ఐపీ ఫెసిలిటేటర్ల ఫీజులు పెంపు
న్యూఢిల్లీ: అంకుర సంస్థలకు పేటెంట్ దరఖాస్తులపరమైన సేవలు అందించే ఐపీ ఫెసిలిటేటర్ల ప్రొఫెషనల్ ఫీజులను కేంద్రం దాదాపు రెట్టింపు చేసింది. స్టార్టప్స్ మేథోహక్కుల పరిరక్షణ (ఎస్ఐపీపీ) పథకం కింద ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపింది. అంకుర సంస్థలకు ఐపీ ఫెసిలిటేటర్లు మరింత నాణ్యమైన సేవలు అందించేందుకు ఇది తోడ్పడగలదని వివరించింది. పేటెంట్లకు సంబంధించి .. దరఖాస్తును ఫైలింగ్ చేసేటప్పుడు ఫీజును రూ. 10,000 నుండి రూ. 15,000కు పెంచారు. అలాగే ట్రేడ్ మార్క్‌లు, డిజైన్ల విషయంలో రూ. 2,000 నుండి రూ. 3,000కు సవరించారు.
స్టార్టప్‌ల మేథోహక్కులను పరిరక్షించేందుకు, నవకల్పనలు.. సృజనాత్మకతను ప్రోత్సహించేందుకు కేంద్రం 2016లో ఎస్ఐపీపీని ప్రవేశపెట్టింది. ఐపీ ఫెసిలిటేటర్ల ద్వారా అంకుర సంస్థలు తమ పేటెంట్లు, డిజైన్లు లేదా ట్రేడ్‌మార్కుల దరఖాస్తులు సమర్పించేందుకు, ప్రాసెస్ చేయించుకునేందుకు ఇది ఉపయోగపడుతుంది. ఇందుకు సంబంధించిన ఫీజులను ఆఫీస్ ఆఫ్ ది కంట్రోలర్ జనరల్ ఆఫ్ పేటెంట్స్ డిజైన్స్ అండ్ ట్రేడ్‌మార్క్స్ భరిస్తోంది. దీని కింద ఐపీల ఫైలింగ్స్ గణనీయంగా పెరిగిన నేపథ్యంలో వచ్చే ఏడాది మార్చి 31 వరకూ ఈ స్కీమును కేంద్రం పొడిగించింది. ఐపీ ఫైలింగ్స్‌లో స్టార్టప్‌లకు తోడ్పడినందుకు గాను సెప్టెంబర్ 30 వరకూ ఫెసిలిటేటర్లకు రూ. 3.80 కోట్ల మేర ఫీజులు చెల్లించినట్లు కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ తెలిపింది.