పోలీసు శాఖ ప్రతిపాదన
సాక్షి, హైదరాబాద్: నూతన జిల్లాల ఏర్పాటు దృష్ట్యా రాష్ట్ర పోలీస్ శాఖలో కొత్తగా మరో నాలుగు డీఐజీ రేంజ్‌లు ఏర్పాటు చేయాలని ఉన్నతాధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్, నిజామాబాద్, వరంగల్, కరీంనగర్ రేంజ్‌లున్నాయి. కొత్త జిల్లాల వల్ల మరిన్ని రేంజ్‌లు ఏర్పాటు చేస్తే పాలన సులభతరంగా ఉంటుందని భావిస్తున్నారు. కొత్త గా మంచిర్యాల, సంగారెడ్డి, మహబూబ్‌నగర్, కొత్తగూడెం ఏర్పాటు చేయాలని ప్రతిపాదిస్తున్నారు. గతంలో ఒక్కోరేంజ్ కింద రెండు, మూడు జిల్లా పోలీస్ యూనిట్లు ఉండేవి. కొత్త జిల్లాల ఏర్పాటుతో ఒక్కో రేంజ్ కింద 7, 8 జిల్లాలు వచ్చి చేరాయి. ఒక్కో రేంజ్ కింద 4 నుంచి 5 జిల్లాలు వచ్చేలా కార్యాచరణ చేస్తున్నామని ఉన్నతాధికారులు ‘సాక్షి’కి తెలిపారు.
మరి డీఐజీల సంగతేంటి?
ప్రస్తుతం ఉన్న నాలుగు రేంజ్‌ల్లో కేవలం ఇద్దరు డీఐజీలు మాత్రమే విధుల్లో ఉన్నారు. కొత్త రేంజ్‌లు వస్తే సీనియర్ ఎస్పీలకు బాధ్యత అప్పగించాలని భావిస్తున్నట్టు ఉన్నతాధికారులు తెలిపారు. రాష్ట్రంలో జోన్ల వ్యవస్థను ఎత్తివేయడమా? లేకా మరిన్ని జోన్లు చేయడమా అన్న దానిని బట్టి తుది ప్రతిపాదనలుంటాయని ఉన్నతాధికారులు స్పష్టం చేశారు. జోన్ల వ్యవస్థ పునర్‌వ్యవస్థీకరణ చేస్తే పోలీస్ శాఖలో మరో రెండు జోన్లు కూడా ఏర్పాటు చేసే ఆలోచన ఉందని తెలిపారు. త్వరలో పదోన్నతి పొందే ఇద్దరు డీఐజీలతోపాటు కేంద్ర సర్వీసుల్లో ఉన్న డీఐజీలను సైతం రాష్ట్రానికి తీసుకువచ్చే ఆలోచనలో ఉన్నామని కీలక అధికారి ఒకరు తెలిపారు.
మరో నాలుగు డీఐజీ రేంజ్‌ల ఏర్పాటు?
Published Tue, Feb 14 2017 3:57 AM | Last Updated on Tue, Sep 5 2017 3:37 AM
Advertisement
Advertisement