Central Advisory Board of Education
-
‘జాతీయ అటెండెన్స్ పాలసీ’ పెట్టండి: సబితా
ఢిల్లీ: జాతీయ మెరిట్ స్కాలర్షిప్ మాదిరిగా ‘జాతీయ అటెండెన్స్ పాలసీ’ పెట్టి విద్యార్థులను ప్రోత్సాహించాలని తెలంగాణ విద్యాశాఖమంత్రి సబితా ఇంద్రారెడ్డి కోరారు. శనివారం ‘సెంట్రల్ అడ్వైజరి బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్’ సమావేశంలో పాల్గొన్న మంత్రి ‘ఎడ్యుకేషన్ కొత్త డ్రాఫ్ట్ పాలసీ’ పై పలు సూచనలు, సలహాలను ఇచ్చారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పూర్వ ప్రాథమిక విద్యను ప్రవేశ పెట్టాలని పాలసీలో ఉందని.. దానిని స్వాగతిస్తున్నామన్నారు. ఆ పాలసీకి అయ్యే ఖర్చు కేంద్రమే భరించాలని సూచించారు. తరగతులు ఏర్పాటు చేస్తున్నపుడు స్థానిక గ్రామస్థులనే నియమించుకోవాలని కోరామని తెలిపామన్నారు. 8, 9, 10 తరగతుల్లో వృత్తి విద్య అమలు చేయాలని కోరారు. విద్యార్థుల కోసం జిల్లాకో కౌన్సిలింగ్ సంస్థ పెట్టాలన్నారు. తీవ్ర ఒత్తిడిలో ఉండే విద్యార్థులకు ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు. పాఠశాలల్లో మాతృ భాషలో బోధన అమలు చేయాలని.. ప్రయివేటు విద్యాసంస్థలలో కూడా ఈ విధానం అమలు చేయాలని చెబుతున్నామని పేర్కొన్నారు. అలా అయితేనే లక్ష్యం నెరవేరుతుందన్నారు. ‘రైట్ టూ ఎడ్యుకేషన్ యాక్ట్’ ను పరిశీలంచాలని ముసాయిదాను మంత్రి కోరారు. కేంద్రంతో సంబంధం లేకుండా తెలంగాణలో విద్య వ్యాప్తికి చాలా కార్యక్రమాలు చేస్తున్నామని స్పష్టం చేశారు. మధ్యాహ్న భోజన పథకంలో 60 శాతం కేంద్రం, 40 శాతం రాష్ట్రం భరిస్తోందన్నారు. ఈ పథకంలో సన్న బియ్యం పెడుతున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని పేర్కొన్నారు. కేంద్రం 7వ తరగతి వరకే అమలు చేస్తే.. తెలంగాణ రాష్ట్రంలో 8, 9, 10వ తరగతి విద్యార్థులకు కూడా అమలు చేస్తున్నామని వెల్లడించారు. ‘మోడల్ స్కూల్ వ్యవస్థ’ ను కేంద్రం పక్కన పెడితే, స్వంతంగా రాష్ట్ర ప్రభుత్వ ఖర్చుతో వాటిని కొనసాగిస్తున్నామని మంత్రి తెలిపారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన గురుకుల పాఠశాలలు విజయవంతంగా నడుస్తున్నాయని, ప్రైవేట్ పాఠశాలలు మానేసి, ప్రభుత్వ గురుకులాలో విద్యార్థులు పెద్ద సంఖ్యలో చేరుతున్నారని వెల్లడించారు. మిగతా రాష్ట్రాలు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన గురుకుల పాఠశాలల వైపు చూస్తున్నాయన్నారు. పేద విద్యార్థుల విదేశీ విద్య కోసం సుమారు రూ. 20 లక్షల ఆర్థిక సహాయం చేస్తున్నామని పేర్కొన్నారు. దీంతో సుమారు 1995 మంది విద్యార్థులు విదేశాలలో విద్యను అభ్యసిస్తున్నారని మంత్రి తెలిపారు. ప్రతి విద్యార్థి బడిలో ఉండాలి, ఉన్న విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించే దిశగా తెలంగాణ ప్రభుత్వం పని చేస్తోందని సబితా స్పష్టం చేశారు. -
మంత్రాల్లోనే న్యూటన్ నియమాలు!
