జనన, మరణ రిజిస్ట్రేషన్లు తప్పనిసరి
అనంతపురం మెడికల్ : జనన, మరణ రిజిస్ట్రేషన్లు తప్పనిసరిగా చేయాలని డీఎంహెచ్ఓ డాక్టర్ కె.వెంకటరమణ తెలిపారు. గురువారం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి మీటింగ్ హాల్లో జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని మున్సిపాలిటీల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ధ్రువీకరణ పత్రాల్లో తేడాలు లేకుండా చూడాలన్నారు. ఆధార్ నంబర్ తీసుకుని పేర్లు సరిచూసుకోవాలన్నారు.
ఇప్పటికే ప్రభుత్వ ఆస్పత్రుల్లో పుట్టిన వారందరికీ ఆధార్‌తో పాటు బర్త్ సర్టిఫికెట్లు జారీ చేస్తున్నట్లు చెప్పారు. ప్రైవేట్ ఆస్పత్రుల్లో జరిగే జనన, మరణాలు కూడా నమోదు చేయాలన్నారు. వాటిని ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి నివేదించాల్సి ఉందన్నారు. ఈ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో అడిషనల్ డీఎంహెచ్ఓ డాక్టర్ పద్మావతి, కుటుంబ సంక్షేమ శాఖ నుంచి వచ్చిన ఎస్ఓ శ్రీనివాసులు, డీఎంహెచ్ఓ కార్యాలయ ఎస్ఓ మారుతిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.