ఢిల్లీ: జాతీయ మెరిట్ స్కాలర్‌షిప్ మాదిరిగా ‘జాతీయ అటెండెన్స్ పాలసీ’ పెట్టి విద్యార్థులను ప్రోత్సాహించాలని తెలంగాణ విద్యాశాఖమంత్రి సబితా ఇంద్రారెడ్డి కోరారు. శనివారం ‘సెంట్రల్ అడ్వైజరి బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్’ సమావేశంలో పాల్గొన్న మంత్రి ‘ఎడ్యుకేషన్ కొత్త డ్రాఫ్ట్ పాలసీ’ పై పలు సూచనలు, సలహాలను ఇచ్చారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పూర్వ ప్రాథమిక విద్యను ప్రవేశ పెట్టాలని పాలసీలో ఉందని.. దానిని స్వాగతిస్తున్నామన్నారు. ఆ పాలసీకి అయ్యే ఖర్చు కేంద్రమే భరించాలని సూచించారు. తరగతులు ఏర్పాటు చేస్తున్నపుడు స్థానిక గ్రామస్థులనే నియమించుకోవాలని కోరామని తెలిపామన్నారు. 8, 9, 10 తరగతుల్లో వృత్తి విద్య అమలు చేయాలని కోరారు. విద్యార్థుల కోసం జిల్లాకో కౌన్సిలింగ్ సంస్థ పెట్టాలన్నారు. తీవ్ర ఒత్తిడిలో ఉండే విద్యార్థులకు ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు.
పాఠశాలల్లో మాతృ భాషలో బోధన అమలు చేయాలని.. ప్రయివేటు విద్యాసంస్థలలో కూడా ఈ విధానం అమలు చేయాలని చెబుతున్నామని పేర్కొన్నారు. అలా అయితేనే లక్ష్యం నెరవేరుతుందన్నారు. ‘రైట్ టూ ఎడ్యుకేషన్ యాక్ట్’ ను పరిశీలంచాలని ముసాయిదాను మంత్రి కోరారు. కేంద్రంతో సంబంధం లేకుండా తెలంగాణలో విద్య వ్యాప్తికి చాలా కార్యక్రమాలు చేస్తున్నామని స్పష్టం చేశారు. మధ్యాహ్న భోజన పథకంలో 60 శాతం కేంద్రం, 40 శాతం రాష్ట్రం భరిస్తోందన్నారు. ఈ పథకంలో సన్న బియ్యం పెడుతున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని పేర్కొన్నారు. కేంద్రం 7వ తరగతి వరకే అమలు చేస్తే.. తెలంగాణ రాష్ట్రంలో 8, 9, 10వ తరగతి విద్యార్థులకు కూడా అమలు చేస్తున్నామని వెల్లడించారు.
‘మోడల్ స్కూల్ వ్యవస్థ’ ను కేంద్రం పక్కన పెడితే, స్వంతంగా రాష్ట్ర ప్రభుత్వ ఖర్చుతో వాటిని కొనసాగిస్తున్నామని మంత్రి తెలిపారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన గురుకుల పాఠశాలలు విజయవంతంగా నడుస్తున్నాయని, ప్రైవేట్ పాఠశాలలు మానేసి, ప్రభుత్వ గురుకులాలో విద్యార్థులు పెద్ద సంఖ్యలో చేరుతున్నారని వెల్లడించారు.
మిగతా రాష్ట్రాలు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన గురుకుల పాఠశాలల వైపు చూస్తున్నాయన్నారు. పేద విద్యార్థుల విదేశీ విద్య కోసం సుమారు రూ. 20 లక్షల ఆర్థిక సహాయం చేస్తున్నామని పేర్కొన్నారు. దీంతో సుమారు 1995 మంది విద్యార్థులు విదేశాలలో విద్యను అభ్యసిస్తున్నారని మంత్రి తెలిపారు. ప్రతి విద్యార్థి బడిలో ఉండాలి, ఉన్న విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించే దిశగా తెలంగాణ ప్రభుత్వం పని చేస్తోందని సబితా స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment