ఆంధ్ర మహాసభ నిర్వహణ బాధ్యత: ధర్మకర్తల మండలి స్వాధీనం
సాక్షి, ముంబై: ఆంధ్ర మహాసభ నిర్వహణ బాధ్యతలను ధర్మకర్తల మండలి స్వాధీనం చేసుకుంది. సభ కార్యకలాపాల నిర్వహణ బాధ్యతలను ధర్మకర్తల మండలికి అప్పగించాలని బుధవారం రాత్రి జరిగిన సమావేశంలో తీర్మానించారు. ఈ విషయాన్ని ధర్మకర్తల మండలి ైచె ర్మన్ ఎల్వీ రావ్ కూడా ధ్రువీకరించారు. మిగతా సమస్యల పరిష్కారానికి త్వరలోనే ఈజీఎంను ఏర్పాటు చేయనున్నట్లు ఆయన చెప్పారు. ఈ సమావేశంలో ధర్మకర్తల మండలి చైర్మన్ ఎల్వీ రావ్, కార్యదర్శి చంద్రశేఖర్, సభ్యులు సిద్ధారెడ్డి, భూమేశ్లతోపాటు మేనేజింగ్ కమిటీ అధ్యక్షుడు పోతు రాజారాం, ప్రధాన కార్యదర్శి బాబురావులు పాల్గొన్నారు.
ఈ విషయమై పోతు రాజారాంను సంప్రదించగా సమావేశంలో నిర్ణయం తీసుకున్నామని, అయితే అధికారిక పత్రాలను ధర్మకర్తల మండలికి అప్పగించాల్సి ఉందని, 12వ తేదీన వాటిని అప్పగిస్తామన్నారు. కార్యదర్శి బాబురావు కూడా తాజా నిర్ణయంపై స్పందించారు. మహాసభ నిర్వహణ బాధ్యతలను ధర్మకర్తల మండలి స్వాధీనం చేసుకున్న విషయం వాస్తవమేనని, ఈ నెల 12వ తేదీన బాధ్యతలను అప్పగించనున్నట్లు తెలిపారు. 2011 అక్టోబరులో ఎన్నికైన మేనేజింగ్ కమిటీ గడువు 2012 అక్టోబరుతో గడువు ముగిసింది. అయినప్పటికీ కొన్ని సమస్యల కారణంగా కొత్త కమిటీని ఎన్నుకోలేదు. గడువు ముగిసి సంవత్సరం కావస్తున్నా 2010-11కు సంబంధించిన సమస్యలు పరిష్కారం కాకపోవడంతో సభ నిర్వహణ బాధ్యతలను ధర్మకర్తల మండలి స్వాధీనం చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
2010-11 సంవత్సరానికి సంబంధించిన లెక్కల్లో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలున్నాయి. ఈ విషయంలో నిజానిజాలేమిటో తేలకపోవడంతోనే కొత్త కమిటీని ఎన్నుకోలేదు. ఫలితంగా 2011-12, 2012-13కు సంబంధించిన లెక్కల వివరాలను కూడా పూర్తిచేయలేకపోయారు. అయితే ముందుగా 2010-11కు సంబంధించిన లెక్కలను పరిష్కరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దీంతో ధర్మకర్తల మండలి మహాసభ నిర్వహణ బాధ్యతలను స్వాధీనం చేసుకోవాలని భావించింది. అయితే ఈ లెక్కల విషయంలో మండలి ఎలా వ్యవహరించనుందనే విషయమై ఇప్పుడు అందరిలో ఆసక్తి నెలకొంది.