న్యూఢిల్లీ: డార్విన్ జీవపరిణామ సిద్ధాంతం తప్పని వాదించిన కేంద్ర మానవవనరులశాఖ సహాయమంత్రి సత్యపాల్ సింగ్.. మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. ప్రపంచ ప్రఖ్యాత భౌతిక శాస్త్రవేత్త ఐజాక్ న్యూటన్ ప్రతిపాదించిన గమన నియమాలు(లాస్ ఆఫ్ మోషన్) మన మంత్రాల్లో ఎప్పటినుంచో ఉన్నాయని సత్యపాల్ సింగ్ తెలిపారు. గత జనవరిలో హెచ్ఆర్డీ మంత్రి ప్రకాశ్ జవదేకర్ అధ్యక్షతన ఢిల్లీలో జరిగిన 65వ సెంట్రల్ అడ్వైజరీ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్(సీఏబీఈ) భేటీలో సత్యపాల్ ఈ మేరకు వ్యాఖ్యానించారు. కాబట్టి సంప్రదాయ జ్ఞానాన్ని కచ్చితంగా మన పాఠ్యాంశాల్లో చేర్చాలని సత్యపాల్ సూచించారు. అంతేకాకుండా పాఠశాల భవనాలు పూర్తి వాస్తుతో ఉండాలనీ.. అప్పుడే విద్యార్థులకు చదువు అబ్బుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా న్యూటన్ మంత్రాల విషయమై మీడియా ఆయన్ను బుధవారం ప్రశ్నించగా.. సత్యపాల్ జవాబు దాటవేశారు. అంతేకాకుండా డార్విన్ విషయంలో తాను చెప్పింది కేవలం తన వ్యక్తిగత అభిప్రాయం మాత్రమేననీ, దానికి ప్రభుత్వం, పార్టీతో ఎలాంటి సంబంధం లేదని వివరణ కూడా ఇచ్చారు. -
కీలక సమావేశానికి పల్లం రాజు హాజరవుతారా?
మధ్యాహ్న భోజనం, ఇతర అంశాలపై సెంట్రల్ అడ్వైజరీ బోర్డు ఆఫ్ ఎడ్యుకేషన్ (సీఏబీఈ) గురువారం నిర్వహించే కీలక సమావేశానికి కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి ఎంఎం పల్లం రాజు హాజరవుతారా అంశంపై ఇంకా సందిగ్ధత నెలకొంది. రేపు జరుగనున్న సీఏబీఈ సమావేశంలో మధ్యాహ్న బోజన పథకంపై కీలక నిర్ణయం తీసుకోవాల్సిన నేపథ్యంలో పల్లం రాజు హాజరుపై ఆయన మంత్రిత్వ శాఖకు సంబంధించిన అధికారులు కూడా ఎలాంటి భరోసాను ఇవ్వలేకపోయారని తెలుస్తోంది. బోధన, ఉపాధ్యాయులు, మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించిన పలు అంశాలపై జాతీయ సంస్థకు నివేదికను పల్లం రాజు అందించాల్సి ఉంది. పల్లం రాజు రాజీనామా సమర్పించిన తర్వాత పలు సమావేశాలకు అధికారులే హాజరవుతున్నట్టు సమాచారం. అంతేకాకుండా పల్లం రాజు లేనికారణంగా పలు సమావేశాలు రద్దయ్యాయి. పల్లం రాజు హాజరుకాకుంటే ఈ సమావేశానిక జతిన్ ప్రసాద్, లేదా శశి థరూర్ ఈ సమావేశానికి అధ్యక్షత వహించే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం కేంద్ర కేబినెట్ నోట్ కు ఆమోదం తెలిపిన తర్వాత నుంచి విధులకు పల్లం రాజు హాజరుకావడం లేదని తెలుస్తోంది. నిన్న జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశానికి కూడా పల్లం రాజు కూడా హాజరుకాలేదన్న సంగతి తెలిసిందే. సీమాంధ్ర ప్రాంతానికి చెందిన నలుగురు కేంద్ర మంత్రులు ప్రధాని మన్మోహన్ సింగ్ ను కలిసి రాజీనామాలను అంగీకరించాల్సిందిగా కోరినప్పటికి ఎలాంటి హామీ లభించలేదు.