ఇళ్లిచ్చారు.. పట్టాలివ్వలేదు
సాక్షి ప్రతినిధి, ఏలూరు/పోలవరం రూరల్: అన్నీ సమస్యలే. ఇక్కడికి తీసుకొచ్చి వదిలేశారు. ఇళ్లు ఇచ్చినా పట్టాలు ఇవ్వలేదు. కనీసం పాఠశాల కూడా లేకపోవడంతో పిల్లలు ఎక్కడికో వెళ్లి చదువుకోవాల్సి వస్తోంది’’ అంటూ పోలవరం నిర్వాసితులు కేంద్ర బృందం ముందు తమ గోడును వెళ్లబోసుకున్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు అమలుచేసే పునరావాసం, పునర్నిర్మాణం అమలు, నిర్వాసితుల స్థితిగతులపై అధ్యయనం చేయడానికి కేంద్ర గిరిజన శాఖ కార్యదర్శి లీనా నైర్, కేంద్ర సామాజిక న్యాయం, ఉపాధి కల్పన మంత్రిత్వశాఖ కార్యదర్శి జి.లతా కృష్ణారావుల నేతృత్వంలోని బృందం మంగళవారం నిర్వాసిత గ్రామాల్లో పర్యటించింది. పునరావాస కేంద్రాల్ని సందర్శించింది. కుడికాలువ ముంపు గ్రామమైన రామన్నపాలెంలో పర్యటించి నిర్వాసితుల పరిస్థితులపై ఆరా తీసింది. నిర్వాసితులు కొవ్వాసి అబ్బులు, సోయం శారద తదితరులు మాట్లాడుతూ.. తమకు భూములిచ్చారుగానీ, ఇప్పటివరకు పట్టాలివ్వలేదని, గ్రామంలో పాఠశాల భవన నిర్మాణం పూర్తవనందున పిల్లల చదువులకు ఇబ్బందిగా ఉందని, ఉపాధి పనుల్లేక అగచాట్లు పడుతున్నామన్నారు.
ప్యాకేజీ ఇవ్వట్లేదు..
రెండోవిడత ఖాళీ చేయాల్సిన గ్రామమైన కొత్తూరును బృందం సందర్శించగా, సామాజికార్థిక సర్వేలో ఉండి 18 ఏళ్లు నిండి ఇటీవల వివాహాలైన అమ్మాయిలకు ప్యాకేజీ ఇవ్వట్లేదని కపిల్ అనే వ్యక్తి ఆవేదన వెలిబుచ్చారు.దీనిపై పశ్చిమగోదావరి జిల్లాకలెక్టర్ను బృందసభ్యులు ప్రశ్నించగా.. వీరికి కొత్తచట్టం ప్రకారం ప్యాకేజీ ఇవ్వనున్నట్టు కలెక్టర్ కాటమనేని భాస్కర్ తెలిపారు.