ఐఏఎస్‌ల హస్తిన బాట
ఢిల్లీ దారిలో ఇప్పుడు మళ్లీ పది మంది ఐఏఎస్‌లు
సీఎం చంద్రబాబు తీరు నచ్చకే కేంద్ర సర్వీసులవైపు చూపు
సాక్షి, అమరావతి: అఖిల భారత సర్వీసుకు చెందిన ఐఏఎస్ అధికారులు రాష్ట్రం వదిలివెళ్లిపోతున్నారు. గత రెండున్నరేళ్లలో పలువురు కేంద్ర సర్వీసుకు వెళ్లిపోగా.. అదే బాటలో మరొక పది మంది హస్తిన బాటపడుతున్నారు. ప్రధానంగా ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యవహార శైలి నచ్చకనే ఎక్కువ మంది రాష్ట్రంలో పనిచేయడానికి ఇష్టపడటం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. వారాంతపు సెలవులు, పండుగలనే తేడా లేకుండా ప్రతిరోజూ ప్రయోజనం లేని సమీక్షలతో గంటల తరబడి తమ సమయాన్ని సీఎం వృథా చేస్తున్నారని, ఆ సమీక్షలకు వెళ్లి చెప్పింది విని రావడం తప్ప ఎటువంటి ఫలితం ఉండటం లేదనే భావన పలువురు ఐఏఎస్‌లలో వ్యక్తం అవుతోంది. ప్రజల ప్రయోజనాల కోసం సమీక్షలు చేస్తే తమకూ సంతోషమేనని, కానీ ఆయన సమీక్షల పేరుతో ప్రచారం కోసం పాకులాడుతున్నారని వారు అంటున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే ముఖ్యమంత్రి ఒక ఈవెంట్ మేనేజర్‌లాగా తయారయ్యారు తప్ప ముఖ్యమంత్రిగా పాలన వ్యవహారాలను పట్టించుకోవడం లేదని సీనియర్ అధికారులు వ్యాఖ్యానిస్తున్నారు.
సమీక్షకు.. సమీక్షకు కనీసం వారం రోజులైనా గడువు ఉంటే తొలి సమీక్షలో ఏమైనా నిర్ణయాలు తీసుకుంటే దాన్ని అమలు చేయడానికి వీలుంటుందని చెబుతున్నారు. అయితే ఎటువంటి నిర్ణయాలు లేకుండా కేవలం కాలక్షేపం సమీక్షల్లా తయారయ్యాయనే అభిప్రాయాన్ని ఐఏఎస్‌లు బాహాటంగానే వ్యక్తం చేస్తున్నారు. ఉదయం 11 గంటలకు సమీక్షంటూ పిలుస్తారని, పలుమార్లు సాయంత్రం 6 గంటలైనా సమీక్షలు ప్రారంభమైన దాఖలాలు లేవని, ఉదయం నుంచి సాయంత్రం వరకు గోళ్లు గిల్లుగింటూ కూర్చోవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయని పలువురు అధికారులు పేర్కొంటున్నారు. కాగా కొంతమంది ఐఏఎస్‌లు అసలు విజయవాడ వెళ్లి పనిచేయడానికి ఇష్టపడటం లేదని తెలిసింది. తమ శాఖ ద్వారా ప్రజలకు ఉపయోగపడే పనులు చేయలేక.. సమీక్షలతోనే సమయం అంతా వెచ్చించాల్సిన పరిస్థితి ఇక్కడే చూస్తున్నామని మరికొందరు ఐఏఎస్‌లు అసహనం వ్యక్తం చేస్తున్నారు.