రి వద్ద భూమిని అక్రమంగా రాయించుకున్నారని గంగరాజు అనే వ్యక్తి తన ముగ్గురు బిడ్డలతో కలిసి సెల్ టవర్ ఎక్కి ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించిన ఘటన చింతామణి పట్టణంలోని కన్నంపల్లి ప్రాంతంలో చోటు చేసుకుంది. తాలూకాలోని మూగలమర్రి గ్రామానికి చెందిన దొడ్డ నరిసింహప్ప అనే వ్యక్తి సర్వే నంబర్ 72లో 8 ఎకరాల 30 గుంటల భూమిలో తనకు వచ్చిన రెండు ఎకరాల 30 గుంటల భూమిని అదే గ్రామానికి చెందిన వెంకట రెడ్డి, పల్లప్ప, నారాయణప్ప అనే వారికి రిజిస్టర్ చేయించారు. దీనికి సంబంధించి దొడ్డ నరసింహప్ప కుమారుడు గంగరాజు తన బిడ్డలు నిఖిల్, నితిన్, అంకిత, తన సంతకం లేకుండా భూమిని కొనుగోలు చేశారని, తనకు అన్యాయం జరిగిందని పోలీసు, రెవెన్యూ అధికారులకు విన్నవించాడు. ప్రయోజనం లేకపోవడంతో శనివారం ఉదయం గ్రామంలోని సెల్ టవర్‌ను తన ముగ్గురు బిడ్డలతో కలిసి ఎక్కాడు. విషయం తెలుసుకున్న పోలీసులు, రెవెన్యూ అధికారులు అక్కడికి చేరుకుని సమస్య పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. పోలీసులు గంగరాజును, పిల్లలను సురక్షితంగా కిందకు దించారు. దీంతో గ్రామస్తులు ఊపిరి పీల్చుకున్నారు. (చదవండి: ఫేస్బుక్, ఇన్‌స్టా రీల్స్ చేయడమంటే ఇష్టం.. అలా ఢిల్లీ వ్యక్తితో వివాహిత పరార్) -
పంచాయతీ భవనం కోసం సెల్‌టవర్ ఎక్కాడు
తంబళ్లపల్లి: తమ గ్రామానికి మంజూరైన పంచాయతీ భవనాన్ని తమ గ్రామంలో నిర్మించకుండా వేరే గ్రామంలో నిర్మించడాన్ని వ్యతిరేకిస్తూ ఓ టీడీపీ కార్యకర్త సెల్‌టవర్ ఎక్కాడు. ఏడు గంటలుగా అక్కడే ఉండి హల్చల్ చేస్తున్నాడు. చిత్తూరు జిల్లాలోని తంబళ్లపల్లిలో గల బురుజుపల్లికి పంచాయతీ భవనం లేదు. దానిని వేరే గ్రామంలో నిర్మించేందుకు నిధులు మంజూరు చేశారు. అయితే బురుజుపల్లి పంచాయతీ అని పేరుందని, అందువల్ల ఆ భవనాన్ని ఇక్కడే నిర్మించాలని గ్రామస్థులు పంచాయతీ అధికారులకు ఎన్నోసార్లు విజ్ఞప్తి చేశారు. ఎవరూ స్పందించకపోగా పనులను మొదలుపెట్టారు. దీంతో ఆగ్రహించిన టీడీపీ కార్యకర్త అయిన రాజశేఖర్ అనే యువకుడు మంగళవారం ఉదయం తంబల్లపల్లి తహసీల్దార్ కార్యాలయం పక్కనే ఉన్న సెల్ టవర్ ఎక్కి నిరసనకు దిగాడు. సాయంత్రానికి పంచాయతీ అధికారి నుంచి తాత్కాలిక నిలుపుదల ఉత్త్ర్వులు జారీ చేసినా వినకుండా టవర్‌పైనే ఉండిపోయాడు. నీళ్లు, ఆహారం స్వీకరించకుండా నిరసన కొనసాగిస్తున్నాడు. . -
సెల్ టవర్ ఎక్కి హల్చల్
సాక్షి, చెన్నై: ఆత్మహత్య చేసుకుంటానంటూ వ్యక్తి సెల్‌టవర్ ఎక్కి హల్చ ల్ సృష్టించిన సంఘటన గురువారం టీనగర్ చోటుచేసుకుంది. దండపాణి వీధిలోని ఎయిర్టెల్ టవర్ పైకి ఎక్కిన వ్యక్తి తాను ఆత్మహత్య చేసుకోబోతున్నట్టు కేకలు పెట్టాడు. దీంతో అక్కడ జనం గుమిగూడి దూకొద్దం టూ సినీమా ఫక్కీలో కాసేపు విన్నవించుకున్నారు. సమాచారం అందుకున్న టీనగర్ అగ్నిమాపక శాఖ అధికారులు అక్కడికి చేరుకుని 45 నిమిషాలు శ్రమించారు. ఆ వ్యక్తిని బుజ్జగించేందుకు నానాతంటాలు పడ్డారు. చివరకు సాహసం చేసి ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అతడ్ని టీనగర్ పోలీసులకు అప్పగించారు. విచారణలో అతడి పేరు కార్తీక్(38) అని తేలింది. ఆ టవర్‌కు కూత వేటు దూరంలో ఉన్న ప్రముఖ ట్రావెల్స్‌లో కార్తీక్ పని చేస్తున్నట్టు, అక్కడ ఏర్పడ్డ తగాదా, ఇబ్బందులతో టవర్ ఎక్కినట్టు తేలింది. అతడిపై కేసు నమోదు చేసిన పోలీసులు సంబంధిత ట్రావెల్స్‌లో విచారిస్తున్నారు. ఈ ఆత్మహత్య హైడ్రామా పుణ్యమా అంటూ ఆ మార్గంలో కాసేపు ట్రాఫిక్ తంటాలు తప్పలేదు.