హాంఫట్..
సాక్షి, ఖమ్మం: ప్రజలకు ఉపయోగపడాల్సిన కేంద్రప్రభుత్వ నిధులు పక్కదారి పట్టాయి...పనులన్నీ అయినవారికే అప్పగించడంతో వారు నాణ్యతను గాలికి వదిలి ఎంచక్కా నిధులు ఫలహారం చేశారు....తూతూమంత్రంగా సాగిన పనులు నామరూపాలు లేకుండా పోతున్నాయి... ఎంపీ నామా నాగేశ్వరరావు కోటా కింద విడుదలైన నిధులు ఇలా దుర్వినియోగమయ్యాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
ఇందుకు సంబంధించి వివరాల్లోకి వెళితే...
ఏటా కేంద్ర ప్రభుత్వం ఎంపీ ల్యాడ్స్ కింద లోక్సభ ప్రజా ప్రతినిధులకు రూ.5 కోట్లు మంజూరు చేస్తుంది. అవసరమున్న చోట సీసీ, మట్టి రోడ్లు, చేతి పంపులు, అదనపు తరగతి గదులు, బస్ షెల్టర్ల నిర్మాణం కోసం ఎంపీలు ప్రతిపాదనలు పంపితే ప్రభుత్వం వీటి నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తుంది. ఇలా ఒక్కో ఎంపీ కోటా కింద ఏడాదికి రూ.5 కోట్ల చొప్పున ఐదేళ్లకు మొత్తం రూ.25 కోట్లు మంజూరు చేస్తుంది. ఖచ్చితంగా ఈపనుల్లో నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. కానీ నామా నాగేశ్వరరావు తన కోటాకింద మంజూరైన పనులన్నీ తన అనుంగు నేతలకే అప్పగించారనే ఆరోపణలున్నాయి.
ఈ పనులతో చేసిన నిర్మాణాలు ప్రస్తుతం నామరూపాలు కనిపించడంలేదు. నాణ్యత లేని పనులు చేసి నామా అనుచరులు రూ.కోట్లలో నిధులు కాజేశారనే ఆరోపణలున్నాయి. జిల్లా వ్యాప్తంగా ఏడు నియోజకవర్గాల పరిధిలో నామా కోటా కింద పలుపనులు జరిగాయి. ఈ ఐదేళ్లలో చేసిన మొత్తం 1,267 పనులకు గాను రూ.16.50 కోట్లు విడుదలయ్యాయి. మధిర మండల పరిధిలోని మాటూరు ఎస్సీ కాలనీలో ఎంపీ నిధులతో ఇటీవల కల్వర్టు నిర్మించారు. అయితే నాణ్యత లేకుండానే ఈ నిర్మాణం జరిగిందనే విమర్శలున్నాయి. అలాగే అశ్వారావుపేటలోని చిన్నంశెట్టిబజార్, పాకలగూడెం, వినాయకపురం కాలనీ, దురదపాడులో గ్రావెల్ రోడ్ల నిర్మాణంలో నామా అనుచర నేతలు అందినకాడికి దండుకున్నారనే ఆరోపణలున్నాయి. పాలేరు, మధిర, కొత్తగూడెం,వైరా నియోజకవర్గాల్లో ఎక్కువగా ఈ నిధులతో పనులు మమ అనిపించి నాణ్యతకు తిలోదకాలు ఇచ్చినట్లు విమర్శలు వస్తున్నాయి.
ఎన్నికలే లక్ష్యంగా ప్రతిపాదనలు..
పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధికి ఎంపీ కోటాగా కేంద్రం విడుదల చేసే రూ.25 కోట్లలో ఈ ఏడాది ఫిబ్రవరి వరకు రూ.16.50 కోట్లు నామా మంజూరు చేయించుకున్నారు. ఇంకా రూ.8.50 కోట్లకు హడావుడిగా రెండు నెలల క్రితం ప్రతిపాదనలు పంపించారు. సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని పలు పనులను కేంద్రానికి నివేదించారు. ఎన్నికల్లో తనకు సహకరించే అనుచర నేతలకు నజరానాగా ఈ పనులను అప్పగించేందుకు సదరు నేతలకు ఇప్పటికే నామా హామీ ఇచ్చారని ఆరోపణలు వెలువడుతున్నాయి. ఇప్పటికే చేసిన పనుల్లో నాణ్యత కొరవడగా... మిగిలిన నిధులతో చేసే పనులను కూడా తన అనుచరులకే అప్పగించేలా నామా చక్రం తిప్పారు. నామా నిధుల కింద జిల్లాలో చేతి పంపులు ఏర్పాటు చేయించినా ఇప్పుడు అవి నిరుపయోగంగా మారాయి. సీసీరోడ్లది కూడా ఇదే పరిస్థితి. మంచినీటి ఎద్దడి ఉన్న ప్రాంతాల్లో ఎంపీగా నామా దృష్టి పెట్టకపోవడంతో ఇప్పుడు ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గంలోని ఏజెన్సీలో గిరిజనులకు మంచినీటి బాధలు తప్పడం లేదు.