సిమెంటు మంట!
సాక్షి, తణుకు (పశ్చిమ గోదావరి): కేవలం నెల రోజుల వ్యవధిలోనే సిమెంటు ధర చుక్కలనంటింది. పెరిగిన ధరలు భవన నిర్మాణ రంగంపై తీవ్ర ప్రభావాన్నే చూపుతున్నాయి. రోజురోజుకూ
పెరుగుతున్న ధర కారణంగా నిర్మాణదారులు బెంబేలెత్తిపోతున్నారు. సామాన్యుడి సొంత ఇంటి కలపై పిడుగు పడినట్లైంది. ఇప్పటికే పనులు ప్రారంభించిన వారు నిర్మాణ వ్యయం అంచనాలను దాటిపోతుండటంతో అప్పులు చేస్తున్నారు. కొందరు బిల్డర్లు అయితే వడ్డీ భారం పెరుగుతుందనే కారణంతో అప్పు చేసి మరీ నిర్మాణ పనులను కొనసాగిస్తున్నారు. ఇదిలా ఉంటే సిమెంటు ధర మాత్రం రూ.330 నుంచి రూ.370 వరకు పలుకుతోంది. ధర పెరగుతుండటంతో భవనాలతోపాటు జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి పనులపై తీవ్ర ప్రభావం పడుతోంది.
చుక్కలనంటుతున్న ధర
సాధారణంగా భవన నిర్మాణ పనులకు జనవరి నుంచి జూన్ వరకు సీజన్‌గా చెబుతారు. ఈ వ్యవధిలోనే ఎక్కువగా నిర్మాణాలు జరుగుతుంటాయి. అయితే ఈ సీజన్లో మాత్రం కొంత వరకు ధరలు పెరుగుతుంటాయి. అయితే ఈ సారి మాత్రం పెరిగిన ధరలు నిర్మాణదారులకు చుక్కలు చూపిస్తున్నాయి. భవన నిర్మాణంలో కీలకమైన సిమెంటు ధర భారీగా పెరిగింది. నెల రోజుల క్రితం వరకు బస్తా సిమెంటు ధర రూ. 330 వరకు ఉండగా ప్రస్తుతం ఆయా కంపెనీలను బట్టి రూ. 330 నుంచి రూ. 370 వరకు ధర పలుకుతోంది. దాదాపు రూ. 100కు పైగా ధర పెరగడం సామాన్యవర్గాలకు మింగుడు పడటంలేదు.
ఇక ఇనుము సైతం రెండు నెలల వ్యవధిలోనే టన్నుకు రూ. 6 వేలు వరకు ధర పెరిగింది. ఇసుక ధర సైతం అదే బాట పట్టడంతో భవన నిర్మాణ రంగంపై తీవ్ర ప్రభావం పడింది.
నిలిచిన ఇళ్ల నిర్మాణం
ఇప్పుడు ఎవరైనా ఇంటి నిర్మాణం మొదలు పెడితే కళ్లు తిరగడం ఖాయం. కొద్ది నెలలుగా పెరుగుతున్న గృహనిర్మాణ సామగ్రి ధరలు సామాన్యులు, మధ్యతరగతి ప్రజలనే కాకుండా కాస్త ఉన్న వాళ్లను సైతం కలవరానికి గురి చేస్తున్నాయి. గతేడాదికి, ఇప్పటికి దాదాపు ఐరన్, సిమెంటు, ఇసుక ధరలు భారీ మొత్తంలో పెరిగాయి. పెరిగిన ధరలతో పేద, మధ్యతరగతి ప్రజలు తలపెట్టిన నిర్మాణాలను అర్థాంతరంగా నిలిపివేస్తున్నారు. జిల్లాలో ఏడాదికి సుమారు 20 వేల వరకు పక్కా ఇళ్ల నిర్మాణం జరుగుతోందని బిల్డర్లు పేర్కొంటున్నారు.
గృహనిర్మాణ సామగ్రి ధరలు పెరగడంతో దాదాపు 10 వేలకు పైగా పక్కా గృహ నిర్మాణాలు నిలిచిపోయాయి. మిగిలిన ఇళ్లు వివిధ దశల్లో కునారిల్లుతున్నాయి. ధరలు తగ్గే అవకాశం లేకపోవడంతో మొదలు పెట్టిన ఇళ్లు ఇప్పట్లో పూర్తయ్యే అవకాశాలు లేవు. మరోవైపు జిల్లాలోని సుమారు 100కుపైగా అపార్టుమెంట్లు సగంలోనే నిలిచాయి. ఇదిలా ఉంటే కూలీల రేట్లు సైతం అమాతం పెంచేశారు. రోజుకు రూ.600 పలుకుతుండటంతో భారం మరింత పెరుగుతోంది. సాధారణంగా వేసవిలోనే నిర్మాణాలు ఎక్కువగా జరుగుతాయి. దీన్ని ఆసరాగా చేసుకుని వ్యాపారులు ఐరన్, ఇసుక, సిమెంటు ధరలు పెంచడం సహజం. అయితే ఈ సారి గతంలో ఎన్నడూ లేని స్థాయిలో ధరలు పెరిగాయని నిర్మాణదారులు గగ్గోలు పెడుతున్నారు.
కష్టతరంగా మారింది
పెరుగుతున్న గృహనిర్మాణ సామగ్రి ధరలు గుబులు పుట్టిస్తున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా సిమెంటు ధర పెరిగింది. పెరిగిన ధరలతో నిర్మాణాలు నిలిపివేస్తున్నాం. ఇదే సమయంలో కూలీల కొరత వేధిస్తోంది. కూలీ ధరలు సైతం విపరీతంగా పెంచేయడంతో ఇబ్బందులు పడుతున్నాం.
–పి.రవిశంకర్, బిల్డర్, తణుకు