breaking news
Certified copies
-
ఫిర్యాదు, ఎఫ్ఐఆర్ల సర్టిఫైడ్ కాపీలను మాత్రమే తీసుకోండి
సాక్షి, అమరావతి: మద్యం కుంభకోణానికి సంబంధించి గత ప్రభుత్వ హయాంలో నాటి మాజీ సీఎం చంద్రబాబు, మాజీమంత్రి కొల్లు రవీంద్ర, అప్పటి ఐఏఎస్ అధికారి శ్రీనరేష్ లపై సీఐడీ నమోదుచేసిన కేసుకు సంబంధించిన అన్నీ డాక్యుమెంట్లను తమకు అందచేయాలని స్వర్ణాంధ్ర తెలుగు పత్రిక ఎడిటర్ కొట్టి బాలగంగాధర్ తిలక్ అభ్యర్థనను విజయవాడ ఏసీబీ కోర్టు తిరస్కరించింది. కేవలం ఫిర్యాదు, ఎఫ్ఐఆర్ తాలుకు సర్టిఫైడ్ కాపీలను మాత్రమే ఇచ్చేందుకు అనుమతినిచ్చింది. ఈ మేరకు ఏసీబీ కోర్టు న్యాయాధికారి పి. భాస్కరరావు శుక్రవారం ఉత్తర్వులు జారీచేశారు. హైకోర్టులో పిల్ వేశా, ఆ డాక్యుమెంట్లు ఇవ్వండి.. 2014–19 మధ్య కాలంలో చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగిన పలు కుంభకోణాల్లో దర్యాప్తును సీబీఐకి అప్పగించాలని కోరుతూ తిలక్ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేశారు. ఇందులో తదుపరి చర్యల నిమిత్తం మద్యం కుంభకోణానికి సంబంధించి చంద్రబాబు తదితరులపై సీఐడీ నమోదుచేసిన కేసులో తమకు ఫిర్యాదు, ఎఫ్ఐఆర్, సాక్షుల వాంగ్మూలాలు, చార్జిషీట్లతో పాటు ఇతర డాక్యుమెంట్లన్నీ ఇవ్వాలని కోరుతూ తిలక్ ఇటీవల ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. వీటిని పొందేందుకు హైకోర్టులో పిల్ దాఖలు చేసిన వ్యక్తిగా తిలక్ అర్హుడని ఆయన తరఫు న్యాయవాది శెట్టిపల్లి దుష్యంత్‌రెడ్డి ఏసీబీ కోర్టుకు నివేదించారు. వాదనలు విన్న ఏసీబీ కోర్టు న్యాయాధికారి పి. భాస్కరరావు ఈనెల 19న నిర్ణయం వెలువరిస్తానన్న విషయం తెలిసిందే. తాజాగా.. శుక్రవారం తిలక్ పిటిషన్‌ను పాక్షికంగా అనుమతించారు. కేవలం ఫిర్యాదు కాపీ, దాని ఆధారంగా సీఐడీ నమోదుచేసిన ఎఫ్ఐఆర్ కాపీని మాత్రమే అందించేందుకు అనుమతినిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. మిగిలిన కుంభకోణాల్లో డాక్యుమెంట్లు ఇచ్చేందుకూ ‘నో’.. అయితే, చంద్రబాబునాయుడు, అప్పటి ఆయన మంత్రివర్గ సహచరులు లోకేశ్, నారాయణ, కొల్లు రవీంద్ర, అచ్చెన్నాయుడు తదితరులపై గతంలో నమోదైన పలు కుంభకోణాల కేసులను మూసివేస్తూ ఏసీబీ కోర్టు ఇప్పటికే ఉత్తర్వులిచ్చింది. దీంతో.. చంద్రబాబుపై నమోదైన కుంభకోణాల తాలుకు కేసుల్లో అన్ని డాక్యుమెంట్లు ఇవ్వాలని, అలాగే కేసుల మూసివేత ఉత్తర్వులను కూడా ఇవ్వాలని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు సువర్ణరాజు కూడా ఏసీబీ కోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఇందులో కూడా సీఐడీ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ల తాలుకు సర్టిఫైడ్ కాపీలను మాత్రమే ఇచ్చేందుకు ఏసీబీ కోర్టు అనుమతించింది. -
చంద్రబాబు కేసుల కొట్టివేతపై కోర్టులో వాగ్వాదం
గాంధీనగర్ (విజయవాడ సెంట్రల్): సీఎం చంద్రబాబుపై గతంలో నమోదైన కేసుల కొట్టివేతపై పబ్లిక్ ప్రాసిక్యూటర్, న్యాయవాది పొన్నవోలు సుధాకర్‌రెడ్డి మధ్య కోర్టులో వాగ్వాదం జరిగింది. చంద్రబాబు కేసులో సాక్షులు ప్రభుత్వోద్యోగులు కావడంతో వారిని భయపెట్టి కేసులు కొట్టివేయించుకుంటున్నారని, అలా కొట్టేస్తూ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులకు సంబంధించి సర్టిఫైడ్ కాపీలు ఇవ్వాలని పొన్నవోలు కోర్టును కోరారు. దీంతో.. ఈ కేసులతో సంబంధంలేని వ్యక్తులు సర్టిఫైడ్ కాపీలు ఎలా అడుగుతారని పీపీ అభ్యంతరం తెలిపారు. ఇది ప్రజా ప్రయోజనాలకు సంబంధించిన కేసు అని, సర్టిఫైడ్ కాపీలు థర్డ్ పార్టీ ఎవరైనా కోరవచ్చని పొన్నవోలు చెప్పారు. ఇందుకు సంబం«ధించి గతంలో కోర్టు ఇచ్చిన తీర్పులను