హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: సెరామిక్స్ రంగంలో భారత్ కొత్త పుంతలు తొక్కుతోంది. వాల్, ఫ్లోర్, విట్రిఫైడ్ టైల్స్, సానిటరీ వేర్, బాత్రూమ్ ఫిటింగ్స్ వంటి సెరామిక్ ఉత్పత్తులు దాదాపు 100 దేశాలకు ఎగుమతి అవుతున్నాయి. నాణ్యతకు పేరెన్నిక గల ఇటలీ సైతం వీటిని దిగుమతి చేసుకుంటున్న దేశాల జాబితాలో ఉందంటే భారత ఉత్పత్తులకున్న డిమాండ్‌ను అర్థం చేసుకోవచ్చు. గల్ఫ్, యూఎస్, యూరప్‌లు ఇక్కడి తయారీ కంపెనీలకు పెద్ద మార్కెట్లుగా నిలుస్తున్నాయి.
ఇటలీ, స్పెయిన్‌కు చెందిన ప్రపంచ అగ్రశ్రేణి సంస్థలు సైతం భారత కంపెనీలతో సంయుక్త భాగస్వామ్య కంపెనీలను ఏర్పాటు చేస్తుండడం విశేషం. ప్రపంచంలో రెండో అతిపెద్ద సెరామిక్స్ క్లస్టర్ అయిన గుజరాత్‌లోని మోర్బిలో ఉన్న కంపెనీలు... విస్తరణకుగాను 2016లో ఏకంగా రూ.10,000 కోట్లు ఖర్చు చేశాయి. భారత కంపెనీల దూకుడును అర్థం చేసుకోవటానికిది చాలు. టెక్నాలజీ, నిపుణులైన పనివారు, సామర్థ్యం దేశీయ కంపెనీలకు కలసి వస్తున్నట్లు పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి.
3డీ డిజైన్లు వస్తున్నాయ్..
ప్రపంచవ్యాప్తంగా సెరామిక్ రంగంలో వస్తున్న కొత్త టెక్నాలజీని భారత కంపెనీలు అందిపుచ్చుకుంటున్నాయి. మోర్బి క్లస్టర్‌లో ఏకంగా 1,200 మందికిపైగా ఇండిపెండెంట్ డిజైనర్లు... విదేశీ దిగ్గజాలకు ఏమాత్రం తగ్గని రీతిలో డిజైన్లు చేస్తున్నారు. ప్రపంచ నంబర్ వన్ అయిన చైనాకూ సవాల్ విసురుతున్నారు. త్వరలో దేశీయంగా 3డీ డిజైన్లతో రూపొందించిన టైల్స్‌ను ప్రవేశపెట్టేందుకు కంపెనీలు సిద్ధమయ్యాయి.
ఇవి మార్కెట్లోకి వస్తే సెరామిక్ రంగానికి కొత్త దశ ఆరంభం అవుతుందని మోర్బిలోని సెరామిక్ సంఘాల అధ్యక్షుడు నీలేష్ జట్‌పరియా ‘సాక్షి’ బిజినెస్ బ్యూరోకు తెలిపారు. పలుచని టైల్స్ తయారు చేయగలిగే స్లిమ్ టెక్నాలజీని సైతం అందిపుచ్చుకున్నాయని చెప్పారాయన. చైనా కంటే తక్కువ ధరలో, ఇటలీ కంపెనీల కంటే నాణ్యంగా తయారు చేస్తున్నట్టు చెప్పారు. 2022 కల్లా మరో రూ.10,000 కోట్ల పెట్టుబడులు రావచ్చని, కంపెనీల సంఖ్య 2,000కు చేరనుందని తెలియజేశారు.
కొత్త బ్రాండ్లకు జీవం..
దేశవ్యాప్తంగా 750 తయారీ కంపెనీలున్నాయి. వీటిలో ఒక్క మోర్బి క్లస్టర్‌లోనే 700 వరకూ ఉన్నాయి. అన్ని కంపెనీలూ సొంత బ్రాండ్లలో విక్రయాలు సాగిస్తున్నాయి. మొత్తంగా 80 శాతం కంపెనీలు ఎగుమతుల్లో ఉన్నాయి. భారత మార్కెట్ విషయానికొస్తే కజారియా, హింద్‌వేర్, సొమానీ, నిట్కో, ఆసియన్ గ్రానిటో, సెరా, ఓరియంట్ వంటివి అగ్రశ్రేణి కంపెనీల జాబితాలో ఉన్నాయి.
వీటితోపాటు 2020 నాటికి దేశంలో సాగెమ్, సోనెక్స్, వర్మోరా, సింపోలో వంటి మరో 40 కంపెనీలు సత్తా చూపించనున్నట్లు వైబ్రాంట్ సెరామిక్స్–2017 ఎక్స్‌పో సీఈవో సందీప్ పటేల్ ధీమా వ్యక్తంచేశారు. దేశంలో సెరామిక్ ఉత్పత్తులకు మంచి భవిష్యత్ ఉండడమే ఇందుకు కారణమన్నారు. సెరామిక్ టైల్స్ ధర చదరపు అడుగుకు రూ.30 నుంచి మొదలుకుని రూ.250 వరకు ఉంది. రూ.150–250 ధరల శ్రేణి ప్రీమియం విభాగం కిందకు వస్తోంది. ప్రీమియం శ్రేణి వాటా ప్రస్తుతం 5 శాతమే.
ఇదీ సెరామిక్స్ మార్కెట్..
ప్రపంచ సెరామిక్స్ ఉత్పత్తిలో చైనా వాటా 40 శాతం. 12.9 శాతం వాటాతో భారత్ రెండో స్థానంలో ఉంది. భారత సెరామిక్స్ పరిశ్రమ 15–20 శాతం వృద్ధి నమోదు చేస్తూ గతేడాది రూ.28,000 కోట్ల వ్యాపారాన్ని నమోదు చేసింది. ఇందులో ఎగుమతుల వాటా రూ.7,000 కోట్లు. ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.12 వేల కోట్ల ఎగుమతులు అంచనా వేస్తున్నారు. ప్రత్యక్షంగా 5.5 లక్షలు, పరోక్షంగా 10 లక్షల మంది ఈ రంగంలో ఉన్నారు.
2020 నాటికి పరిశ్రమ రూ.50,000 కోట్లకు చేరుతుందనే అంచనాలున్నాయి. యాంటీ డంపింగ్ డ్యూటీతో చైనా నుంచి భారత్‌కు దిగుమతులు తగ్గుముఖం పట్టి ప్రస్తుతం 2 శాతానికి పరిమితమయ్యాయి. ఇక దేశీయంగా వినియోగంలో కేరళ, మహారాష్ట్ర, పంజాబ్, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, తమిళనాడు టాప్‌లో ఉన్నాయి. తెలంగాణ, ఏపీ రూ.1,000 కోట్ల అమ్మకాలతో మొదటి 10 స్థానాల్లో నిలుస్తున్నాయి. ఇది 2020 కల్లా రెట్టింపు అవుతుందని పరిశ్రమ అంచనా వేస్తోంది.