నదులు, ఉపనదులపై వరుస బ్యారేజీలు
⇒ అప్పుడే గోదావరి నీటి సమర్థ వినియోగం
⇒ ప్రభుత్వానికి రిటైర్డ్ ఇంజనీర్ల సూచన
సాక్షి, హైదరాబాద్: గోదావరి నీటి సమర్థ వినియోగానికి వీలుగా చిన్న చిన్న బ్యారేజీలు, చెక్ డ్యామ్‌ల నిర్మాణం తప్పనిసరని ప్రభుత్వానికి సాగునీటి రిటైర్డ్ ఇంజనీర్లు సూచించారు. నదులు, ఉపనదులు, వాగులపై వీలైనంత నీటిని నిల్వ చేసుకునే అంశాలపై కేంద్ర జల వనరులశాఖ సలహాదారు శ్రీరాం వెదిరె సూచనలను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకొని సాగునీటి విధానాన్ని రూపొందించాలన్నారు. శనివారం హైదరాబాద్‌లో రాష్ట్ర ఇంజనీర్ల ఫోరం కన్వీనర్ దొంతు లక్ష్మీనారాయణ, ఓయూ ఇంజనీరింగ్ కళాశాల రిటైర్డ్ ప్రిన్సిపల్ రమేశ్‌రెడ్డి, రిటైర్డ్ ఈఎన్సీ భాగ్యత రెడ్డి, రిటైర్డ్ సీఈ హన్మంత్‌రెడ్డి, సివిల్ ఇంజనీర్ శ్రీనివాస్‌రెడ్డి విలేకరులతో మాట్లాడారు.
గోదావరి జలాల సమగ్ర విని యోగంపై శ్రీరాం రచించిన పుస్తకంలోని అంశాలను ప్రభుత్వం మన రాష్ట్రానికి అన్వయించుకోవాలన్నారు. ప్రస్తుతమున్న నదులు, కాల్వలు, ఉపనదులు, నాలాలను నీటిని తరలించే వాహకాలుగా ఉపయో గించుకోవాలని, నదీ గర్భాలనే జలాశయాలుగా చేసుకోవాల న్నారు. తక్కువ విద్యుత్‌తో ఎక్కువ నీటిని ఎత్తిపోసే విధానాలకు ప్రాధాన్యత నివ్వా లని సూచించారు. గోదావరిపై కాళేశ్వరం వద్ద 115 మీ. వరకు నీటి మట్టం ఉండేలా ప్రాజెక్టు, వరుస బ్యారేజీలు నిర్మిస్తే జల రవాణా, సాగు, తాగు నీటి లభ్యత పెరుగు తుందని, పరిశ్రమల స్థాపనకు అవకాశం ఏర్పడడంతో పాటు నదుల అనుసంధానం సులువవుతుందన్నారు.