ప్రస్తావించారు. సాక్షులను ప్రభావితం చేసి, వారిని భయపెట్టి చంద్రబాబు కేసులు కొట్టివేయించుకుంటున్నారంటూ కోర్టులో ఆయన బలంగా వాదనలు వినిపించారు. ముఖ్యంగా అసైన్డ్ భూముల వ్యవహారంలో చంద్రబాబుపై నమోదైన కేసుకు సంబంధించి గురువారం పీపీకి, పొన్నవోలుకు మధ్య తీవ్రస్థాయిలో వాదోపవాదాలు జరిగాయి. అసైన్డ్ భూముల కేసు కొట్టేస్తూ ఇచ్చిన ఉత్తర్వుల సర్టిఫైడ్ కాపీ ఇవ్వాలని కోరారు. లేనిపక్షంలో తాము థర్డ్ పార్టీకి ఇచ్చేదిలేదని లిఖితపూర్వకంగా చెప్పాలని పొన్నవోలు కోరారు. -
ఈ–సేవ కేంద్రాన్ని ప్రజలు, న్యాయవాదులు వినియోగించుకోవాలి
సాక్షి, హైదరాబాద్: కోర్టుకు వచ్చే ప్రజలు, న్యాయవాదులు ఈ–సేవ కేంద్రం సేవలను వినియోగించుకోవాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే సూచించారు. అందరికీ న్యాయాన్ని చేరువ చేయడం, న్యాయ సేవలను విస్తరించాలన్న దృఢ సంకల్పంతో కేంద్రం ఈ కేంద్రాలను ఏర్పాటు చేస్తోందని తెలిపారు. కక్షిదారులు ఇక్కడ కేసు స్థితిని కూడా తెలుసుకోవచ్చని చెప్పారు. రాష్ట్ర హైకోర్టు ఆవరణలో ఈ–సేవ కేంద్రాన్ని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే శనివారం ప్రారంభించారు. సుప్రీంకోర్టు ఈ–కమిటీ ఆధ్వర్యంలో ఈ కేంద్రం పనిచేస్తుంది. ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడారు. కోర్టు నుంచి ఏదైనా సాఫ్ట్‌కాపీ కావాలన్నా ఈ కేంద్రం నుంచి పొందవచ్చన్నారు. కార్యక్రమంలో న్యాయమూర్తులు, అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్, రాష్ట్ర బార్ కౌన్సిల్ చైర్మన్ ఎ.నరసింహారెడ్డి, హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు నాగేశ్వర్రావు, న్యాయవాదులు పాల్గొన్నారు. కాగా, కేసు స్థితి (ప్రస్తుత స్థితి, తదుపరి విచారణ తేదీ), ఈ–కోర్టు యాప్ డౌన్లోడ్ చేసుకోవడానికి జడ్జీల సెలవుల సమాచారం తెలుసుకోవడానికి, సర్టీఫైడ్ కాపీల కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునేందుకు, ఉచిత లీగల్ సర్విస్లు పొందడం వంటి వివరాలు, జైలులో ఉన్న వారిని కలిసేందుకు ఈ–ములాఖత్ అపాయింట్మెంట్ కోసం, కోర్టుకు సంబంధించిన అంశాల్లో ఈ–పేమెంట్స్ కోసం, ట్రాఫిక్ చలాన్లు, ఇతర నేరాల్లో చెల్లించాల్సిన నగదు చెల్లించడానికి.. ఇలా పలు రకాల సేవలను ఈ–సేవ కేంద్రం అందించనుంది. సిబ్బందితో మాట్లాడుతున్న సీజే జస్టిస్ అలోక్ అరాధే. చిత్రంలో న్యాయమూర్తులు జస్టిస్ శ్యామ్ కోషి, జస్టిస్ వినోద్‌కుమార్, జస్టిస్ సుధీర్‌కుమార్, జస్టిస్ సాంబశివరావు నాయుడు, జస్టిస్ పుల్ల కార్తీక్, జస్టిస్ శరత్, జస్టిస్ రాజేశ్వర్‌రావు, జస్టిస్ శ్రీనివాస్‌రావు, జస్టిస్ లక్ష్మీనారాయణ తదితరులు -
మే 31, జూన్ 1నరిజిస్ట్రేషన్లు బంద్
మీసేవలో ఈసీ, సీసీల జారీ కూడా ఉండదు సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన నేపథ్యంలో ఈ నెల 30వ తేదీ సాయంత్రం 6 గంటల నుంచి జూన్ 2వ తేదీ ఉదయం 10 గంటల వరకు స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖకు సంబంధించిన అన్ని రకాల సేవలూ నిలిచిపోనున్నాయి. ఇప్పటి వరకు ఉమ్మడిగా ఉన్న సెంట్రల్ సర్వర్‌ను ఇరు రాష్ట్రాలకూ వేర్వేరుగా ఏర్పాటు చేయాల్సి ఉన్నందున 30వ తేదీ సాయంత్రం 6 నుంచి సర్వర్‌ను నిలిపివేస్తున్నారు. ఫలితంగా ఈ నెల 31, జూన్ 1 తేదీల్లో మీసేవ కేంద్రాల్లో ఎన్కంబరెన్స్ సర్టిఫికెట్లు(ఈసీలు), సర్టిఫైడ్ కాపీల(దస్తావేజు నకళ్లు) జారీ ప్రక్రియ ఆగిపోనుంది. అలాగే సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఆస్తుల క్రయ విక్రయ దస్తావేజుల రిజిస్ట్రేషన్ కార్యక్రమాలు కూడా నిలిచిపోతాయని సంబంధిత అధికారులు తెలిపారు.


