టీవీలు కంప్యూటర్లుగా మారిపోతే.. జియో కొత్త టెక్నాలజీ | Jio Cloud PC will turn home TVs into computers | Sakshi
Sakshi News home page

టీవీలు కంప్యూటర్లుగా మారిపోతే.. జియో కొత్త టెక్నాలజీ

Published Wed, Oct 16 2024 7:54 PM | Last Updated on Wed, Oct 16 2024 8:06 PM

Jio Cloud PC will turn home TVs into computers

రిలయన్స్ జియో మరో కొత్త టెక్నాలజీకి నాంది పలుకుతోంది. ఇంట్లోని స్మార్ట్ టీవీలను తక్కువ ఖర్చుతో సులభంగా కంప్యూటర్‌లుగా మార్చే సాంకేతికతను ఇండియా మొబైల్ కాంగ్రెస్ 2024లో ప్రదర్శించింది. జియో క్లౌడ్‌ పీసీ (Jio Cloud PC) అని పిలిచే ఈ టెక్నాలజీ కేవలం కొన్ని వందల రూపాయలకే టీవీని కంప్యూటర్‌గా మారుస్తుంది.

ఇందుకోసం ఇంటర్నెట్ కనెక్షన్, స్మార్ట్ టీవీ, టైపింగ్ కీబోర్డ్, మౌస్, జియో క్లౌడ్ పీసీ యాప్ మాత్రం ఉంటే చాలు. స్మార్ట్‌ టీవీలే కాకుండా సాధారణ టీవీలను సైతం జియోఫైబర్‌ లేదా జియోఎయిర్‌ఫైబర్‌తో వచ్చే సెట్-టాప్ బాక్స్ ద్వారా కంప్యూటర్‌లుగా మార్చుకోవచ్చు. జియో క్లౌడ్ పీసీ అనేది ఇంటర్నెట్ ద్వారా ఏదైనా టీవీని క్లౌడ్ కంప్యూటింగ్‌కు కనెక్ట్ చేసే సాంకేతికత.

జియో క్లౌడ్ పీసీ టెక్నాలజీని ఉపయోగించడం చాలా సులభం. యూజర్‌ యాప్‌లోకి లాగిన్ అయితే చాలు. క్లౌడ్‌లో స్టోర్‌ అయిన డేటా మొత్తం టీవీ స్క్రీన్‌పై కనిపిస్తుంది. సాధారణంగా కంప్యూటర్‌లో చేసే ఈమెయిల్, మెసేజింగ్, సోషల్ నెట్‌వర్కింగ్, ఇంటర్నెట్ సర్ఫింగ్, స్కూల్ ప్రాజెక్ట్‌లు, ఆఫీసు ప్రెజెంటేషన్‌ల వంటి పనులన్నింటినీ ఇప్పుడు టీవీలో చేయవచ్చు.

ఖరీదైన కంప్యూటర్లను కొనుక్కోలేని దేశంలోని మధ్యతరగతి కుటుంబాలకు ఈ సాంకేతికత ఒక వరం లాంటిది. క్లౌడ్ కంప్యూటింగ్ సామర్థ్యాన్ని అవసరానికి అనుగుణంగా సర్దుబాటు చేసుకోవచ్చు కాబట్టి, సాధారణ కంప్యూటర్‌తో పోలిస్తే ఇది సురక్షితంగా ఉండటమే కాకుండా డేటా రికవరీని చాలా సులభతరం చేస్తుంది. ఇది టీవీలతో పాటు మొబైల్ పరికరాలకు కూడా ఉపయోగపడుతుంది. ఈ యాప్‌కు సంబంధించిన లాంచ్ తేదీని కంపెనీ ఇంకా ప్రకటించనప్పటికీ, రాబోయే నెలల్లో దీనిని మార్కెట్‌లో విడుదల చేయవచ్చు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement