‘న్యాక్’కు సీఐడీసీ అవార్డు
సాక్షి, హైదరాబాద్: నేషనల్ అకాడమీ ఫర్ కన్ స్ట్రక్షన్ (న్యాక్)కు కేంద్ర ప్రణాళిక శాఖ అధీనంలోని ప్రతిష్టాత్మక ‘కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ డెవలప్మెంట్ కౌన్సిల్ (సీఐ డీసీ)’ అవార్డు ప్రకటించింది. నిర్మాణ రంగంలో నైపుణ్యాభివృద్ధి అంశంలో ‘న్యాక్’ విస్తృత కృషికి గాను ఈ అవార్డు ఇవ్వనుంది. దేశవ్యాప్తంగా నిర్మాణ రం గంలో విశేష కృషి చేస్తున్న సంస్థలు, వ్యక్తులు, శిక్షణ సంస్థలకు ఏటా ఈ కౌన్సి ల్ అవార్డులు ప్రకటించి ప్రోత్సహిస్తోంది. ఇందులో భాగంగా ఈ ఏడాది తెలంగాణ ‘న్యాక్’ను అవార్డుకు ఎంపిక చేసింది.
ఈ నెల 7న ఢిల్లీలో జరిగే కార్యక్రమంలో ‘న్యాక్’ డెరైక్టర్ జనరల్ బిక్షపతి, డెరైక్టర్ శాంతిశ్రీ ఈ అవార్డును అందుకోనున్నారు. ‘న్యాక్’ ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు నిర్మాణ రంగానికి సంబంధించి వివిధ అంశాల్లో 3.2 లక్షల మందికి శిక్షణ ఇచ్చింది. తెలంగాణ ఆవిర్భవించిన తర్వాత 26 వేల మందికి శిక్షణ ఇవ్వటం విశేషం. ఇందు లో నిరుద్యోగ యువత 3 వేల మంది వరకు ఉన్నారు. న్యాక్‌లో శిక్షణ పొందిన వారికి అందజేస్తున్న సర్టిఫికెట్‌కు మంచి గుర్తిం పు ఉంది. ఆ సర్టిఫికెట్ ఉన్న వారికి పెద్ద సంస్థల్లో కూడా ఉద్యోగావకాశాలు వస్తున్నాయి.
ఈ మొత్తం పనితీరును గమనించిన సీఐడీసీ ప్రతినిధులు ఇటీవల రాష్ట్రానికి వచ్చి స్వయంగా దాని సేవలను పరిశీలించి అవార్డుకు ఎంపిక చేశారు. ఈ అవార్డు రావటం ఎంతో ఆనందంగా ఉందని, సంస్థ పనితీరును మరింత మెరుగుపరిచేందుకు ఇది దోహదం చేస్తుందని సంస్థ డీజీ బిక్షపతి వ్యాఖ్యానించారు.