ప్రజాభీష్టానికి తలొంచాల్సిందే
ఎమ్మిగనూరు టౌన్, న్యూస్‌లైన్: నాయకులెవరైనా ఓట్లేసి గెలిపించుకున్న ప్రజల మనోభీష్టానికి తలొంచాల్సిందేనని జేఏసీ జిల్లా అధ్యక్షుడు సి.హెచ్.వెంగళ్‌రెడ్డి అన్నారు. శనివారం ఆయన స్థానిక సోమప్ప సర్కిల్లో నిర్వహించిన సకల జనుల గళ ఘోషకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కాంగ్రెస్ అధినేత్రికి అమ్మ లక్షణాలు లేవని.. ఉంటే అన్నదమ్ముల్లా కలసిమెలసి జీవిస్తున్న ప్రజలను విభజించే ఆలోచన వచ్చేది కాదన్నారు. ప్రజల చేత ఎన్నుకోబడని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ(సీడబ్ల్యూసీ)కి విభజించే హక్కు ఎక్కడిదని ప్రశ్నించారు.
కేంద్ర మంత్రులు తమ పదవులను కాపాడుకోవడానికే అధిష్టానం చుట్టూ చక్కర్లు కొడుతున్నారని.. ప్రజల మనోభావాలను వారు ఏమాత్రం పట్టించుకోవడం లేదన్నారు. సీమాంధ్రలో ప్రజల న్యాయకత్వంలోనే ఉద్యమం కొనసాగుతుందన్నారు. దీన్ని అపహాస్యం చేసే ప్రజాప్రతినిధులను అదే ప్రజలు గుడ్డలు ఊడదీసి కొడతారన్నారు. పట్టం కట్టే ప్రజలకు పడతోయడం కూడా తెలుసనే విషయం నేతలంతా గ్రహించాలన్నారు. చిన్న రాష్ట్రాల ఏర్పాటుతో అభివృద్ధి అసాధ్యమనే విషయం ఇదివరలో జరిగిన పలు రాష్ట్రాల విభజనతో నిరూపితమైందన్నారు. పెట్టుబడుదారులు, వ్యాపారవేత్తలు రాయల తెలంగాణ, ప్రత్యేక రాయలసీమ కావాలని డిమాండ్ చేయడంలో అర్థం లేదన్నారు.
తెలంగాణ నాయకులు తమ యాస వేరు కాబట్టి ప్రత్యేక రాష్ట్రం కావాలని కోరుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. భాష, యాసకో రాష్ట్రాన్ని విభజిస్తూ పోతే నాలుగు యాసలు మాట్లాడే కర్నూలును ఎన్ని ముక్కలు చేస్తారని ప్రశ్నించారు. సమైక్యాంధ్ర కోసం ఉద్యోగ, ఉపాధ్యాయలు సమ్మె చేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం ఎస్మా, బస్మా అంటూ బెదిరిస్తోందని, ఇలాంటి వాటికి వెనకడుగు వేస్తే ప్రకస్తే లేదన్నారు. ఉద్యోగులు జీతాలు పెంచాలని, హెల్త్ కార్డులు కావాలని, పీఆర్సీ అమలు చేయాలని డిమాండ్లపై పోరాడటం లేదని.. సమైక్యాంధ్ర ప్రకటన వెలువడే వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామన్నారు. ఉద్యమాలకు పుట్టినిల్లయిన రాయలసీమ చరిత్ర ప్రపంచానికి తెలియనిది కాదన్నారు. జిల్లాలోని ప్రజాప్రతినిధులకు సిగ్గుంటే స్పీకర్ ఫార్మెట్లో రాజీనామాలు చేసి ఎన్జీవోస్, ఉద్యోగ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో జరిగే ఉద్యమాల్లో పాల్గొనాలన్నారు. సమైక్యాంధ్ర సాధనలో భాగంగా సెప్టెంబర్ 7న హైదరాబాద్‌లో చేపట్టనున్న సమైక్యపోరుకు ఉద్యోగులు, ప్రజలు, రైతులు పెద్ద ఎత్తున తరలిరావాలని ఆయన పిలుపునిచ్చారు.
కార్యక్రమంలో స్థానిక ఏపీ ఎన్జీవోస్, ఉద్యోగ సంఘాల జేఏసీ నాయకులు ఈశ్వరయ్య, మద్దిలేటి, కరీంసాహెబ్, కృష్ణ, రామచంద్ర, దుర్బాక లక్ష్మీనారాయణ, సూరిబాబు, ఎం.డి.శ్రీనివాసులు, నీలకంఠ, ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ అధ్యక్షులు యు.యు.ఉరుకుందు, నారాయణ పాఠశాల, కళాశాల ప్రిన్సిపాళ్లు ప్రమీలాకుమార్, రమణారెడ్డి, రిటైర్డ్ ఎస్ఐ సోమన్న, శ్రీచైతన్య స్కూల్ నిర్వాహకులు కాశీం తదితరులు పాల్గొన్నారు.