
సాక్షి, న్యూఢిల్లీ, అమరావతి: నిరంతరం విద్యార్థిగా ఉండడం ద్వారా అద్భుతాలు సాధించవచ్చని, తాను ఇప్పటికీ నిత్య విద్యార్థినేనని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. సోమవారం ఆయన ఉత్తరాఖండ్‌లోని ముస్సోరిలో సీనియర్ ఐఏఎస్ అధికారుల మిడ్ టర్మ్ కెరీర్ శిక్షణ కార్యక్రమంలో మాట్లాడారు. తాను సమాజం, సామాన్యులు, అధికారుల నుంచి నేర్చుకుంటానని పేర్కొన్నారు. దేశ నిర్మాణంలో అధికారులే భవిష్యత్తు నాయకులన్నారు. ‘మానవ వనరులు, ఆంగ్ల భాష మాట్లాడే జనాభా, ఐటీ లాంటి మూడు రకాల అనుకూలతలు భారత్ సొంతం.
ప్రపంచవ్యాప్తంగా ప్రతి నలుగురు ఐటీ ఉద్యోగుల్లో ఒకరు భారతీయులే. వీరిలో ప్రతి నలుగురు భారతీయుల్లో ఒకరు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వారై ఉంటారు’ అని సీఎం చెప్పారు. టెక్నాలజీ వినియోగంపై వ్యవస్థలు ఆధారపడి పనిచేస్తున్నాయని, సాంకేతికతను మరింతగా వినియోగించేందుకు తమ ప్రభుత్వం కృషిచేస్తోందని తెలిపారు. హెదరాబాద్‌ను బ్రౌన్ ఫీల్డ్ నగరంగా అభివృద్ధి చేశానని, ఇప్పుడు అమరావతిని కొత్తగా నిర్మిస్తున్నానని చెప్పారు.కాగా సీఎం కేంద్రమంత్రి నితిన్ గడ్కరీతో భేటీ అయ్యారు. రాష్ట్రానికిచెందిన ప్రాజెక్టుల కోసం నిధులు మంజూరు చేయాలని కోరారు.