సాక్షి, జోగిపేట(మెదక్) : ఇంటి మెట్లపై కూర్చున్న మహిళ మెడలో నుంచి పుస్తెల తాడు తెంపుకెళ్లడానికి ప్రయత్నించిన గుర్తుతెలియని దొంగలపై మహిళలు మూకమ్మడిగా తిరగబడిన సంఘటన బుధవారం జోగిపేట పట్టణంలో జరిగింది. పట్టణంలోని ఆర్యసమాజ్ కాలనీలో నివాసం ఉంటున్న భారతమ్మ తమ ఇంటి మెట్లపై కూర్చొని ఉంది. అటువైపుగా బైక్‌పై ఇద్దరు వ్యక్తులు వచ్చి ఇళ్ల సమాచారం అడిగారు. మహిళ వంగి చూపిస్తుండగా మెడలోని పుస్తెలతాడు తెంపుకెళ్లేందుకు ప్రయత్నించారు.
వెంటనే తేరుకున్న మహిళ పుస్తెలతాడు పట్టుకున్న దొంగను గట్టిగాపట్టుకుంది. సంఘటన చూసిన ఇతర మహిళలు వారిపై తిరగబడ్డారు. మహిళల ప్రతిఘటించడంతో వారి నుంచి తప్పించుకొన్న దొంగలు వట్‌పల్లివైపు పారిపోయారు. బైకు నడుపుతున్న వ్యక్తి నల్లరంగు షర్టు ధరించి హెల్మెట్ «పెట్టుకోగా, వెనుక కూర్చున్న వ్యక్తి గులాబి రంగు షర్టు ధరించి ముఖానికి మాస్క్ వేసుకున్నట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. వెంటనే కాలనీవాసులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.
సీఐ, ఎస్‌ఐలు తిరుపతిరాజు, వెంకటరాజాగౌడ్ సంఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. బైకుపై వచ్చిన యువకుల ఆనవాలు చెప్పడంతో ఎస్‌ఐ బైకుపై జేఎన్‌టీయూ వైపు వెళ్లి అనుమానితులను ఆపి వివరాలు తెలుసుకున్నారు. బాధితులు చెప్పిన పోలికలు లేకపోవడంతో వారిని వదిలిపెట్టారు. వెంటనే వట్‌పల్లి, అల్లాదుర్గం, పుల్కల్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. పట్టణంలో ఏర్పాటు చేసిన సీసీ కెమేరాలను ఎస్‌ఐ వెంకటరాజాగౌడ్ పరిశీలించగా. అయితే దొంగలు డాకూరు రోడ్డు మీదుగా వెళ్లినట్లు గుర్తించారు. దొంగలు కర్నాటక రాష్ట్రానికి చెందిన వారుగా అనుమానిస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. ఇటీవల వాసవీనగర్‌లో జరిగిన సంఘటనతోనూ వీరికి సంబంధం ఉండి ఉంటుందని అనుమానం వ్యక్తంచేశారు. విచారణ జరిపి తగిన చర్యలు తీసుకుంటామని ఎస్‌ఐ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment