జాతీయ రహదారుల శంకుస్థాపన శిలాఫలకాలను రిమోట్ ద్వారా ఆవిష్కరిస్తున్న ఉప రాష్ట్రపతి వెంకయ్య. చిత్రంలో గవర్నర్ నరసింహన్, సీఎం, నితిన్ గడ్కరీ
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో రూ.లక్ష కోట్లతో జాతీయ రహదారులను అభివృద్ధి చేస్తున్నామని కేంద్ర ఉపరితల రవాణా, జలవనరుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. జాతీయ అంతర్గత జలమార్గాల నిర్మాణంతో దేశం రూపురేఖలు మారిపోతాయని, ఆంధ్రప్రదేశ్‌లో కృష్ణా నదిలో రూ.7,015 కోట్లతో జాతీయ అంతర్గత జలమార్గం4 నిర్మిస్తామన్నారు. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో మంగళవారం ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడుతో కలసి రాష్ట్రంలో రూ.1,614.03 కోట్ల వ్యయంతో.. 381.9 కి.మీల పొడవున అభివృద్ధి చేసిన ఏడు జాతీయ రహదారులను రిమోట్ ద్వారా జాతికి అంకితం చేశారు. రూ.2,539.08 కోట్లతో 250.45 కి.మీ. పొడవున చేపట్టిన మరో ఆరు జాతీయ రహదారుల పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. అలాగే, కృష్ణా నదిలో జాతీయ అంతర్గత జలమార్గం4 నిర్మాణంలో భాగంగా తొలిదశ కింద రూ.96 కోట్లతో చేపట్టిన విజయవాడముక్త్యాల జలమార్గం పనులకూ శంకుస్థాపన చేశారు. అనంతరం జరిగిన సభలోను, పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం ప్రాజెక్టును సందర్శించాక అక్కడి మీడియాతోనూ నితిన్ గడ్కరీ మాట్లాడారు.
పోలవరం పూర్తికి కృషి
వచ్చే ఎన్నికల్లోగా పోల వరం ప్రాజెక్టు పూర్తికావడం కష్టమేనని.. అయినా, పూర్తిచేయడానికి శాయశక్తులా కృషిచేస్తామని గడ్కరీ తెలిపారు. 2018 డిసెంబర్ తర్వాత 3,4 నెలల్లో పూర్తిచేసేందుకు ప్రయత్నిస్తామని చెప్పారు.
లాజిస్టిక్ హబ్‌గా ఏపీ : చంద్రబాబు
ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ... ముక్త్యాలవిజయవాడ జలమార్గానికి శంకుస్థాపన చేయడం చారిత్రాత్మకమన్నారు. ఇది పూర్తయితే ఆగ్నేయాసియా ఖండానికి ఆంధ్రప్రదేశ్ లాజిస్టిక్ హబ్ అవుతుందన్నారు.
బీజేపీ నేతలతో గడ్కరీ భేటీ రద్దు
రాష్ట్ర పర్యటనలో భాగంగా బీజేపీ నేతలతో జరగాల్సిన కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ భేటీ చివరి నిమిషంలో రద్దయింది. సమయాభావంవల్ల మంత్రి కార్యక్రమం రద్దయినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.
10న రాష్ట్ర మంత్రివర్గ సమావేశం
ఈ నెల 10న రాష్ట్ర కేబినెట్ భేటీ జరగనుంది. ఆరోజు మధ్యాహ్నం 3 గంటలకు వెలగపూడి సచివాలయంలో ఈ సమావేశం జరుగుతుం దని ప్రభుత్వ సీఎస్ దినేశ్ కుమార్ తెలిపారు. సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగే ఈ సమా వేశంలో పలు సంస్థలకు భూముల కేటాయిం పు తదితర అంశాలు ఎజెండాకు రానున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment