Central service
-
మరో నాలుగు డీఐజీ రేంజ్‌ల ఏర్పాటు?
పోలీసు శాఖ ప్రతిపాదన సాక్షి, హైదరాబాద్: నూతన జిల్లాల ఏర్పాటు దృష్ట్యా రాష్ట్ర పోలీస్ శాఖలో కొత్తగా మరో నాలుగు డీఐజీ రేంజ్‌లు ఏర్పాటు చేయాలని ఉన్నతాధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్, నిజామాబాద్, వరంగల్, కరీంనగర్ రేంజ్‌లున్నాయి. కొత్త జిల్లాల వల్ల మరిన్ని రేంజ్‌లు ఏర్పాటు చేస్తే పాలన సులభతరంగా ఉంటుందని భావిస్తున్నారు. కొత్త గా మంచిర్యాల, సంగారెడ్డి, మహబూబ్‌నగర్, కొత్తగూడెం ఏర్పాటు చేయాలని ప్రతిపాదిస్తున్నారు. గతంలో ఒక్కోరేంజ్ కింద రెండు, మూడు జిల్లా పోలీస్ యూనిట్లు ఉండేవి. కొత్త జిల్లాల ఏర్పాటుతో ఒక్కో రేంజ్ కింద 7, 8 జిల్లాలు వచ్చి చేరాయి. ఒక్కో రేంజ్ కింద 4 నుంచి 5 జిల్లాలు వచ్చేలా కార్యాచరణ చేస్తున్నామని ఉన్నతాధికారులు ‘సాక్షి’కి తెలిపారు. మరి డీఐజీల సంగతేంటి? ప్రస్తుతం ఉన్న నాలుగు రేంజ్‌ల్లో కేవలం ఇద్దరు డీఐజీలు మాత్రమే విధుల్లో ఉన్నారు. కొత్త రేంజ్‌లు వస్తే సీనియర్ ఎస్పీలకు బాధ్యత అప్పగించాలని భావిస్తున్నట్టు ఉన్నతాధికారులు తెలిపారు. రాష్ట్రంలో జోన్ల వ్యవస్థను ఎత్తివేయడమా? లేకా మరిన్ని జోన్లు చేయడమా అన్న దానిని బట్టి తుది ప్రతిపాదనలుంటాయని ఉన్నతాధికారులు స్పష్టం చేశారు. జోన్ల వ్యవస్థ పునర్వ్యవస్థీకరణ చేస్తే పోలీస్ శాఖలో మరో రెండు జోన్లు కూడా ఏర్పాటు చేసే ఆలోచన ఉందని తెలిపారు. త్వరలో పదోన్నతి పొందే ఇద్దరు డీఐజీలతోపాటు కేంద్ర సర్వీసుల్లో ఉన్న డీఐజీలను సైతం రాష్ట్రానికి తీసుకువచ్చే ఆలోచనలో ఉన్నామని కీలక అధికారి ఒకరు తెలిపారు. -
చంద్రబాబు తీరు నచ్చకే ఐఏఎస్‌ల హస్తిన బాట
-
ఐఏఎస్‌ల హస్తిన బాట
ఢిల్లీ దారిలో ఇప్పుడు మళ్లీ పది మంది ఐఏఎస్‌లు సీఎం చంద్రబాబు తీరు నచ్చకే కేంద్ర సర్వీసులవైపు చూపు సాక్షి, అమరావతి: అఖిల భారత సర్వీసుకు చెందిన ఐఏఎస్ అధికారులు రాష్ట్రం వదిలివెళ్లిపోతున్నారు. గత రెండున్నరేళ్లలో పలువురు కేంద్ర సర్వీసుకు వెళ్లిపోగా.. అదే బాటలో మరొక పది మంది హస్తిన బాటపడుతున్నారు. ప్రధానంగా ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యవహార శైలి నచ్చకనే ఎక్కువ మంది రాష్ట్రంలో పనిచేయడానికి ఇష్టపడటం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. వారాంతపు సెలవులు, పండుగలనే తేడా లేకుండా ప్రతిరోజూ ప్రయోజనం లేని సమీక్షలతో గంటల తరబడి తమ సమయాన్ని సీఎం వృథా చేస్తున్నారని, ఆ సమీక్షలకు వెళ్లి చెప్పింది విని రావడం తప్ప ఎటువంటి ఫలితం ఉండటం లేదనే భావన పలువురు ఐఏఎస్‌లలో వ్యక్తం అవుతోంది. ప్రజల ప్రయోజనాల కోసం సమీక్షలు చేస్తే తమకూ సంతోషమేనని, కానీ ఆయన సమీక్షల పేరుతో ప్రచారం కోసం పాకులాడుతున్నారని వారు అంటున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే ముఖ్యమంత్రి ఒక ఈవెంట్ మేనేజర్‌లాగా తయారయ్యారు తప్ప ముఖ్యమంత్రిగా పాలన వ్యవహారాలను పట్టించుకోవడం లేదని సీనియర్ అధికారులు వ్యాఖ్యానిస్తున్నారు. సమీక్షకు.. సమీక్షకు కనీసం వారం రోజులైనా గడువు ఉంటే తొలి సమీక్షలో ఏమైనా నిర్ణయాలు తీసుకుంటే దాన్ని అమలు చేయడానికి వీలుంటుందని చెబుతున్నారు. అయితే ఎటువంటి నిర్ణయాలు లేకుండా కేవలం కాలక్షేపం సమీక్షల్లా తయారయ్యాయనే అభిప్రాయాన్ని ఐఏఎస్‌లు బాహాటంగానే వ్యక్తం చేస్తున్నారు. ఉదయం 11 గంటలకు సమీక్షంటూ పిలుస్తారని, పలుమార్లు సాయంత్రం 6 గంటలైనా సమీక్షలు ప్రారంభమైన దాఖలాలు లేవని, ఉదయం నుంచి సాయంత్రం వరకు గోళ్లు గిల్లుగింటూ కూర్చోవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయని పలువురు అధికారులు పేర్కొంటున్నారు. కాగా కొంతమంది ఐఏఎస్‌లు అసలు విజయవాడ వెళ్లి పనిచేయడానికి ఇష్టపడటం లేదని తెలిసింది. తమ శాఖ ద్వారా ప్రజలకు ఉపయోగపడే పనులు చేయలేక.. సమీక్షలతోనే సమయం అంతా వెచ్చించాల్సిన పరిస్థితి ఇక్కడే చూస్తున్నామని మరికొందరు ఐఏఎస్‌లు అసహనం వ్యక్తం చేస్తున్నారు.