అనుమతుల్లేని స్కూల్ బస్సులను సీజ్ చేస్తాం
ఉప రవాణా కమిషనర్ సీహెచ్ శ్రీదేవి
ఏలూరు సిటీ : జిల్లాలో నిబంధనలు పాటించకుండా 842 స్కూల్ బస్సులు రోడ్లపై తిరుగుతున్నాయని, ఈ నెలాఖరులోగా వాటి యాజమాన్యాలు అనుమతులు పొందకపోతే వాటిని సీజ్ చేస్తామని ఉపరవాణా కమిషనర్ సీహెచ్ శ్రీదేవి హెచ్చరించారు. గురువారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థల యాజ మాన్యాలు కండిషన్లో లేని బస్సులను నడుపుతూ విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని, ఈ విద్యాసంస్థలకు చెందిన బస్సులను ఉపేక్షించేదిలేదన్నారు. జిల్లాలో సగానికిపైగా స్కూల్ బస్సులు ఫిట్నెస్, రవాణాశాఖ అనుమతులు లేకుండా నడుపుతున్నారని తెలిపారు.
జిల్లాలో 1,665 ప్రైవేట్ స్కూల్ బస్సులు ఉండగా వాటిలో 823 బస్సులకు మాత్రమే అనుమతి ఉందన్నారు. మిగిలిన 842 స్కూల్, కళాశాల బస్సులకు అనుమతులు లేవని స్పష్టం చేశారు. జిల్లాలో పలు ప్రాంతాల్లో ఇటీవల ఆకస్మిక తనిఖీలు నిర్వహించి నిబంధనలకు వ్యతిరేకంగా తిరుగుతున్న ఏడు బస్సులను సీజ్ చేశామని, వాటిలో కొవ్వూరులో 3, తణుకులో 2, పాలకొల్లులో 1, ఏలూరులో 1 ఉన్నాయన్నారు. నిబంధనలు పాటించని స్కూల్ బస్సులను ఆకస్మిక తనిఖీ చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశామన్నారు.
ప్రతి పాఠశాల, కళాశాల బస్సుల్లో డ్రైవర్‌కు దృష్టి లోపం, బీపీ, చక్కెర వ్యాధి వంటివి ఉండకూడదని, డ్రైవర్ చిరునామా, మొబైల్ నెంబర్ విధిగా ఉండాలని, స్కూల్ చిరునామా, ఫోన్ నెంబర్ డిస్ప్లే చేయాల్సి ఉందన్నారు. ప్రథమ చికిత్స చేసేందుకు కిట్, బస్సు రూట్‌మ్యాప్ ఉంచాలని, వారంలో ఒకరోజు ఖచ్చితంగా విద్యార్థుల తల్లిదండ్రులు బస్సు ఫిట్నెస్ పరిశీలించేలా ఏర్పాటు చేయాలన్నారు. బస్సుల్లో ప్రయాణించే విద్యార్థుల వివరాలతో కూడిన జాబితా ను ఉండాలని డీటీసీ సూచించారు.