Centre for Media Studies
-
ఒక్కో ఓటుపై రూ.700
దేశంలో ఎన్నికలు ఏవైనా నగదు ప్రవాహం మాత్రం యథేచ్ఛగా సాగుతూ ఉంటుంది. చాలామంది అభ్యర్థులు ఎన్నికల ప్రచారంలో ఖర్చు పెట్టే మొత్తానికి, ఎన్నికల సంఘానికి సమర్పించే వివరాలకు పొంతన ఉండదు. తాజాగా సెంటర్ ఫర్ మీడియా స్టడీస్ చేసిన అధ్యయనంలో ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికలతో పాటు వేర్వేరు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని రాజకీయ పార్టీలు కలిసి రూ.55,000 కోట్ల నుంచి రూ.60,000 కోట్లు ఖర్చు పెట్టినట్లు సెంటర్ ఫర్ మీడియా స్టడీస్ తెలిపింది. ఎన్నికలు సజావుగా నిర్వహించడానికి ఈసీ పెట్టిన ఖర్చుతో పాటు అభ్యర్థులు చేసిన వ్యయం, తాయిలాలను ఇందులో లెక్కించినట్లు వెల్లడించింది. సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన మార్చి 10 నుంచి చివరి విడత ఎన్నికలు జరిగిన మే 19 వరకూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించిన సంక్షేమ పథకాలు, ఇతర రూపాల్లో ఖర్చుపెట్టిన మొత్తాన్ని ఇందులో కలిపినట్లు పేర్కొంది. ఈ లెక్కల ప్రకారం ఒక్కో నియోజకవర్గంలో పార్టీలన్నీ కలిసి రూ.100 కోట్లను ఖర్చు పెట్టినట్లు తేల్చింది. అంటే ఒక్కో ఓటు కోసం సగటున రూ.700 ఖర్చు పెట్టారన్నమాట. ఒకవేళ ఈసీ ఎన్నికల నిర్వహణ ఖర్చులను, ప్రభుత్వ పథకాల లబ్ధిని తొలగిస్తే ఒక్కో ఓటుపై రాజకీయ పార్టీలు రూ.583 ఖర్చుపెట్టినట్లు అవుతుంది. పెరిగిపోతున్న ఎన్నికల వ్యయం.. మనదేశంలో రాష్ట్రాలను బట్టి ఒక్కో లోక్‌సభ సభ్యుడు రూ.50 లక్షల నుంచి రూ.70 లక్షల వరకు ఖర్చు పెట్టవచ్చు. అదే అసెంబ్లీ అభ్యర్థులైతే రూ.20 లక్షల నుంచి రూ.28 లక్షల వరకూ ఖర్చు చేయొచ్చు. ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో 8,049 అభ్యర్థులు బరిలో నిలవగా, అరుణాచల్‌ప్రదేశ్, సిక్కిం, ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో 3,589 మంది పోటీ చేశారు. నిజానికి ఈసీ నిబంధనల ప్రకారం లోక్‌సభ, అసెంబ్లీ అభ్యర్థులు చేసిన వ్యయం రూ.6,639.22 కోట్లు దాటకూడదు. కానీ క్షేత్రస్థాయిలో మాత్రం ఈ ఖర్చు రూ.24,000 కోట్లు దాటిపోయిందని స్పష్టం చేసింది. బంగారు ఆభరణాలు, విలువైన లోహాలతో పాటు మత్తుపదార్థాలను సైతం తాయిలాలుగా అందించినట్లు వెల్లడైంది. కేవలం గుజరాత్, ఢిల్లీ, పంజాబ్ రాష్ట్రాల్లోనే రూ.1,280 కోట్ల డ్రగ్స్‌ను సీజ్ చేశారంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. 2014 సార్వత్రిక ఎన్నికలతో పోల్చుకుంటే ఈసారి 3 రెట్లు అధికంగా నగదును ఈసీ జప్తు చేసింది. ఎన్నికల రారాజు బీజేపీ.. ఈ సార్వత్రిక ఎన్నికల ఖర్చులో సింహభాగం బీజేపీదే. ఈ ఎన్నికల్లో బీజేపీ ఏకంగా రూ.24,750 కోట్ల నుంచి రూ.30,250 కోట్లు ఖర్చు పెట్టిందని సమాచారం. మొత్తం ఎన్నికల ప్రచార వ్యయంలో బీజేపీ వాటా 45 నుంచి 55 శాతానికి చేరుకోగా, కాంగ్రెస్ పార్టీ మాత్రం 15 నుంచి 20 శాతానికి పరిమితమైంది. ధనప్రవాహం ఎక్కడిది? సమాచార హక్కు చట్టం(ఆర్టీఐ) పరిధిలోకి రాకపోవడం రాజకీయ పార్టీల పాలిట వరంగా మారుతోంది. దీంతో తమకు విరాళాలు ఇచ్చింది ఎవరన్న విషయాన్ని పార్టీలు బయటపెట్టకపోవడంతో పారదర్శకత అన్నది కొరవడింది. దీనికితోడు ఎలక్టోరల్ బాండ్లు కూడా ఎన్నికల వ్యవస్థలో పారదర్శకతను పాతరేశాయని అధ్యయనం స్పష్టం చేసింది. ఈ ఏడాది జనవరి నుంచి మే నెల చివరివరకూ 4,794 ఎలక్టోరల్ బాండ్లు అమ్ముడయ్యాయని చెప్పింది. కేంద్రంలో ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా, రియల్ఎస్టేట్, మైనింగ్, టెలికం, రవాణా రంగాలను ప్రభావితం చేసేలా నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుందని అధ్యయనం తేల్చింది. వీటికితోడు పలు విద్యాసంస్థలు, కాంట్రాక్టర్లు, ఎన్జీవో సంస్థలు కూడా తమ ప్రయోజనాల రీత్యా రాజకీయ పార్టీలకు విరాళాలు ఇస్తున్నాయని చెప్పింది. ఎన్నికల వ్యయ నియంత్రణ, పారదర్శకత విషయమై 54 దేశాల్లో తాము జరిపిన అధ్యయనంలో భారత్ 31 పాయింట్లు సాధించినట్లు సెంటర్ ఫర్ స్టడీస్ తెలిపింది. అంటే భారత్ ఈ జాబితాలో దిగువ నుంచి 12వ స్థానంలో ఉందని పేర్కొంది. -
పర్యావరణం ఒక హెడ్లైన్ కావాలి
కృషి పీఎన్ వాసంతి.. వార్తల్లో వ్యక్తి కాదు. కాని ఆమె గురించి రాయాల్సిన, తెలుసుకోవాల్సిన అవసరం ఉన్న వ్యక్తి! ఎందుకంటే జెండర్ గురించి, బాలల గురించి, పర్యావరణం గురించి మీడియా ద్వారా ప్రజల్లో అవగాహన కల్పించడానికి 25 ఏళ్ల కిందటే నడుంకట్టారు ఆమె. మంచి మార్పుకి మీడియా పవర్ఫుల్ టూల్ అని పాతికేళ్ల కిందటే గ్రహించి పీజీ స్టూడెంట్‌గా ఉన్నప్పుడే ‘సెంటర్ ఫర్ మీడియా స్టడీస్’ అనే ఆర్గనైజేషన్‌ను ప్రారంభించి ఈ రోజు దానికి డైరెక్టర్ జనరల్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. అందుకే ఆమె గురించి తెలుసుకోవాలి. వివరాలు... పీఎన్ వాసంతి ఢిల్లీలో పుట్టి పెరిగారు. ఎమ్ఏ సైకాలజీ చేశారు. తల్లిదండ్రులు కూతురుని సివిల్ సర్వీసెస్‌లోకి పంపాలనుకున్నారు. వాసంతికేమో బయటి నుంచి ప్రభుత్వాన్ని ప్రభావితం చేసే రంగాల్లో పని చేయాలని ఉండేది. సైకాలజీలో ఆమె సబ్జెక్ట్ కూడా ‘మీడియా ఇంపాక్ట్ ఆన్ హ్యుమన్ బిహేవియర్’. చదువు, ఇష్టం, లక్ష్యం మూడూ ఆమెను ఊరికే ఉండనివ్వలేదు. ఎమ్ఏ ఫైనలియర్లో ఉన్నప్పుడే తోటి విద్యార్థులతో కలిసి ‘సెంటర్ ఫర్ మీడియా స్టడీస్ ఆర్గనైజేషన్’ను స్టార్ట్ చేశారు. ఇది మీడియాను సెన్సిటైజ్ చేసే సంస్థ. స్ఫూర్తి వాసంతికి చిన్నప్పుడు ఇందిరాగాంధి అంటే స్ఫూర్తి. స్కూల్లో చదువుతున్నప్పుడు ఇందిరాగాంధీని కలిశారు కూడా. ఆమె ఇతర మహిళలకు ఎలా స్ఫూర్తిగా నిలిచింది, దేశ విధానాల్లో ఇన్ని మార్పులను ఎలా తీసుకురాగలింది అనే దాని మీద దృష్టిపెట్టారు. తాను అనుకున్న వాటి మీద అధ్యయనం చేస్తూ, పరిశీలిస్తూ దేశమే కాదు ప్రపంచమంతా తిరిగారు. మనకు, పాశ్చాత్యా దేశాలకు మధ్య తేడాలేంటో తెలుసుకున్నారు. ‘మన దగ్గర తోటి మానవుల పట్ల అసలు గౌరవం ఉండదు. ఇక స్త్రీల విషయంలో చెప్పక్కర్లేదు. కాని వెస్ట్రన్ కంట్రీస్‌లో తోటివారికిచ్చే విలువ, గౌరవాన్ని చూస్తే ముచ్చటేస్తుంది. ఒకింత అసూయా కలుగుతుంది. మన దేశంలో అది కనిపించదని బా«ధపడ్డాను కూడా. బహుశా మన దగ్గరున్న అధిక జనాభా దీనికి కారణమై ఉండొచ్చు. జనం విపరీతంగా ఉండడం వల్ల మనకు మనవాళ్ల విలువ తెలియట్లేదేమో! అయితే అధిక జనాభా కూడా మనకు స్ట్రెంతే. దాన్ని తెలుసుకోలేకపోతున్నాం.’ అంటారు వాసంతి. కృషి ఎంత? ఆమె ఈ 25 ఏళ్లుగా జెండర్, పిల్లలు, పర్యావరణ సమస్యలెన్నిటినో వెలుగులోకి తీసుకొచ్చారు. ముఖ్యంగా పర్యావరణ సమస్యలు. మనింట్లోని పెరట్లో వచ్చే మార్పులనే మనం గమనించలేకపోతున్నాం అంటారామె. ‘మా స్టడీలో వార్తాపత్రికలు, చానెళ్లు లేవనెత్తిన అంశం చాలా ఆసక్తికరంగా ఉంది. మాకు పర్యావరణానికి సంబంధించి కంటెంటే రాదు అంటారు వాళ్లు. దీని మీద పనిచేసే ఎన్జీవోలున్నాయి కాని సమస్యలు కాకుండా వాళ్ల ఎజెండానే ఫోకస్ చేస్తుంటారు అని కూడా చెప్పారు. అప్పుడు మాకర్థమయిందేంటంటే మీడియాకు పర్యావరణానికి సంబంధించిన కంటెంట్ కావాలి. అంటే స్పేస్ ఉంది. కంటెంట్ ఇవ్వాలి. ఇది పదిహేనేళ్ల కిందటి విషయం. టెలివిజన్ ఇండస్ట్రీ అప్పుడప్పుడే బూమ్‌లోకి వస్తోంది. ఆ అవకాశాన్ని తీసుకొని ఒక ఫిలిం ఫెస్టివల్‌ను స్టార్ట్ చేశాం. ఇప్పుడు అది ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్‌గా మారింది. దీనికి సబ్టెక్ట్ ‘ఎన్వైర్మెంట్ అండ్ వైల్డ్‌లైఫ్’. దీనివల్ల ప్రజలు పర్యావరణంతో మమేకం కావడం మొదలుపెట్టారు. తమ చుట్టూ ఉన్న పరిసరాలను గమనించడం, వస్తున్న మార్పులను పసిగట్టడం, సమస్యలను గుర్తించడం ప్రారంభించారు. పర్యావరణ స్పృహను తెచ్చుకుంటున్నారు. భవిష్యత్తులో పర్యావరణ సమస్యలకు పరిష్కారాన్నీ వాళ్లే సూచించగలుగుతారు’ అంటారు వాసంతి. చట్టాలు మాత్రమే.. అమలు? జెండర్, పిల్లలు, పర్యావరణం విషయం ఏదైనా సరే... వాటి మీద పనిచేయడానికి ఎన్ని స్వచ్ఛంద సంస్థలున్నా మార్పు రావట్లేదు. కారణం మన బాధ్యతారాహిత్యమే అంటారు వాసంతి. ‘ఏ సమస్య వచ్చినా ప్రభుత్వమే పరిష్కరిస్తుందనుకుంటాం మనం. కాని ప్రభుత్వం ఏం చేçస్తుంది. చట్టాలను మాత్రం తెస్తుంది. ఉదాహరణకు పిల్లల హక్కుల సంరక్షణకు లేదంటే బాలకార్మిక వ్యవస్థ నిర్మూలననే తీసుకుందాం. దానికి ఓ చట్టం చేసింది ప్రభుత్వం. అమలు చేసేది మనమే కదా. ఇక్కడ మనమంటే పౌర సమాజం, స్కూళ్లు, కాలేజీలు, యువతరం, టీచింగ్ సిస్టమ్, మీడియా. వీళ్లంతా వాళ్ల వాళ్ల విధులను నిర్వర్తించాలి. అందుకే మన ప్రవర్తనలో మార్పు అవసరం’ అని స్పష్టం చేశారు. ఎలా పనిచేస్తారు? జెండర్, బాలలు, పర్యావరణం మొదలగు అంశాల మీద మీడియాకు సమాచారం అందించడానికి, సలహాలు ఇవ్వడానికి సెంటర్ ఫర్ మీడియా స్టడీస్ వివిధ స్థాయిల్లో పనిచేస్తుంది. ముందుగా మీడియా యాజమాన్యాలతో మాట్లాడుతుంది. చైతన్యపరుస్తుంది. ఇంకోవైపు మీడియాలో పనిచేసే వాళ్లకు అవగాహన కల్పించడానికి రెగ్యులర్‌గా వర్క్‌షాప్స్ నిర్విహిస్తుంది. ఫెలోషిప్స్ ఇస్తోంది. మంచి కథనాలకు అవార్డ్స్ ప్రదానం చేస్తోంది. అయితే ఈ సంస్థ దృష్టి పెట్టినవన్నీ చాలా సీరియస్ అంశాలు. టీఆర్పీ రేట్‌ను పెంచేవి కావు, కమర్షియల్స్‌తో కాసులు కురిపించేవీ కావు. కాబట్టి వీటి మీద కథనాలు ప్రచురించడానికి, ప్రసారం చేయడానికి మీడియా అంత సుముఖంగా ఉండదు. ఆ అడ్డంకినీ అధిగమించే పాలసీల గురించీ సంబ«ంధింత అ«ధికారులతో చర్చలు జరుపుతుంది. ‘మా ప్రయాణం సుదీర్ఘమైనది. సమాజంలో తగిన మార్పు, చేతన వచ్చే వరకూ మేము పని చేస్తూనే ఉంటాం’ అంటారు పీఎన్ వాసంతి. – సాక్షి ఫ్యామిలీ -
మోదీ భేష్.. కానీ ‘మార్పు’ లేదు!
సీఎంఎస్ సర్వేలో ప్రజాభిప్రాయం ♦ తమ జీవితాలు మెరుగుపడలేదన్న సగం మంది ♦ ధరల పెరుగుదల, నిరుద్యోగంపై ఆందోళన న్యూఢిల్లీ: కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం కొలువుదీరిన ఈ రెండేళ్లలో తమ జీవితాల్లో ఎలాంటి మార్పూ కనిపించలేదని దాదాపు సగం మంది (49 శాతం) ఒక సర్వేలో అభిప్రాయపడ్డారు. 15 శాతం మంది తమ జీవనప్రమాణాలు దారుణంగా పడిపోయాయన్నారు. 15 రాష్ట్రాల్లో 4వేల మందిపై సెంటర్ ఫర్ మీడియా స్టడీస్ (సీఎంఎస్) ఈ సర్వేను నిర్వహించింది. మోదీ ప్రభుత్వ హయాంలో పేదలు సంక్షేమ పథకాల ప్రయోజనాలను పొందడం లేదని 43 శాతం మంది చెప్పారు. అయితే ప్రధానిగా మోదీ పనితీరు బాగుందని 62 శాతం మంది కొనియాడటం గమనార్హం. మరో దఫా ఆయనే కొనసాగాలని 70 శాతం మంది ఆకాంక్షించారు. సర్వే ఫలితాలను శనివారం లోక్‌సభ మాజీ సెక్రెటరీ జనరల్ సుభాష్ కశ్యప్ మీడియాకు వెల్లడించారు. మోదీ ప్రభ మరింతగా పెరిగిందని, ఎక్కువ మంది ఆయన పనితీరు బాగుందని చెప్పారన్నారు. ధరల పెరుగుదల, నిరుద్యోగంపై ఆందోళన కొనసాగుతోందని సీఎంఎస్ డెరైక్టర్ జనరల్ పీఎన్ వాసంతి పేర్కొన్నారు. సర్వే ముఖ్యాంశాలు ► మూడింట ఒక భాగం కంటే తక్కువ మంది మోదీ హామీలను నెరవేర్చారని చెప్పగా, 49 శాతం మంది మాత్రం అరకొరగా నెరవేర్చారన్నారు. ► మోదీ కృషితో దేశంలో అధికార యంత్రాంగం పనితీరు మెరుగుపడిందని అత్యధికులు అన్నారు. ► ద్రవ్యోల్బణాన్ని 32 శాతం మంది, ఉద్యోగ కల్పనలో అసమర్థతను 29 శాతం మంది ఎత్తిచూపారు. నల్లధనాన్ని వెనక్కి తెప్పించలేదని 26 శాతం మంది చెప్పారు. జన్‌ధన్ యోజన (36 శాతం), స్వచ్ఛభారత్ (32 శాతం)ప్రభుత్వ విజయాలని చెప్పారు. ► మంత్రిత్వ శాఖల పనితీరులో రైల్వే అగ్రస్థానాన నిలవగా, తర్వాత ఆర్థిక, విదేశాంగశాఖలున్నాయి. ► సరిగా పనిచేయని శాఖల్లో కార్మిక-ఉపాధి, న్యాయ, గ్రామీణాభివృద్ధి, వినియోగదారుల వ్యవహారాలు, ఆహార, పౌర సరఫరాలు, సామాజిక న్యాయం-సాధికారత ఉన్నాయి. ► కేంద్ర మంత్రుల ర్యాంకింగ్ల్లో సుష్మాస్వరాజ్ టాప్‌లో నిలవగా, తర్వాతి స్థానాల్లో రాజ్‌నాథ్ సింగ్, సురేశ్ ప్రభు, మనోహర్ పరీకర్, అరుణ్ జైట్లీ ఉన్నారు. అల్ప ర్యాంకింగ్ల్లో రామ్ విలాస్ పాశ్వాన్, బండారు దత్తాత్రేయ, రాధామోహన్ సింగ్, జేపీ నడ్డా, ప్రకాశ్ జవదేకర్ ఉన్నారు. వెంకయ్య(పట్టణాభివృద్ధి), స్మృతీ ఇరానీ (మానవ వనరులు)లకు సగటు ముద్రపడింది.