‘గూడు’కట్టుకున్న భయం
కొత్త ప్రభుత్వంపై కోటి ఆశలు పెట్టుకున్నారు. రుణాలు మాఫీ చేస్తారని రైతులు, మహిళలు.. పెన్షన్లు పెంచుతారని వృద్ధులు, వికలాంగులు.. కొత్తగా ఉద్యోగాలు ఇస్తారని యువకులు.. ఇందిరమ్మఇళ్ల బిల్లులు చెల్లిస్తారని లబ్ధిదారులు ఇలా ఒక్కరేమిటి.. అన్ని వర్గాల ప్రజలు అనుక్షణం కలలుగన్నారు.
అయితే ప్రభుత్వం తీరుతో అందరిలోనూ గుబులు పట్టుకుంది. ఈ ప్రభుత్వం ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటుందా.. ఒక్కో పథకాన్ని ఎత్తివేస్తూ అప్పుల పాలు చేస్తుందా అని ప్రతి ఒక్కరిలోనూ అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఇదే కోవలోనే ప్రస్తుతం ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు.
బి.కొత్తకోట: కొత్త రాష్ట్రంలో గృహనిర్మాణ శాఖకు పనిలేకుండా పోయింది. కొత్తప్రభుత్వం అధికార యంత్రాంగాన్ని పరుగులు పెట్టిస్తుందని భావిస్తే పరిస్థితులు అందుకు పూర్తి విరుద్ధంగా ఉంటున్నాయి. దీంతో మండల స్థాయిలో ఇందిరమ్మ గృహనిర్మాణాలు పూర్తిగా ఆగిపోయాయి. నాలుగు నెలలుగా నిర్మాణాలు అటకెక్కినా, 9 వేల బిల్లులు పెండింగ్లో ఉన్నా పట్టించుకోని ప్రభుత్వం.. లాగ్ఇన్ ఇస్తే నిధులభారం పడుతుందని గృహనిర్మాణ శాఖ వైపు కన్నెత్తి చూడడంలేదు. మరోవైపు అనర్హుల పేరుతో ఇళ్లను రద్దు చేసే దిశగా చర్యలు వేగవంతం అవుతున్నాయి.
దీంతో ఇందిరమ్మ పథకంపై నీలినీడలు అలుముకుంటున్నాయి. ఈ పథకం మునుపటిలా పరుగులు పెడుతుందా? లేక నిధులు ఇవ్వకుండా దశలవారీగా నీరుగార్చేలా చేస్తారా? అన్నది అధికారుల్లో చర్చ సాగుతోంది. ఈ పరిస్థితుల్లో జిల్లాలో ఇందిరమ్మ లబ్ధిదారుల పరిస్థితి దయనీయంగా మారింది. మండలాల్లో పనిచేస్తున్న అధికారులు, సిబ్బందికి పనిలేకుండాపోయింది.
ఎక్కడి నిర్మాణాలు అక్కడే
జిల్లాలో ఇందిరమ్మ గృహనిర్మాణాలు ఎక్కడికక్కడే ఆగిపోయాయి. బిల్లుల చెల్లింపులు పూర్తిగా నిలిచిపోవడంతో లబ్ధి దారులు నిర్మాణాలు చేపట్టడం లేదు. ఇప్పటికే జరి గిన నిర్మాణాలకు చెల్లింపులు ఎప్పుడు జరుగుతాయే అధికారులే చెప్పలేని పరిస్థితు లు. దీంతో అప్పులు చేయ డం ఎందుకని లబ్ధిదారులు పనులు ఆపేశారు. జిల్లా వ్యాప్తంగా 4,43,009 ఇళ్లను మంజూరు చేశారు.
ఇందులో 2,95,134 ఇళ్లను పూర్తిచేశారు. 31,900 ఇళ్లు పునాదులు, 2,130 ఇళ్లు గోడల స్థాయిలో,13,170 ఇళ్లు రూఫ్లెవల్లో ఉన్నాయి. 1,00671 ఇళ్ల ఇంతవరకు ప్రారంభించనే లేదు. ఈ గణాంకాలు మే 24 నాటివి కాగా రూ.1236.2 కోట్లను ఇందిరమ్మ నిర్మాణాల కోసం ఖర్చు చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ లెక్కలో మార్పులేదు. ఎందుకంటే అప్పటి నుంచి ఇళ్ల నిర్మాణాలు పూర్తిగా ఆగిపోయాయి.
సిమెంటు సరఫరా నిలిపివేత
ప్రభుత్వం జిల్లాకు సిమెంటు సరఫరాను నిలిపివేసింది. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల కోసం జిల్లా వ్యాప్తంగా 28 గోదాములను గృహ నిర్మాణ శాఖ నిర్వహిస్తోంది. ఇక్కడ వేల టన్నుల సిమెంటు నిల్వలు ఉండాల్సింది. ప్రతి నెలా సిమెంటు కర్మాగారాల నుంచి సిమెంటు సరఫరా అవుతుంది. అయితే ఏప్రిల్ నుంచి సరఫరా పూర్తిగా ఆగిపోయింది. జిల్లాలో తక్షణమే నిర్మాణాలు ప్రారంభిస్తే లబ్ధిదారులకు అవసరమైన సిమెంటును పంపిణీ చేయలేరు. 28 గోదాముల్లో ప్రస్తుతం 2,500 టన్నుల సిమెంటు నిల్వలు ఉన్నాయి.
మార్చి 23 నుంచి బిల్లులు లేవు
జిల్లాలోని ఇందిరమ్మ పథకం లబ్ధిదారులకు మార్చి 23వ తేదీ నుంచి బిల్లులు మంజూరు కాలేదు. అంతకు ముందు ఆన్లైన్లో ఉంచిన బిల్లులకు మాత్రమే చెల్లిం పులు జరిగాయి. నాలుగు నెలలుగా లబ్ధిదారులకు ఒక్క రూపాయి చెల్లింపు జరగలేదు. జిల్లా వ్యాప్తంగా సుమారు 9 వేల బిల్లులు పెండింగ్లో ఉండగా వీరికి రూ.15.66 కోట్లు చెల్లించాల్సి ఉంది.
ఈ నిధులను ప్రభుత్వం ఎప్పుడు చెల్లిస్తుందనేది ప్రశ్నార్థకంగా మారింది. లబ్ధిదారులు మండల కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. బిల్లులు ఎప్పుడిస్తారని ప్రశ్నిస్తే అధికారులు తెల్లమొహం వేస్తున్నారు. ఎప్పుడేమి జరుగుతుందో తెలియదు.. ఇక బిల్లుల గురించి ఏం చెప్పగలమంటూ నిర్లిప్తత వ్యక్తం చేస్తున్నారు.
ఇళ్ల రద్దుకు నివేదికలు సిద్ధం
జిల్లాలో 15,600 ఇళ్లను రద్దు చేసేందుకు అధికారులు నివేదికలు సిద్ధం చేశారు. దీనికి సంబంధించి ఇప్పటికే సబ్డివిజన్లలో పనిచేస్తున్న డీఈ స్థాయి అధికారుల నుంచి నివేదికలను తెప్పించుకున్నారు. జిల్లాలో 1,00,671 ఇళ్లు ప్రారంభానికి నోచుకోకుండా ఉండగా అందులో 15,600 మందిని అనర్హులుగా గుర్తించారు. జిల్లాలోని 18 సబ్ డివిజన్లకు చెందిన ఈ లబ్ధిదారులకు మంజూరు చేసిన ఇళ్లను రద్దు చేసే అవకాశాలు అధికంగా ఉన్నాయి. పైకి అధికారులు ఏమీ చెప్పకపోయినా ప్రభుత్వం నిర్ణయం ఇదేనని స్పష్టమవుతోంది.
లాగ్ ఇన్ ఇస్తే నిధులు ఇవ్వాల్సివస్తుందని..
గృహనిర్మాణాలకు సంబంధించి బిల్లులు చెల్లించాలంటే డీఈలు చర్యలు తీసుకోవాలి. దీనికి ప్రభుత్వం శాఖాపరంగా నిర్వహిస్తున్న ఆన్లైన్లో లబ్ధిదారుల వివరాలు ఉంచాలి. ఇలా ఉంచాలంటే ఆన్లైన్ వివరాలు నమోదు చేసేందుకు డీఈలకు లాగ్ఇన్ పాస్వర్డ్ ఇవ్వాలి. అది ఇచ్చాక అధికారులు బిల్లుల కోసం లబ్ధిదారుల వివరాలను ఇచ్చాక వెంటనే బిల్లుల సొమ్మును లబ్ధిదారుని ఖాతాకు చెల్లించాలి.
అయితే ఇప్పటికిప్పుడే గృహనిర్మాణాలకు సంబంధించిన లాగ్ఇన్ ఇస్తే వెనువెంటే నిధులభారం పడుతుంది. ఈ ఒక్క జిల్లాలోనే రూ.15.66 కోట్లు పెండింగ్ ఉంది. దీంతో పాటు పేరుకుపోయిన నమోదుకాని ఇళ్ల బిల్లులు ఇంకా కోట్లలోనే. దీంతో లాగ్ఇన్ జోలికి పోకపోతే బిల్లుల చెల్లింపు సమస్య ఉండదని ప్రభుత్వం భావించి దీనికి దూరంగా ఉన్నట్టు స్పష్టమవుతోంది. ఇది లబ్ధిదారులకు ఇబ్బందికరంగా మారింది.