Chain snatchers gang
-
డేంజరస్ భవేరియా గ్యాంగ్.. చైన్ స్నాచింగ్‌లపై పోలీసులు అలర్ట్
సాక్షి, హైదరాబాద్: నగరంలో ఇటీవల చోటుచేసుకున్న వరుస చైన్ స్నాచింగ్‌లపై విచారణ ముమ్మరంగా సాగుతోంది. కాగా, ఉత్తరప్రదేశ్‌కు చెందిన భవేరియా గ్యాంగ్ ఈ దొంగతనాలకు పాల్పడినట్టు పోలీసులు గుర్తించారు. మరోవైపు, భవేరియా గ్యాంగ్ బెంగళూరులో చోరి చేసి వారు హైదరాబాద్‌కు వచ్చి దొంగతనాలకు చేసినట్టు పోలీసులు నిర్ధారించారు. ఇక, వీరిని పట్టుకునేందుకు 30 టీమ్‌లను ఏర్పాటు చేసినట్టు రాచకొండ, హైదరాబాద్ పోలీసులు తెలిపారు. కాగా, భవేరియా గ్యాంగ్ సభ్యులు బృందాలుగా ఏర్పడి చోరీలు చేస్తున్నట్టు పోలీసులు వెల్లడించారు. అయితే, హైదరాబాద్‌లో చోరిల అనంతరం.. భవేరియా గ్యాంగ్ రైలు మార్గంలో ఇతర రాష్ట్రాలకు పారిపోయినట్టు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. -
చైన్స్నాచర్లపై తిరగబడ్డ మహిళలు
సాక్షి, జోగిపేట(మెదక్) : ఇంటి మెట్లపై కూర్చున్న మహిళ మెడలో నుంచి పుస్తెల తాడు తెంపుకెళ్లడానికి ప్రయత్నించిన గుర్తుతెలియని దొంగలపై మహిళలు మూకమ్మడిగా తిరగబడిన సంఘటన బుధవారం జోగిపేట పట్టణంలో జరిగింది. పట్టణంలోని ఆర్యసమాజ్ కాలనీలో నివాసం ఉంటున్న భారతమ్మ తమ ఇంటి మెట్లపై కూర్చొని ఉంది. అటువైపుగా బైక్‌పై ఇద్దరు వ్యక్తులు వచ్చి ఇళ్ల సమాచారం అడిగారు. మహిళ వంగి చూపిస్తుండగా మెడలోని పుస్తెలతాడు తెంపుకెళ్లేందుకు ప్రయత్నించారు. వెంటనే తేరుకున్న మహిళ పుస్తెలతాడు పట్టుకున్న దొంగను గట్టిగాపట్టుకుంది. సంఘటన చూసిన ఇతర మహిళలు వారిపై తిరగబడ్డారు. మహిళల ప్రతిఘటించడంతో వారి నుంచి తప్పించుకొన్న దొంగలు వట్పల్లివైపు పారిపోయారు. బైకు నడుపుతున్న వ్యక్తి నల్లరంగు షర్టు ధరించి హెల్మెట్ «పెట్టుకోగా, వెనుక కూర్చున్న వ్యక్తి గులాబి రంగు షర్టు ధరించి ముఖానికి మాస్క్ వేసుకున్నట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. వెంటనే కాలనీవాసులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. సీఐ, ఎస్ఐలు తిరుపతిరాజు, వెంకటరాజాగౌడ్ సంఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. బైకుపై వచ్చిన యువకుల ఆనవాలు చెప్పడంతో ఎస్ఐ బైకుపై జేఎన్టీయూ వైపు వెళ్లి అనుమానితులను ఆపి వివరాలు తెలుసుకున్నారు. బాధితులు చెప్పిన పోలికలు లేకపోవడంతో వారిని వదిలిపెట్టారు. వెంటనే వట్పల్లి, అల్లాదుర్గం, పుల్కల్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. పట్టణంలో ఏర్పాటు చేసిన సీసీ కెమేరాలను ఎస్ఐ వెంకటరాజాగౌడ్ పరిశీలించగా. అయితే దొంగలు డాకూరు రోడ్డు మీదుగా వెళ్లినట్లు గుర్తించారు. దొంగలు కర్నాటక రాష్ట్రానికి చెందిన వారుగా అనుమానిస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. ఇటీవల వాసవీనగర్‌లో జరిగిన సంఘటనతోనూ వీరికి సంబంధం ఉండి ఉంటుందని అనుమానం వ్యక్తంచేశారు. విచారణ జరిపి తగిన చర్యలు తీసుకుంటామని ఎస్ఐ తెలిపారు. -
మళ్లీ చైన్‌స్నాచర్ల హల్చల్!
నల్లగొండ ఎస్పీ సమాచారంతో మూడు జిల్లాల పోలీసుల అలర్ట్ సాక్షి ప్రతినిధి, నల్లగొండ: చైన్‌స్నాచర్ల ముఠా మరోసారి పోలీసులను ఉరుకులు పరుగులు పెట్టించింది. శనివారం ఉదయం నిజామాబాద్ జిల్లా కామారెడ్డిలో చైన్‌స్నాచింగ్‌కు పాల్పడ్డ ఇద్దరు సభ్యుల ముఠా మెదక్ జిల్లా మీదుగా నల్లగొండ సరిహద్దుల్లోకి వస్తోందన్న సమాచారం మేరకు నల్లగొండ, మెదక్, నిజామాబాద్ జిల్లాల్లో పోలీసులు అప్రమత్తమై తనిఖీలు చేపట్టారు. గతంలో ఈ ముఠా జిల్లాలో కూడా దొంగతనాలకు పాల్పడడంతో జిల్లా ఎస్పీ విక్రమ్‌జిత్ దుగ్గల్ ఇచ్చిన సమాచారం మేరకు నిజామాబాద్, మెదక్ పోలీసులు కూడా అప్రమత్తమై వాహనాల తనిఖీలు చేపట్టారు. విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. ఈ సమాచారం విషయంలో కొన్ని వదంతులూ ప్రచారంలోనికి వచ్చాయి. కొందరు దొంగలు తుపాకులతో కాల్పులు జరుపుతూ నల్లగొండ, మెదక్ సరిహద్దుల్లో సంచరిస్తుండడంతో పోలీసులు వారి కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారన్న సమాచారం అటు మెదక్, ఇటు నల్లగొండ ప్రజానీకాన్ని ఉక్కిరి బిక్కిరి చేసింది. ఈ విషయమై నల్లగొండ ఎస్పీ వీ.కే.దుగ్గల్ ‘సాక్షి’తో మాట్లాడుతూ చైన్‌స్నాచర్లు సంచరిస్తున్నారన్న సమాచారంతోనే తనిఖీలు చేపట్టామని, దీన్ని భూతద్దంలో చూసి ప్రజలు భయాందోళనలకు గురికావాల్సిన అవసరమేమీ లేదని చెప్పడం గమనార్హం.