మోదీ భేష్.. కానీ ‘మార్పు’ లేదు!
సీఎంఎస్ సర్వేలో ప్రజాభిప్రాయం
♦ తమ జీవితాలు మెరుగుపడలేదన్న సగం మంది
♦ ధరల పెరుగుదల, నిరుద్యోగంపై ఆందోళన
న్యూఢిల్లీ: కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం కొలువుదీరిన ఈ రెండేళ్లలో తమ జీవితాల్లో ఎలాంటి మార్పూ కనిపించలేదని దాదాపు సగం మంది (49 శాతం) ఒక సర్వేలో అభిప్రాయపడ్డారు. 15 శాతం మంది తమ జీవనప్రమాణాలు దారుణంగా పడిపోయాయన్నారు. 15 రాష్ట్రాల్లో 4వేల మందిపై సెంటర్ ఫర్ మీడియా స్టడీస్ (సీఎంఎస్) ఈ సర్వేను నిర్వహించింది. మోదీ ప్రభుత్వ హయాంలో పేదలు సంక్షేమ పథకాల ప్రయోజనాలను పొందడం లేదని 43 శాతం మంది చెప్పారు. అయితే ప్రధానిగా మోదీ పనితీరు బాగుందని 62 శాతం మంది కొనియాడటం గమనార్హం. మరో దఫా ఆయనే కొనసాగాలని 70 శాతం మంది ఆకాంక్షించారు. సర్వే ఫలితాలను శనివారం లోక్‌సభ మాజీ సెక్రెటరీ జనరల్ సుభాష్ కశ్యప్ మీడియాకు వెల్లడించారు. మోదీ ప్రభ మరింతగా పెరిగిందని, ఎక్కువ మంది ఆయన పనితీరు బాగుందని చెప్పారన్నారు. ధరల పెరుగుదల, నిరుద్యోగంపై ఆందోళన కొనసాగుతోందని సీఎంఎస్ డెరైక్టర్ జనరల్ పీఎన్ వాసంతి పేర్కొన్నారు.
సర్వే ముఖ్యాంశాలు
► మూడింట ఒక భాగం కంటే తక్కువ మంది మోదీ హామీలను నెరవేర్చారని చెప్పగా, 49 శాతం మంది మాత్రం అరకొరగా నెరవేర్చారన్నారు.
► మోదీ కృషితో దేశంలో అధికార యంత్రాంగం పనితీరు మెరుగుపడిందని అత్యధికులు అన్నారు.
► ద్రవ్యోల్బణాన్ని 32 శాతం మంది, ఉద్యోగ కల్పనలో అసమర్థతను 29 శాతం మంది ఎత్తిచూపారు. నల్లధనాన్ని వెనక్కి తెప్పించలేదని 26 శాతం మంది చెప్పారు. జన్‌ధన్ యోజన (36 శాతం), స్వచ్ఛభారత్ (32 శాతం)ప్రభుత్వ విజయాలని చెప్పారు.
► మంత్రిత్వ శాఖల పనితీరులో రైల్వే అగ్రస్థానాన నిలవగా, తర్వాత ఆర్థిక, విదేశాంగశాఖలున్నాయి.
► సరిగా పనిచేయని శాఖల్లో కార్మిక-ఉపాధి, న్యాయ, గ్రామీణాభివృద్ధి, వినియోగదారుల వ్యవహారాలు, ఆహార, పౌర సరఫరాలు, సామాజిక న్యాయం-సాధికారత ఉన్నాయి.
► కేంద్ర మంత్రుల ర్యాంకింగ్‌ల్లో సుష్మాస్వరాజ్ టాప్‌లో నిలవగా, తర్వాతి స్థానాల్లో రాజ్‌నాథ్ సింగ్, సురేశ్ ప్రభు, మనోహర్ పరీకర్, అరుణ్ జైట్లీ ఉన్నారు. అల్ప ర్యాంకింగ్‌ల్లో రామ్ విలాస్ పాశ్వాన్, బండారు దత్తాత్రేయ, రాధామోహన్ సింగ్, జేపీ నడ్డా, ప్రకాశ్ జవదేకర్ ఉన్నారు. వెంకయ్య(పట్టణాభివృద్ధి), స్మృతీ ఇరానీ (మానవ వనరులు)లకు సగటు ముద్రపడింది.