Centre for Cellular and Molecular Biology
-
సంతాన లోపానికి సగం కారణం పురుషుల్లోని సమస్యలే.. షాకింగ్ విషయాలు
సాక్షి, హైదరాబాద్: మన దేశంలోని పురుషుల్లో సంతానోత్పత్తి సామర్థ్యాన్ని ఎనిమిది ప్రత్యేక జన్యువులు ప్రభావితం చేస్తున్నాయని సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (సీసీఎంబీ) శాస్త్రవేత్తలు గుర్తించారు. ఆ ఎనిమిది జన్యువుల్లో జరుగుతున్న మార్పులు వీర్యం ఉత్పత్తిపై ప్రభావం చూపి, పురుషుల్లో వంధ్యత్వానికి కారణమవుతోందని తేల్చారు. ఈ వివరాలను సెంటర్ ఫర్ డీఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ అండ్ డయగ్నస్టిక్స్ డైరెక్టర్ డాక్టర్ కె.తంగరాజ్ వెల్లడించారు. సంతానం కలగకపోవడానికి సగం కారణం పురుషుల్లోని సమస్యలేనని.. పిల్లలు పుట్టకపోతే మహిళలను నిందించడం సరికాదని స్పష్టం చేశారు. జన్యుమార్పులు వంధ్యత్వానికి దారితీస్తున్నట్టు వెల్లడైన నేపథ్యంలో.. ఈ సమస్య పరిష్కారం కోసం మెరుగైన పద్ధతుల ఆవిష్కరణకు వీలవుతుందని సీసీఎంబీ డైరెక్టర్ డాక్టర్ వినయ్‌కుమార్ నందికూరి తెలిపారు. దీర్ఘకాలం నుంచి పరిశోధనలు..: దేశంలోని పురుషుల్లో వంధ్యత్వ సమస్యకు కారణాలను తెలుసుకునేందుకు డాక్టర్ తంగరాజ్ నేతృత్వంలోని శాస్త్రవేత్తల బృందం రెండు దశాబ్దాలుగా పరిశోధనలు చేస్తోంది. గతంలోనూ వంధ్యత్వ సమస్య ఉన్న పురుషుల్లో 38శాతం మంది వై క్రోమోజోమ్‌లో తేడాలున్నట్టు వీరు గుర్తించారు. దీనితోపాటు కణాల్లోని మైటోకాండ్రియా, ఆటోసోమల్ జన్యువుల్లో మార్పులు కూడా వంధ్యత్వానికి కారణమవుతున్నట్టు తేల్చారు. తాజా పరిశోధనలో భాగంగా తాము వంధ్యత్వ సమస్య ఉన్న 47మందిలోని జన్యుక్రమాన్ని పరిశీలించామని తెలిపారు. దేశవ్యాప్తంగా మరో 1,500 మంది వంధ్యత్వ పురుషుల్లోని జన్యుమార్పులతో పోల్చి చూశామని.. ఈ క్రమంలో ఎనిమిది ప్రత్యేక జన్యువుల సంగతి తెలిసిందని పరిశోధనలో భాగం వహించిన సీసీఎంబీ పీహెచ్డీ విద్యార్థి, ముంబై నేషనల్ ఇనిస్టిట్యూట్ ఫర్ రీసెర్చ్ ఇన్ రిప్రొడక్టివ్ అండ్ చైల్డ్ హెల్త్ శాస్త్రవేత్త సుధాకర్ దిగుమర్తి తెలిపారు. ఈ పరిశోధనలో బెంగళూరు జవహర్లాల్ నెహ్రూ సెంటర్ ఫర్ అడ్వాన్స్డ్ సైంటిఫిక్ రీసెర్చ్‌తోపాటు సికింద్రాబాద్‌లోని మమత ఫెర్టిలిటీ ఆస్పత్రి, సీడీఎఫ్‌డీ తదితర జాతీయ, అంతర్జాతీయ సంస్థలు పాల్గొన్నాయని వివరించారు. ఈ వివరాలు హ్యూమన్ మాలిక్యులర్ జెనెటిక్స్ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. డాక్టర్ కె.తంగరాజ్ -
మురుగు నీటిలోనూ కరోనా వైరస్ ఆనవాళ్లు
హైదరాబాద్: మహానగరంలో కరోనా వైరస్ విజృంభిస్తున్న వేళ సీసీఎంబీ కీలక విషయాలను వెల్లడించింది. కరోనా వైరస్ కేవలం ముక్కు, నోటి నుంచి వెలువడే స్రావాల ద్వారా మాత్రమే వ్యాప్తిచెందుతుండగా తాజాగా మురుగు నీటిలోనూ వైరస్ ఆనవాళ్లు ఉంటాయని సీసీఎంబీ తెలిపింది. అయితే మురుగు నీటిలో వైరస్ ఉనికి గుర్తించినా ఇది వేరొకరికి సంక్రమించదని స్పష్టం చేసింది. సీసీఎంబీతో కలిసి సీఎస్ఐర్, ఐఐసీటీ తదితర సంస్ధలు చేసిన పరిశోధనలో ఈ వివరాలు వెల్లడయ్యాయి. 80 శాతం మురుగు నీటి కేంద్రాల్లో వైరస్ అవశేషాలు ఉన్నట్లు గుర్తించారు. ఈ పరీక్షలన్ని సీసీఎంబీ కరోనా పరీక్ష కేంద్రాలలో నిర్వహించారు. మరోవైపు ఈ పరీక్షలలో పాల్గొనడానికి ఐఐసీటీ నుండి మునుపాటి హేమలత, హరీష్ శంకర్, వెంకట్ మోహన్, సీసీఎంబీ నుంచి ఉదయ్ కిరణ్, కుంచా సంతోష్ కుమార్, రాకేశ్ మిశ్రాలు పాల్గొన్నారు. వివిధ అధ్యయనాల చేయడం ద్వారానే వైరస్ మూలాలను కనుక్కోవచ్చని, తద్వారా వైరస్ నిరోధానికి ప్రణాళికలు రచించవచ్చని సీసీఎంబీ పేర్కొంది. చదవండి: మధుమేహ నిర్ధారణకు కొత్త మార్గం! -
మధుమేహ నిర్ధారణకు కొత్త మార్గం!
జన్యు శాస్త్రం సహాయంతో మధుమేహాన్ని నిర్దారించే కొత్త మార్గం ద్వారా భారతీయుల్లో మెరుగైన నిర్థారణ,చికిత్సకు మార్గం సుగమం చేస్తుందని నూతన పరిశోధనలు తేల్చాయి. భారతదేశంలో మధుమేహపు తప్పు నిర్థారణ ఒక సమస్యగా మారింది. ప్రామాణిక పాశ్చాత్య పాఠ్యపుస్తకాల్లో ఉండే మధుమేహ లక్షణాలు భారతీయుల్లో భిన్నంగా ఉండడం ఈ తరహా సమస్యకు దారి తీస్తోంది. ఇటీవల కాలం వరకూ టైప్ -1 మధుమేహం పిల్లల్లో కౌమార దశలో కనిపిస్తుందని, అదే విధంగా టైప్ -2 మధుమేహం ఊబకాయం ఉన్నవారిలోనూ, ఎక్కువ వయసు గల వారిలోనూ అంటే సాధారణంగా 45 సంవత్సరాలు దాటిన వారిలో కనిపిస్తుందని నమ్మేవారు. ఏదేమైనా టైప్ 1 మధుమేహం పెద్దవారిలో కూడా కనిపిస్తుందని ఇటీవలి పరిశోధనలు తెలియజేస్తున్నాయి. అయితే టైప్ -2 మధుమేహం యువకులు మరియు సన్నగా ఉన్న భారతీయుల్లో కూడా పెరుగుతోంది. ఈ పరిస్థితుల్లో రెండు రకాల మధుమేహాలను వేరు చేయటం మరింత క్లిష్టంగా మారింది. టైప్ -1 మధుమేహం జీవితకాలం ఇన్సులిల్ ఇంజెక్షన్లు అవసరమయ్యే రెండు రకాల వేర్వేరు చికిత్సా విధానాలను అనుసరిస్తుంది. టైప్ -2 మధుమేహం తరచుగా ఆహారం లేదా మాత్రల చికిత్సతో నిర్వహించటం జరుగుతుంది. మధుమేహ రకాన్ని తప్పుగా వర్గీకరించడం ఉప-ప్రామాణిక మధుమేహ సంరక్షణ విషయంలో సమస్యలకు దారి తీయవచ్చు. పూణేలోని కె.ఈ.ఎం. ఆసుపత్రి, సి.ఎస్.ఐ.ఆర్ - సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (సీసీఎంబీ), హైదరాబాద్, యు.కె.లోని యూనివర్సిటీ ఆఫ్ ఎక్సెటర్ పరిశోధకుల మధ్య నిర్వహించిన ఒక నూతన ప్రచురణ, భారతీయుల్లో టైప్ -1 మధుమేహ నిర్ధారణలో జన్యువులు కీలకమైన విషయాలను, ప్రభావవంతగా చూపిస్తాయని తెలిపింది. టైప్ 1 మధుమేహం అభివృద్ధి చెందే అవకాశాన్ని పెంచే వివరణాత్మక జన్యు సమాచారాన్ని ఎక్సేటర్ విశ్వవిద్యాలయం అభివృద్ధి చేసిన జన్యు ప్రమాద స్కోరు పరిగణలోకి తీసుకుంది. ఆరోగ్య పరీక్షల సమయంలో ఎవరిలోనైనా టైప్ 1 మధుమేహం ఉందో లేదో నిర్ణయించటంలో ఈ స్కోరును ఉపయోగించవచ్చు. ఇప్పటి వరకూ ఈ పరిశోధనలు యూరోపియన్ జనాభా మీద జరిగాయి. ఇప్పుడు సైంటిఫిక్ రిపోర్ట్స్ లో ప్రచురించిన ఓ పత్రికలో, భారతీయుల్లో టైప్ 1 మధుమేహాన్ని గుర్తించటంలో యూరోపియన్ రిస్క్ స్కోర్ ప్రభావవంతంగా ఉంటుందా అనే విషయాన్ని పరిశోధకులు విశ్లేషించారు. ఈ బృందం భారతదేశంలోని పూణె నుంచి మధుమేహం ఉన్న వారిని అధ్యయనం చేసింది. టైప్ 1 మధుమేహం ఉన్న 262 మందిని, టైప్ 2 మధుమేహం ఉన్న 352 మందిని, మధుమేహం లేని 334 మంది ఆరోగ్య పరిస్థితులను ఈ బృందం విశ్లేషించింది. వీరంతా భారతీయు (ఇండో-యూరోపియన్) మూలాలకు చెందిన వారు. భారతీయ జనాభా నుంచి వచ్చిన ఫలితాలను వెల్ కమ్ ట్రస్ట్ కేస్స్ కంట్రోల్ కన్సార్టియం అధ్యనం నుంచి యూరోపియన్లతో పోల్చి పరిశోధించారు. డయాబెటిస్ యు.కె, పూణెలోని కె.ఈ.ఎం. హాస్పిటల్ రీసెర్చ్ సెంటర్ మరియు భారతదేశంలోని కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ (సి.ఎస్.ఐ.ఆర్) మద్ధతుతో ఈ పరిశోధన, భారతీయుల్లో సరైన రకమైన మధుమేహాన్ని గుర్తించటంలో ఈ పరీక్ష ప్రభావ వంతంగా ఉందని, ప్రస్తుత రూపంలో కూడా ఇది యూరోపియన్ డేటా మీద ఆధాపడి ఉంటుందని కనుగొన్నారు. ఈ రచయితలు జనాభా మధ్య జన్యుపరమైన తేడాలను గుర్తించారు. దీని ఆధారంగా భారతీయ జనాభా విషయంలో ఫలితాలను మరింత బాగా తెలుసుకునేందుకు పరీక్షలను మరింత మెరుగుపరచవచ్చు. ఈ విషయం గురించి ఎక్సెటర్ మెడికల్ స్కూల్ విశ్వవిద్యాలయానికి చెందిన డాక్టర్ రిచర్డ్ ఓరం తెలియజేస్తూ, సరైన మధుమేహం రకాన్ని నిర్ధారించడం వైద్యులకు చాలా కష్టమైన సవాలు అని, టైప్ 1 మధుమేహం ఏ వయసులోనైనా సంభవిస్తుందనే విషయం మనకు ఇప్పుడు తెలుసుకున్నామన్నారు. తక్కువ బీఎంఐ ఉన్న వారిలో టైప్ -2 మధుమేహం కేసులు ఎక్కువగా ఉన్నందున ఈ పని భారతదేశంలో మరింత కష్టమన్న ఆయన, తమ జన్యు రిస్క్ స్కోరు భారతీయులకు సమర్థవంతమైన సాధనమని తమకు తెలుసునన్నారు. డయాబెటిక్ కెటోయాసిడోసిస్ వంటి ప్రాణాంతక సమస్యలను నివారించేందుకు, అదే విధంగా ఉత్తమ ఆరోగ్య ఫలితాలను సాధించడానికి ప్రజలకు అవసరమైన చికిత్సను పొందటంలో సహాయపడుతుందని వివరించారు. పూణేలోని కె.ఈ.ఎం. హాస్పిటల్ మరియు రీసెర్చ్ సెంటర్‌కు చెందిన డాక్టర్ చిత్తరంజన్ యాజ్నిక్, డాక్టర్ ఓరమ్ చెప్పిన విషయాలతో అంగీకరించారు. భారతీయ యువతలో సైతం అంటువ్యాధిలా విస్తరిస్తున్న మధుమేహం, దాని దీర్ఘకాలిక జీవ, సామాజిక మరియు ఆర్థిక చిక్కులను నివారించేందుకు ఈ సమస్యను సరిగ్గా నిర్థారించడం అత్యంత ఆవశ్యకమని పేర్కొన్నారు. కొత్త జన్యుసాధనం దీనికి బాగా ఉపకరిస్తుందని, భారతీయ శరీరంలో (సన్నని కొవ్వు కలిగిన భారతీయులు) అధిక కొవ్వు మరియు అల్ప కండర ద్రవ్యరాశి కారణంగా ఇన్సులిన్ తగ్గిన చర్యకు వ్యతిరేకంగా ప్యాంక్రియాటిక్ బి కణాల విఫలతను నిర్థారించటంలో ఇది సహాయపడుతుందని తెలిపారు. మధుమేహ రోగుల శారీరక లక్షణాలు ప్రామాణిక అంశాల నుంచి భిన్నంగా ఉన్న భారతదేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన మధుమేహ రోగుల్లో ఈ పరీక్షను ఉపయోగించాలని ఎదురు చూస్తున్నట్లు ఆయన తెలిపారు. భారతీయ మరియు యూరోపియన్ జనాభాలో టైప్ 1 మధుమేహంతో సంబంధం ఉన్న తొమ్మిది జన్యు విభాగాలను (ఎస్.ఎన్.పి.లుగా పిలుస్తారు) రచయితలు కనుగొన్నారు. దీని ద్వారా భారతీయుల్లో టైప్ 1 మధుమేహం ఆగమనాన్ని అంచనా వేయడానికి దీన్ని ఉపయోగించవచ్చు. సి.ఎస్.ఐ.ఆర్ - సెంటర్ ఫర్ సెల్యూలార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (సి.సి.ఎం.బి)లో అధ్యయనానికి నాయకత్వం వహించిన చీఫ్ సైంటిస్ట్ డాక్టర్ జీఆర్ చందన్ ఈ విషయం గురించి తెలియజేస్తూ, భారతీయ మరియు యూరోపియన్ రోగుల్లో వేర్వేరు ఎస్ఎన్పీలు అధికంగా ఉన్నాయని గమనించటం ఆసక్తికరంగా ఉందని, ఈ ఎస్ఎన్పీలతో పర్యావరణ కారకాలు సంకర్షణ చెందే అవకాశాన్ని ఇది బయటపెడుతుందని వివరించారు. భారతదేశ జనాభా జన్యు వైవిధ్యాన్ని బట్టి, అధ్యయన ఫలితాలు దేశంలోని ఇతర సంతతి విషయాల్లో కూడా ధృవీకరించాల్సి ఉంది. సి.ఎస్.ఐ.ఆర్ – సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (సి.సి.ఎం.బి) డైరక్టర్ డాక్టర్ రాకేశ్ కె.మిశ్రా ఈ విషయం గురించి వివరిస్తూ, 15 సంవత్సరాల కంటే తక్కువ వయసు గల టైప్ 1 మధుమేహం ఉన్న వారిలో 20 శాతం భారతదేశంలో ఉన్నందున, జన్యు పరీక్ష కిట్ లను అభివృద్ధి చేస్తున్నారని, టైప్ 1 మరియు టైప్ 2 మధుమేహాలను విశ్వసనీయంగా గుర్తించగలిగే ఈ కిట్ దేశానికి అత్యంత ప్రాధాన్యత కల అంశమని తెలిపారు. -
రేపటి నుంచి సీసీఎంబీలో కరోనా పరీక్షలు
సాక్షి, హైదరాబాద్ : సెంటర్ ఫర్ సెల్యూలర్ అండ్ మాలిక్యూలర్ బయోలజీలో(సీసీఎంబీ) కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించేందుకు గ్రీన్ సిగ్నల్ లభించింది. రేపటి(మంగళవారం) నుంచి సీసీఎంబీలో కరోనా పరీక్షలు జరపడానికి కేంద్రం అనుమతిచ్చింది. సీసీఎంబీలో కరోనా పరీక్షలకు అనుమతి ఇవ్వాలని కొద్ది రోజుల కిందట తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరిన సంగతి తెలిసిందే. కేసీఆర్ విజ్ఞప్తిపై సానుకూలంగా స్పందించిన కేంద్రం సీసీఎంబీలో కరోనా పరీక్షల నిర్వాహణకు అనుమతిస్తున్నట్టు నేడు ప్రకటన చేసింది. దీంతో సీసీఎంబీ అధికారులు కరోనా నిర్ధారణ పరీక్షలు చేయడానికి సిద్ధమవుతున్నారు. కాగా, సీసీఎంబీలో రోజుకు 800 నుంచి 1000 శాంపిల్స్ పరీక్షించే సామర్థ్యం ఉన్నట్టుగా నిపుణలు చెప్తున్నారు. రోజురోజుకు కరోనా అనుమానితులు సంఖ్య పెరుగుతున్న క్రమంలో సీసీఎంబీలో పరీక్షలు నిర్వహించడం ద్వారా త్వరితగగిన ఫలితాలు తెలుసుకునే అవకాశం ఉంటుంది. -
మూలకణ చికిత్సకు నిమ్స్‌లో ప్రత్యేక విభాగం
రూ. 25 కోట్లు విడుదల చేసిన కేంద్ర ప్రభుత్వం హైదరాబాద్: రాష్ట్రంలో మొదటిసారిగా ప్రభుత్వరంగంలో కేన్సర్, కీళ్ల నొప్పులు వంటి మొండి జబ్బులను నయం చేసే మూలకణ చికిత్స నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్(నిమ్స్)లో అందుబాటులోకి రానుంది. దీనికోసం ప్రత్యేక విభాగం ఏర్పాటు కానుంది. మూల కణాలను సేకరించడం, సంబంధిత బంధువులకుగాని, ఇతర రోగులకుగాని ఇచ్చి చికిత్స నిర్వహించడం ఈ విభాగం పని. కేంద్ర ప్రభుత్వం ఈ ప్రత్యేక విభాగం ఏర్పాటుకు రూ.25 కోట్లు మంజూరు చేసిందని వైద్య, ఆరోగ్య శాఖ వర్గాలు తెలిపాయి. మూల కణాల సేకరణ, భద్రత కోసం సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ(సీసీఎంబీ) సహకారం తీసుకోనున్నారు. ఈ మేరకు ఇటీవల సీసీఎంబీతో నిమ్స్ అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. సీసీఎంబీ శాస్త్రవేత్తలు మూలకణాలను సేకరించి భద్రపరిస్తే, వాటితో నిమ్స్ వైద్యులు రోగులకు చికిత్స నిర్వహిస్తారు. నిమ్స్‌లోని ఈ విభాగానికి అధిపతిగా డాక్టర్ నరేంద్ర వ్యవహరిస్తారు. కార్పొరేట్, సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల్లో మూలకణ చికిత్సకు రూ.25 లక్షల నుంచి రూ.30 లక్షల వరకు ఖర్చు అవుతుండగా నిమ్స్‌లో రూ.10 లక్షలకే అందుబాటులోకి రానుంది. బోన్‌మ్యారో చికిత్సను ఆరోగ్యశ్రీ రోగులకైతే రూ. 8.7 లక్షలకే చేస్తారు. నిమ్స్‌లో మూలకణ చికిత్స విభాగం మూడు నెలల్లో అందుబాటులోకి రానుంది. ప్రత్యేక విభాగం కోసం నిమ్స్‌లో 25 వేల చదరపు అడుగుల విస్తీర్ణంతో ఒక అంతస్తును కేటాయించారు. రాష్ట్రంలో రెండు కార్పొరేట్ ఆస్పత్రుల్లో మాత్రమే మూలకణ చికిత్స అందుబాటులో ఉంది. వివిధ రకాల క్యాన్సర్లతో వచ్చే రోగులకు మూల కణ చికిత్స అత్యంత కీలకమైందని, దీన్ని ప్రభుత్వం రంగంలో తీసుకురావడం అభినందనీయమని నిమ్స్ వర్గాలు చెబుతున్నాయి. -
కణానికి ‘ఎల్’పై ప్రేమ ఎందుకు ?
అమినోయాసిడ్ల ఎంపిక గుట్టు ఛేదించిన సీసీఎంబీ సాక్షి, హైదరాబాద్: మనిషి దేహంలో దశాబ్దాల పరిశోధనల తరువాత కూడా తేలని మిస్టరీలు బోలెడు! హైదరాబాద్‌లోని సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (సీసీఎంబీ) ఇటువంటి ఓ మిస్టరీని విజయవంతంగా ఛేదించి జీవశాస్త్రంలో సరికొత్త అధ్యాయానికి తెరతీసింది. ఆ వివరాలు... జీర్ణక్రియ, బ్యాక్టీరియా, వైరస్ల నుంచి రక్షణ, మన ఒడ్డూ, పొడవు, చర్మపు రంగు జన్యువులను నియంత్రించడం.. ఇలా మన శరీరంలో ప్రొటీన్లు చేసే పనులు ఎన్నో... ఎన్నెన్నో! ఈ ప్రొటీన్లు మూడు రసాయన మూలకాలతో కూడిన అమినోయాసిడ్లతో ఏర్పడతాయి. ఈ మూలకాల్లో ఏ ఒక్క మూలకం మారినా, ఉండాల్సిన స్థానంలో లేకపోయినా విపరీతాలు సంభవిస్తాయి. ఉదాహరణకు... ఒక అమినోయాసిడ్ మారిపోతే ఆ వ్యక్తికి థలసీమియా వంటి ప్రాణాంతక వ్యాధి వచ్చే ప్రమాదముంది. కానీ ఇక్కడో చిక్కుంది. మన శరీరంలో రెండు రకాల అమినోయాసిడ్లు ఉంటాయి. వీటికి ఎల్, డీ అమినోయాసిడ్లుగా పేరు. మనిషికుండే రెండు చేతుల్లా ఇవీ ఒకే తీరుగా ఉంటాయి. కానీ ఒకదానికొకటి ప్రతిబింబం! దీన్నే కైరాలిటీ అంటారు. విచిత్రమైన విషయం ఏమిటంటే.. మన శరీర కణాలు ఎల్ అమినోయాసిడ్లను మాత్రమే ఉపయోగించుకుని దాదాపు 25 వేల ప్రొటీన్లను తయారుచేస్తూంటాయి. డీ అమినోయాసిడ్లను కణాలు ఎందుకు ఎంచుకోవు? బ్యాక్టీరియా కణాల నుంచి సంక్లిష్ట మానవ కణాల వరకూ ఎలాంటి తప్పుల్లేకుండా ఈ ఎంపిక ఎలా జరుగుతోంది? ఆసక్తికరమైన ఈ ప్రశ్నలకు సీసీఎంబీ శాస్త్రవేత్త శంకరనారాయణ సమాధానం కనుక్కున్నారు. ఒక్క ఎంజైమ్‌తో ‘డీ’లు మాయం: కణాల్లో ప్రొటీన్లను తయారు చేసే ఫ్యాక్టరీలుగా పిలిచే రైబోజోమ్లలో కేవలం ఎల్ అమినోయాసిడ్లను మాత్రమే ఎంచుకునే ఒక వ్యవస్థ ఉందన్న విషయం చాలాకాలం కిందటే తెలిసినప్పటికీ డీటీడీ అనే ఎంజైమ్ వల్ల ఇది సాధ్యమవుతోందని సీసీఎంబీ శాస్త్రవేత్తలు గుర్తించారు. దీన్ని అర్థం చేసుకోవాలంటే కణాల్లో ప్రొటీన్లు ఎలా తయారవుతాయో తెలుసుకోవాలి. మన సమాచారమంతా డీఎన్ఏలో దాగి ఉంటుందని మనకు తెలుసు. డీఎన్ఏ అమినోయాసిడ్లు, చక్కెరలతో తయారవుతుందనీ మనం చదువుకుని ఉంటాం. ప్రొటీన్లను తయారు చేసేందుకు అవసరమైన సమాచారం ఎంఆర్ఎన్ఏ అనే నిర్మాణం డీఎన్ఏ నుంచి కాపీ చేసుకుంటే... టీఆర్ఎన్ఏ దాన్ని మోసుకుని రైబోజోమ్లోకి చేరుతుంది. ఇంకోలా చెప్పాలంటే ప్రొటీన్ల నిర్మాణానికి అవసరమైన అమినోయాసిడ్లు రైబోజోమ్లోకి వస్తాయన్నమాట. సరిగ్గా ఇక్కడే డీటీడీ ఎంజైమ్ పనిచేయడం మొదలవుతుంది. ఈ అమినోయాసిడ్లలో ఎల్, డీ రెండు రకాలూ ఉంటాయి. కానీ రసాయన నిర్మాణం, ఎంజైమ్‌లో అవి అతుక్కునే స్థానాలను బట్టి డీటీడీ ఏది ఎల్, ఏది డీ అన్నది గుర్తిస్తుంది. తదనుగుణంగా ఎల్లను మాత్రమే ఉంచుకుని డీలను కత్తిరించి పక్కకు తోసేస్తుంది. ఉపయోగమేమిటి?: జీవశాస్త్రంలో అత్యంత మౌలికమైన ప్రశ్నల్లో ఒకదానికి సమాధానం లభించడం అన్నింటికంటే ముఖ్యమైన ఉపయోగం. అదేసమయంలో మన మెదడులో డీ అమినోయాసిడ్లను ఉపయోగించుకునే న్యూరోనల్ కణాలు ఎక్కువస్థాయిలో ఉంటాయి. ఈ తేడాతో ఉన్న లాభనష్టాలేమిటి? అన్నది ఇకపై తెలుసుకోవచ్చు. తద్వా రా అల్జీమర్స్, పార్కిన్సన్స్ వంటి నాడీ సంబంధిత వ్యాధుల చికిత్సకు కొత్త అవకాశాలు ఏర్పడతాయి. అంతేకాదు.. కొన్ని సందర్భాల్లో కృత్రిమంగా తయారు చేసుకునే ప్రొటీన్లను మనం ఉపయోగిస్తుంటాం. వీటిల్లో ఏవి మనకు ఎక్కువ ఉపయోగడపడతాయో గుర్తించవచ్చు.