ఇటీవల ఫ్యాక్టరీ సీఎండీ జీఎన్ నాయుడుతో చర్చిస్తున్న ఎమ్మెల్యే అశోక్
సాక్షి ప్రతినిధి, కాకినాడ: కేంద్రపాలిత ప్రాంతమైన యానాంలోని రీజెన్సీ సిరామిక్స్ పరిశ్రమ 11 ఏళ్ల తరువాత పునఃప్రారంభానికి సిద్ధమవుతోంది. 1985లో ఏర్పాటైన యానాం రీజెన్సీ 2012లో వివాదాల నేపథ్యంలో యాజమాన్యం లాక్ అవుట్ ప్రకటించింది. ఈ పరిణామంతో ఫ్యాక్టరీపై ఆధారపడ్డ కుటుంబాలు రోడ్డునపడ్డాయి. అప్పటినుంచి ఫ్యాక్టరీని పునఃప్రారంభించేందుకు ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి.
50 వేల జనాభా గల యానాం అభివృద్ధిలో రీజెన్సీ సిరామిక్స్ పాత్ర ఎంతో ఉంది. 1980వ దశకంలో సుమారు రూ.100 కోట్ల అంచనా వ్యయంతో జీఎన్ నాయుడు తదితరులు కలిసి ఈ పరిశ్రమ ఏర్పాటు చేశారు. అనతి కాలంలోనే దేశవ్యాప్తంగా మంచిపేరు సంపాదించి 1986–87 వరకు సిరామిక్స్ టైల్స్‌ను విదేశాలకు సైతం ఎగుమతి చేసే స్థాయికి చేరుకుంది. అప్పట్లో ఈ ఫ్యాక్టరీలో రోజుకు 26వేల చదరపు అడుగుల మేర టైల్స్ ఉత్పత్తి చేసేవారు.
రీజెన్సీ సిరామిక్స్ పరిశ్రమతో యానాం, దాని సరిహద్దున మన రాష్ట్రంలోని ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో 6 వేల నుంచి 7 వేల కుటుంబాలకు ఉపాధి అవకాశాలు కల్పించింది. పరిశ్రమకు అనుబంధంగా సిరామిక్స్ టైల్స్ తయారీకి ఉపయోగపడే చిన్నతరహా పరిశ్రమలు, అట్టల తయారీ ఫ్యాక్టరీలను స్థాపించడంతో మహిళలకు ఉపాధి లభించింది.
విధ్వంసం నేపథ్యంలో మూత
వేతనాలు, పీఎఫ్ వంటి విషయాల్లో కార్మీక సంఘాలు, యాజమాన్యానికి మధ్య తలెత్తిన వివాదాల నేపథ్యంలో కార్మీకులు ఆందోళనకు దిగారు. కార్మీక సంఘ ప్రతినిధి మచ్చా మురళీమోహన్ యానాం పోలీస్ స్టేషన్‌లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం.. అనంతరం 2012 జనవరి 27న కొందరు దుండగులు సృష్టించిన విధ్వంసం దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనమైంది.ఫ్యాక్టరీని తగులబెట్టి ఫ్యాక్టరీ వైస్ చైర్మన్ కె.చంద్రశేఖర్‌ను హత్య చేశారు.
నాటి విధ్వంసంతో ఫ్యాక్టరీకి రూ.300 కోట్ల మేర ఆస్తి నష్టం సంభవించింది. ఈ పరిణామాలతో యాజమాన్యం ఫ్యాక్టరీని లాక్‌అవుట్ చేసింది. వేలాది మంది కార్మీకులు ఉపాధి కోల్పోయి వీధినపడ్డారు. కాగా.. యానాం ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్, రీజెన్సీ సీఎండీ గూడూరు నారయ్య నాయుడు, సీఈఓ, ఈడీ సత్యేంద్రప్రసాద్ తదితరులు మధ్య పలు దఫాలుగా జరిగిన చర్చలు ఫలించి ఫ్యాక్టరీ పునఃప్రారంభానికి యాజమాన్యం ముందుకొచ్చింది.
వివాదానికి ముందు కార్మీకులకు చెల్లించాల్సిన సెటిల్‌మెంట్స్‌పై ఒక అంగీకారానికి వచ్చారు. ఫ్యాక్టరీకి సంబంధించి దనియాలతిప్పలో ఉన్న భూముల్లో కార్మీకులకు ప్లాట్‌లు ఇచ్చేలా ఒప్పందం కుదిరింది. అక్టోబర్ నెలలో తొలివిడత రూ.70 కోట్ల పెట్టుబడితో ఉత్పత్తిని ప్రారంభించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇదే విషయాన్ని రీజెన్సీ సీఈవో సత్యేంద్రప్రసాద్ ‘సాక్షి’ ప్రతినిధి వద్ద ధ్రువీకరించారు. మలి విడతలో 2025 మార్చి నాటికి మూడింతల రెట్టింపు ఉత్పత్తిని తీసుకురావాలనే లక్ష్యంతో ఉన్నామన్నారు.
రెండు నెలల్లో పునఃప్రారంభిస్తాం
విజయ దశమి సందర్భంగా పరిశ్రమను పునఃప్రారంభించేలా కార్యాచరణ సిద్ధం చేస్తున్నాం. ఉత్పత్తికి అవసరమైన గ్యాస్ కోసం గెయిల్‌ను అభ్యర్థించాం. ఈ విషయాన్ని ప్రధాన మంత్రి నరేంద్రమోదీకి కూడా నివేదించాం. కార్మీకులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా క్రమశిక్షణతో పనులు అప్పగించడమే కాకుండా సర్వీస్ కూడా చేస్తున్నాం.
– డాక్టర్ గుడారు నారయ్య నాయుడు, సీఎండీ, రీజెన్సీ సిరామిక్స్
11 ఏళ్ల కల నెరవేరుతోంది
యానాంలో పారిశ్రామిక రంగం పూర్వవైభవానికి రీజెన్సీ ఫ్యాక్టరీ మళ్లీ ప్రారంభించడం దోహదం చేస్తుంది. యాజమాన్యం ముందుకు రావడం శుభపరిణామం. వేలాది కుటుంబాలకు ఉపాధి అవకాశాలు లభిస్తాయి. ప్రభుత్వానికి జీఎస్టీ ద్వారా ఆదాయం సమకూరుతుంది.
– గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్, ఎమ్మెల్యే, యానాం
Comments
Please login to add a commentAdd a comment