నవయుగకు ‘పోలవరం’ | CM Chandrababu comments about Polavaram Project | Sakshi
Sakshi News home page

నవయుగకు ‘పోలవరం’

Published Sun, Jan 21 2018 1:32 AM | Last Updated on Tue, Aug 21 2018 8:34 PM

CM Chandrababu comments about Polavaram Project - Sakshi

సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టు కాంక్రీట్‌ పనులను నవయుగ కన్‌స్ట్రక్షన్స్‌ కంపెనీకి నామినేషన్‌ విధానంలో అప్పగించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు శనివారం మంత్రివర్గ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకున్నారు. ఈ వివరాలను సీఎం చంద్రబాబు సచివాలయంలో మీడియాకు వివరించారు. పోలవరం కాంక్రీట్‌ పనులను వారం రోజుల్లో నవయుగ సంస్థకు అప్పగిస్తామని తెలిపారు. 2014 స్టాండర్డ్‌ షెడ్యూల్‌ రేట్ల(ఎస్‌ఎస్‌ఆర్‌) ప్రకారమే డబ్బులిచ్చేందుకు కేంద్ర జల వనరుల శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ అంగీకరించారని, కానీ మీడియాలో ఏదేదో రాస్తున్నారని అన్నారు. రూ.33 వేల కోట్ల ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ బాధ్యత కూడా కేంద్రానిదేనని, అందుకు వారు ఒప్పుకున్నారని చెప్పారు.

యుటిలైజేషన్‌ సర్టిఫికెట్లు(యూసీ) ఇవ్వడం లేదు కాబట్టే పోలవరం నిధులను కేంద్రం విడుదల చేయడం లేదన్న ప్రశ్నకు బదులిస్తూ.... అడిగే వాడికి సమాధానం చెప్పేవాడు లోకువని, యుటిలైజేషన్‌ సర్టిఫికెట్లు ఎక్కడ ఇవ్వలేదని ప్రశ్నించారు. అన్ని సమస్యలను అధిగమించి పోలవరం ప్రాజెక్టు పనుల్లో ముందుకు వెళుతున్నామన్నారు. మూడు నెలలు ఆలస్యమైంది కాబట్టి ప్రాజెక్టును 2019 కల్లా పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. ఫిబ్రవరి మొదటి వారం నుంచి ప్రాజెక్టు పనుల్లో మళ్లీ వేగం పెరుగుతుందన్నారు. పోలవరం ప్రాజెక్టును అడ్డుకునేందుకు కొందరు ప్రధానికి లేఖలు రాస్తున్నారని, కోర్టులు, ట్రిబ్యునల్‌కు వెళ్లారని విమర్శించారు. వైకుంఠపురం నుంచి నాగార్జునసాగర్‌ ఎడమ కాలువకు పైపులైన్‌ వేసి నీరందించే విషయాన్ని పరిశీలిస్తున్నామని వెల్లడించారు. బీసీ కులాలకు, చేతి వృత్తిదారులకు ఏప్రిల్‌ నుంచి ఆదరణ పథకం ద్వారా ఆధునిక పనిముట్లు పంపిణీకి  నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. భావనపాడు పోర్టుకు జరిగిన డెవలపర్‌ ఎంపికలో ఒకే ఒక్క బిడ్‌ దాఖలు చేసిన అదానీ సంస్థను మంత్రిమండలి ఆమోదించిందన్నారు. విశాఖపట్నంలో ఇంటర్నేషనల్‌ కన్వెన్షన్‌ సెంటర్‌ నిర్మాణం లూలూ ఇంటర్నేషనల్‌ షాపింగ్‌ మాల్‌ ప్రైవేటు సంస్థకు అప్పగిస్తున్నట్టు తెలిపారు.

మరికొన్ని నిర్ణయాలు...
- భోగాపురం ఎయిర్‌పోర్టు నిర్మాణానికి ప్రభుత్వం ఇప్పటికే చేపట్టిన టెండర్ల రద్దు.
- ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల జీతాలు 50 పెంచుతూ గతంలో ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబరు 151 ద్వారా లబ్ధి పొందకుండా మిగిలిపోయిన ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల జీతాలను 50 శాతం పెంచుతూ నిర్ణయం.  
- రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు చెల్లించాల్సిన రెండు డీఏల్లో ఒక్క డీఏను వచ్చే ఏప్రిల్‌ నుంచి చెల్లించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాల్సిందిగా అధికారులకు ఆదేశం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement