Ceramics Company
-
రీజెన్సీ సిరామిక్స్ పునరుద్ధరణ
సాక్షి ప్రతినిధి, కాకినాడ: కేంద్రపాలిత ప్రాంతమైన యానాంలోని రీజెన్సీ సిరామిక్స్ గురువారం పునఃప్రారంభమైంది. కార్మికుల వివాదాల నేపథ్యంలో దశాబ్దంన్నర క్రితం యానాం రీజెన్సీ లాకౌట్ ప్రకటించింది. అప్పటి నుంచి ఫ్యాక్టరీ పునరుద్ధరణకు చేస్తున్న ప్రయత్నాలు ఎట్టకేలకు కొలిక్కివచ్చాయి. ప్రయోగాత్మకంగా ఉత్పత్తి కూడా ప్రారంభమైంది. రీజెన్సీ సిరామిక్స్‌ను తిరిగి పూర్తిస్థాయిలో మార్కెట్లోకి తీసుకొచ్చేందుకు యాజమాన్యం ఏర్పాట్లు పూర్తిచేసింది. సంక్లిష్టమైన డిజైన్లకు మారుపేరుగా నిలిచిన రీజెన్సీ సిరామిక్స్ తొలిసారి రీజెన్సీ నేచురల్ టైల్స్‌ను చెన్నయ్‌లో విడుదల చేసింది. రూ.70 కోట్ల ప్రారంభ పెట్టుబడితో ఉత్పత్తిని ప్రారంభించింది. ఈ ఆర్థిక సంవత్సరం ముగిసేలోపు కంపెనీ నాలుగు టైల్స్ తయారీ లైన్లలో మొదటి దానిని ప్రారంభించేందుకు సిద్ధం చేసింది. కంపెనీ మొదటి లైన్ రోజుకు 7 వేల చదరపు మీటర్లను ఉత్పత్తి చేయనుంది. దీనిని రోజుకు 25 వేల చదరపు మీటర్ల సామర్థ్యానికి విస్తరించనున్నారు. అన్ని పరిమాణాలు, రకాలు, గ్లేజ్డ్ విట్రిఫైడ్ టైల్స్, ఫుల్ బాడీ విట్రిఫైడ్ టైల్స్, పాలి‹Ù్డ విట్రిఫైడ్ టైల్స్, డబుల్ చార్జ్డ్ టైల్స్, వాల్ టైల్స్, ఎక్స్టీరియర్ టైల్స్, స్టెప్స్, రైజర్లలో ఉత్పత్తి చేయడానికి నిర్ణయించారు. రీజెన్సీ ఉత్పత్తులను దేశంలోనే దక్షిణాది, తూర్పు ప్రాంతాలకు విస్తరించాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా రీజన్సీ డైరెక్టర్ నరాల సత్యేంద్రప్రసాద్ ‘సాక్షి’తో మాట్లాడుతూ.. ఉమ్మడి తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కేరళ, ఒడిశా రాష్ట్రాల్లో వ్యాపారాన్ని విస్తరించనున్నట్టు చెప్పారు. వచ్చే మూడేళ్లలో రూ.100 కోట్లు ఆదాయం లక్ష్యంగా ఉత్పత్తిపై దృష్టి పెట్టామన్నారు. రాజధాని నగరాలతోపాటు మిగిలిన నగరాల్లో షోరూంలు ఏర్పాటు చేయనున్నట్టు ఆయన పేర్కొన్నారు. యానాంతోపాటు ఆంధ్రప్రదేశ్‌లో ఆరి్థక వ్యవస్థ బలోపేతంలో రీజెన్సీ భాగస్వామ్యం వహిస్తుందని ఆయన చెప్పారు. -
యానాం రీజెన్సీకి పూర్వ వైభవం
సాక్షి ప్రతినిధి, కాకినాడ: కేంద్రపాలిత ప్రాంతమైన యానాంలోని రీజెన్సీ సిరామిక్స్ పరిశ్రమ 11 ఏళ్ల తరువాత పునఃప్రారంభానికి సిద్ధమవుతోంది. 1985లో ఏర్పాటైన యానాం రీజెన్సీ 2012లో వివాదాల నేపథ్యంలో యాజమాన్యం లాక్ అవుట్ ప్రకటించింది. ఈ పరిణామంతో ఫ్యాక్టరీపై ఆధారపడ్డ కుటుంబాలు రోడ్డునపడ్డాయి. అప్పటినుంచి ఫ్యాక్టరీని పునఃప్రారంభించేందుకు ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. 50 వేల జనాభా గల యానాం అభివృద్ధిలో రీజెన్సీ సిరామిక్స్ పాత్ర ఎంతో ఉంది. 1980వ దశకంలో సుమారు రూ.100 కోట్ల అంచనా వ్యయంతో జీఎన్ నాయుడు తదితరులు కలిసి ఈ పరిశ్రమ ఏర్పాటు చేశారు. అనతి కాలంలోనే దేశవ్యాప్తంగా మంచిపేరు సంపాదించి 1986–87 వరకు సిరామిక్స్ టైల్స్‌ను విదేశాలకు సైతం ఎగుమతి చేసే స్థాయికి చేరుకుంది. అప్పట్లో ఈ ఫ్యాక్టరీలో రోజుకు 26వేల చదరపు అడుగుల మేర టైల్స్ ఉత్పత్తి చేసేవారు. రీజెన్సీ సిరామిక్స్ పరిశ్రమతో యానాం, దాని సరిహద్దున మన రాష్ట్రంలోని ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో 6 వేల నుంచి 7 వేల కుటుంబాలకు ఉపాధి అవకాశాలు కల్పించింది. పరిశ్రమకు అనుబంధంగా సిరామిక్స్ టైల్స్ తయారీకి ఉపయోగపడే చిన్నతరహా పరిశ్రమలు, అట్టల తయారీ ఫ్యాక్టరీలను స్థాపించడంతో మహిళలకు ఉపాధి లభించింది. విధ్వంసం నేపథ్యంలో మూత వేతనాలు, పీఎఫ్ వంటి విషయాల్లో కార్మీక సంఘాలు, యాజమాన్యానికి మధ్య తలెత్తిన వివాదాల నేపథ్యంలో కార్మీకులు ఆందోళనకు దిగారు. కార్మీక సంఘ ప్రతినిధి మచ్చా మురళీమోహన్ యానాం పోలీస్ స్టేషన్లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం.. అనంతరం 2012 జనవరి 27న కొందరు దుండగులు సృష్టించిన విధ్వంసం దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనమైంది.ఫ్యాక్టరీని తగులబెట్టి ఫ్యాక్టరీ వైస్ చైర్మన్ కె.చంద్రశేఖర్‌ను హత్య చేశారు. నాటి విధ్వంసంతో ఫ్యాక్టరీకి రూ.300 కోట్ల మేర ఆస్తి నష్టం సంభవించింది. ఈ పరిణామాలతో యాజమాన్యం ఫ్యాక్టరీని లాక్అవుట్ చేసింది. వేలాది మంది కార్మీకులు ఉపాధి కోల్పోయి వీధినపడ్డారు. కాగా.. యానాం ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్, రీజెన్సీ సీఎండీ గూడూరు నారయ్య నాయుడు, సీఈఓ, ఈడీ సత్యేంద్రప్రసాద్ తదితరులు మధ్య పలు దఫాలుగా జరిగిన చర్చలు ఫలించి ఫ్యాక్టరీ పునఃప్రారంభానికి యాజమాన్యం ముందుకొచ్చింది. వివాదానికి ముందు కార్మీకులకు చెల్లించాల్సిన సెటిల్మెంట్స్పై ఒక అంగీకారానికి వచ్చారు. ఫ్యాక్టరీకి సంబంధించి దనియాలతిప్పలో ఉన్న భూముల్లో కార్మీకులకు ప్లాట్లు ఇచ్చేలా ఒప్పందం కుదిరింది. అక్టోబర్ నెలలో తొలివిడత రూ.70 కోట్ల పెట్టుబడితో ఉత్పత్తిని ప్రారంభించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇదే విషయాన్ని రీజెన్సీ సీఈవో సత్యేంద్రప్రసాద్ ‘సాక్షి’ ప్రతినిధి వద్ద ధ్రువీకరించారు. మలి విడతలో 2025 మార్చి నాటికి మూడింతల రెట్టింపు ఉత్పత్తిని తీసుకురావాలనే లక్ష్యంతో ఉన్నామన్నారు. రెండు నెలల్లో పునఃప్రారంభిస్తాం విజయ దశమి సందర్భంగా పరిశ్రమను పునఃప్రారంభించేలా కార్యాచరణ సిద్ధం చేస్తున్నాం. ఉత్పత్తికి అవసరమైన గ్యాస్ కోసం గెయిల్‌ను అభ్యర్థించాం. ఈ విషయాన్ని ప్రధాన మంత్రి నరేంద్రమోదీకి కూడా నివేదించాం. కార్మీకులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా క్రమశిక్షణతో పనులు అప్పగించడమే కాకుండా సర్వీస్ కూడా చేస్తున్నాం. – డాక్టర్ గుడారు నారయ్య నాయుడు, సీఎండీ, రీజెన్సీ సిరామిక్స్ 11 ఏళ్ల కల నెరవేరుతోంది యానాంలో పారిశ్రామిక రంగం పూర్వవైభవానికి రీజెన్సీ ఫ్యాక్టరీ మళ్లీ ప్రారంభించడం దోహదం చేస్తుంది. యాజమాన్యం ముందుకు రావడం శుభపరిణామం. వేలాది కుటుంబాలకు ఉపాధి అవకాశాలు లభిస్తాయి. ప్రభుత్వానికి జీఎస్టీ ద్వారా ఆదాయం సమకూరుతుంది. – గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్, ఎమ్మెల్యే, యానాం -
సిరామిక్స్ వ్యాపారి ఆత్మహత్య
మంచిర్యాలక్రైం : మంచిర్యాల పట్టణంలోని ఏసీసీ సమీపంలో ఉన్న పద్మనాయక ఇండ్రస్ట్రీస్ (సిరామిక్స్) యజమాని ఆత్మహత్య చేసుకున్న సంఘటనతో సిరామిక్స్ పరిశ్రమలో విషాదం అలుముకుంది. వివరాల్లోకి వెళితే.. పద్మనాయక సిరామిక్స్ యజమాని భూపేంద్రకుమర్ జైన్ (72) సోమవారం తన నివాసంలో ఒంటిపై కిరోసిన్ పోసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. సాయంత్రం ఇంట్లో నుంచి మార్కెట్‌కు వెల్లిన భూపేంద్రకుమార్ 6గంటలకు ఇంటికి వచ్చి బెడ్రూంలో పడుకున్నాడు. పడుకున్నాడనుకొని కుటుంబ సభ్యులంతా భయట కూర్చొని ఉన్నారు. ఒక్కసారిగా ఇంట్లో నుంచి మంటలు, ఆరుపులు, పొగ రావడం గమనించిన కుటుంబ సభ్యులు పరుగెత్తి చూడగా అప్పటికే ఆయన మంటల్లో ఆహుతయ్యాడు. పూర్తిగా కాలిపోయిన భూపేంద్రకుమార్‌పై నీటిని పోసి మంటలను ఆర్పివేశారు. భూపేంద్రకుమార్‌కు భార్య నిర్మల భూపేంద్రజైన్, కుమారుడు నితిన్‌కుమార్‌జైన్ ఉన్నాడు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. వ్యాపారంలో నష్టమా...! భూపేద్రకుమార్ మృతికిగల బలమైన కారణాలు తెలియరాలేదు. కుటుంబ సభ్యులను విచారించగా వివరాలు వెల్లడించేందుకు నిరాకరించారు. కొంత కాలంగా సిరమిక్స్ వ్యాపారం సరిగా నడవడం లేదని, నష్టాల్లో ఉన్నట్లు సమాచారం. భూపేంద్ర ఇప్పటికే చాలా వరకు అప్పుల పాలైనట్లు స్థానికులు చెబుతున్నారు. కుటుంబ సభ్యులు వివరాలు వెల్లడించడంలో నిరాకరించడంతో పలు ఆరోపణలకు తావిస్తుంది. ఇంట్లో భూపేంద్రతో పాటు ఆయన సతిమణి నిర్మల బిజైన్ ఉంటుంది. కుమారుడు నితిన్ జైన్ బెంగళూర్‌లో ఉంటున్నాడు. 20ఏళ్ల క్రితం ఇక్కడికి వలస... బెంగళూర్‌కు చెందిన భూపేంద్రకుమార్ జైన్ 1998లో మంచిర్యాలకు వలస వచ్చి ఏసీసీ ప్రాంతంలో పద్మనాయక సిరామిక్స్ కంపెనీని నెలకొల్పాడు. ఆయన వద్ద నాడు సుమారు రెండు వందల మంది కార్మికులు పని చేసేది. రానురానూ వ్యాపారం మార్కెట్లో దివాలా తీయడంతో ప్రస్తుతం కార్మికుల సంఖ్య 50కి చేరింది. భూపేంద్ర మృతి విషయం తెలుసుకున్న సిరామిక్స్ కార్మికులు ఆయన ఇంటికి తరలి వచ్చారు. -
మన సెరామిక్స్‌కు ఎగుమతుల కిక్కు!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: సెరామిక్స్ రంగంలో భారత్ కొత్త పుంతలు తొక్కుతోంది. వాల్, ఫ్లోర్, విట్రిఫైడ్ టైల్స్, సానిటరీ వేర్, బాత్రూమ్ ఫిటింగ్స్ వంటి సెరామిక్ ఉత్పత్తులు దాదాపు 100 దేశాలకు ఎగుమతి అవుతున్నాయి. నాణ్యతకు పేరెన్నిక గల ఇటలీ సైతం వీటిని దిగుమతి చేసుకుంటున్న దేశాల జాబితాలో ఉందంటే భారత ఉత్పత్తులకున్న డిమాండ్‌ను అర్థం చేసుకోవచ్చు. గల్ఫ్, యూఎస్, యూరప్‌లు ఇక్కడి తయారీ కంపెనీలకు పెద్ద మార్కెట్లుగా నిలుస్తున్నాయి. ఇటలీ, స్పెయిన్‌కు చెందిన ప్రపంచ అగ్రశ్రేణి సంస్థలు సైతం భారత కంపెనీలతో సంయుక్త భాగస్వామ్య కంపెనీలను ఏర్పాటు చేస్తుండడం విశేషం. ప్రపంచంలో రెండో అతిపెద్ద సెరామిక్స్ క్లస్టర్ అయిన గుజరాత్‌లోని మోర్బిలో ఉన్న కంపెనీలు... విస్తరణకుగాను 2016లో ఏకంగా రూ.10,000 కోట్లు ఖర్చు చేశాయి. భారత కంపెనీల దూకుడును అర్థం చేసుకోవటానికిది చాలు. టెక్నాలజీ, నిపుణులైన పనివారు, సామర్థ్యం దేశీయ కంపెనీలకు కలసి వస్తున్నట్లు పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. 3డీ డిజైన్లు వస్తున్నాయ్.. ప్రపంచవ్యాప్తంగా సెరామిక్ రంగంలో వస్తున్న కొత్త టెక్నాలజీని భారత కంపెనీలు అందిపుచ్చుకుంటున్నాయి. మోర్బి క్లస్టర్లో ఏకంగా 1,200 మందికిపైగా ఇండిపెండెంట్ డిజైనర్లు... విదేశీ దిగ్గజాలకు ఏమాత్రం తగ్గని రీతిలో డిజైన్లు చేస్తున్నారు. ప్రపంచ నంబర్ వన్ అయిన చైనాకూ సవాల్ విసురుతున్నారు. త్వరలో దేశీయంగా 3డీ డిజైన్లతో రూపొందించిన టైల్స్‌ను ప్రవేశపెట్టేందుకు కంపెనీలు సిద్ధమయ్యాయి. ఇవి మార్కెట్లోకి వస్తే సెరామిక్ రంగానికి కొత్త దశ ఆరంభం అవుతుందని మోర్బిలోని సెరామిక్ సంఘాల అధ్యక్షుడు నీలేష్ జట్‌పరియా ‘సాక్షి’ బిజినెస్ బ్యూరోకు తెలిపారు. పలుచని టైల్స్ తయారు చేయగలిగే స్లిమ్ టెక్నాలజీని సైతం అందిపుచ్చుకున్నాయని చెప్పారాయన. చైనా కంటే తక్కువ ధరలో, ఇటలీ కంపెనీల కంటే నాణ్యంగా తయారు చేస్తున్నట్టు చెప్పారు. 2022 కల్లా మరో రూ.10,000 కోట్ల పెట్టుబడులు రావచ్చని, కంపెనీల సంఖ్య 2,000కు చేరనుందని తెలియజేశారు. కొత్త బ్రాండ్లకు జీవం.. దేశవ్యాప్తంగా 750 తయారీ కంపెనీలున్నాయి. వీటిలో ఒక్క మోర్బి క్లస్టర్‌లోనే 700 వరకూ ఉన్నాయి. అన్ని కంపెనీలూ సొంత బ్రాండ్లలో విక్రయాలు సాగిస్తున్నాయి. మొత్తంగా 80 శాతం కంపెనీలు ఎగుమతుల్లో ఉన్నాయి. భారత మార్కెట్ విషయానికొస్తే కజారియా, హింద్‌వేర్, సొమానీ, నిట్కో, ఆసియన్ గ్రానిటో, సెరా, ఓరియంట్ వంటివి అగ్రశ్రేణి కంపెనీల జాబితాలో ఉన్నాయి. వీటితోపాటు 2020 నాటికి దేశంలో సాగెమ్, సోనెక్స్, వర్మోరా, సింపోలో వంటి మరో 40 కంపెనీలు సత్తా చూపించనున్నట్లు వైబ్రాంట్ సెరామిక్స్–2017 ఎక్స్పో సీఈవో సందీప్ పటేల్ ధీమా వ్యక్తంచేశారు. దేశంలో సెరామిక్ ఉత్పత్తులకు మంచి భవిష్యత్ ఉండడమే ఇందుకు కారణమన్నారు. సెరామిక్ టైల్స్ ధర చదరపు అడుగుకు రూ.30 నుంచి మొదలుకుని రూ.250 వరకు ఉంది. రూ.150–250 ధరల శ్రేణి ప్రీమియం విభాగం కిందకు వస్తోంది. ప్రీమియం శ్రేణి వాటా ప్రస్తుతం 5 శాతమే. ఇదీ సెరామిక్స్ మార్కెట్.. ప్రపంచ సెరామిక్స్ ఉత్పత్తిలో చైనా వాటా 40 శాతం. 12.9 శాతం వాటాతో భారత్ రెండో స్థానంలో ఉంది. భారత సెరామిక్స్ పరిశ్రమ 15–20 శాతం వృద్ధి నమోదు చేస్తూ గతేడాది రూ.28,000 కోట్ల వ్యాపారాన్ని నమోదు చేసింది. ఇందులో ఎగుమతుల వాటా రూ.7,000 కోట్లు. ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.12 వేల కోట్ల ఎగుమతులు అంచనా వేస్తున్నారు. ప్రత్యక్షంగా 5.5 లక్షలు, పరోక్షంగా 10 లక్షల మంది ఈ రంగంలో ఉన్నారు. 2020 నాటికి పరిశ్రమ రూ.50,000 కోట్లకు చేరుతుందనే అంచనాలున్నాయి. యాంటీ డంపింగ్ డ్యూటీతో చైనా నుంచి భారత్‌కు దిగుమతులు తగ్గుముఖం పట్టి ప్రస్తుతం 2 శాతానికి పరిమితమయ్యాయి. ఇక దేశీయంగా వినియోగంలో కేరళ, మహారాష్ట్ర, పంజాబ్, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, తమిళనాడు టాప్‌లో ఉన్నాయి. తెలంగాణ, ఏపీ రూ.1,000 కోట్ల అమ్మకాలతో మొదటి 10 స్థానాల్లో నిలుస్తున్నాయి. ఇది 2020 కల్లా రెట్టింపు అవుతుందని పరిశ్రమ అంచనా వేస్తోంది. -
మోసగించిన వ్యక్తి ఇంటి ఎదుట యువతి ఆందోళన
బాధితురాలిపై స్థానికుల దాడి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు తాండూర్ : మండల కేంద్రంలోని రాజీవ్‌నగర్‌కు చెందిన గోగర్ల సత్యనారాయణ ఇంటి ఎదుట ఖమ్మం జిల్లా రేగులతండాకు చెందిన బదావత్ శారద అనే యువతి న్యాయంపోరాటానికి దిగింది. బాధితురాలి కథనం ప్రకారం.. మూడేళ్ల క్రితం తన అక్క, బావలతో పాటు రెబ్బెన సమీపంలోని సిరామిక్స్ కంపెనీలో పనిచేస్తున్న సమయంలో అక్కడే పని చేస్తున్న గోగర్ల సత్యనారాయణతో శారదకు పరిచయం ఏర్పడింది. తనకు వివాహం జరగలేదని సత్యనారాయణ నమ్మబలికి శారదను ఇటీవల హైదరాబాద్‌లో పెళ్లి చేసుకున్నాడు. ఆపై కొద్ది రోజులు కలిసుండి తర్వాత సత్యనారాయణ కనిపించకుండాపోయాడు. దీంతో శారద సోమవారం తాండూర్‌కు వచ్చి సత్యనారాయణ ఇంటి ఎదుట ఆందోళన చేపట్టింది. యువతి ఆందోళన చేస్తుండగా సత్యనారాయణ భార్య, స్థానిక మహిళలు ఆమెపై దాడికి దిగారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో శారద తాండూర్ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోలీసులు వచ్చి సత్యనారాయణను విచారించారు. తనకు శారదతో ఎలాంటి సంబంధం లేదని, కావాలనే తనను అభాసుపాలు చేస్తోందని పేర్కొన్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.