Chairman of the Legislative Council
-
AP: ఫిరాయింపు ఎమ్మెల్సీలకు లాస్ట్ ఛాన్స్
సాక్షి, విజయవాడ: ఫిరాయింపు ఎమ్మెల్సీలకు మరోసారి నోటీసులు జారీ అయ్యాయి. అనర్హత పిటిషన్‌పై శాసనమండలి ఛైర్మన్ నోటీసులు జారీ చేశారు. ఫిరాయించిన ఎమ్మెల్సీలు వంశీకృష్ణ, సి.రామచంద్రయ్యలకు నోటీసులు జారీ చేశారు. ఈ నెల 5న తుది విచారణకు హాజరుకావాలని శాసనమండలి ఛైర్మన్ నోటీసులు జారీ చేశారు. పార్టీ ఫిరాయించిన ఇద్దరు ఎమ్మెల్సీలను అనర్హులుగా చేయాలని మండలి చైర్మన్‌కు వైఎస్సార్సీపీ ఫిర్యాదు చేసింది. పార్టీ తరపున మండలి కార్యదర్శికి ఎమ్మెల్సీలు మేరుగు మురళి, లేళ్ల అప్పిరెడ్డి ఫిర్యాదు చేశారు. కాగా, పార్టీ ఫిరాయించిన 8 మంది శాసన సభ్యులపై స్పీకర్ తమ్మినేని సీతారాం అనర్హత వేటు వేశారు. వీరిలో వైఎస్సార్సీపీ నుంచి నలుగురు, టీడీపీ నుంచి నలుగురు ఉన్నారు. వైఎస్సార్సీపీ నుంచి శాసనసభకు ఎన్నికై పార్టీ ఫిరాయించిన కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి (నెల్లూరు రూరల్ నియోజకవర్గం), ఆనం రామనారాయణరెడ్డి (వెంకటగిరి), మేకపాటి చంద్రశేఖరరెడ్డి (ఉదయగిరి), ఉండవల్లి శ్రీదేవి (తాడికొండ)పై ఫిరాయింపు నిరోధక చట్టం ప్రకారం అనర్హత వేటు వేయాలని కోరుతూ వైఎస్సార్సీపీ చీఫ్ విప్ ముదునూరు ప్రసాదరాజు స్పీకర్‌కు ఫిర్యాదు చేశారు. -
మనోడే ‘పెద్ద’
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: ‘పెద్దల సభ’లో జిల్లాకు అరుదైన గౌరవం దక్కింది. శాసనమండలి చైర్మన్‌గా జిల్లావాసి కె.స్వామిగౌడ్‌కు అవకాశం లభించింది. కరీంనగర్ ఎమ్మెల్సీ స్థానం నుంచి మండలికి ఎంపికైన స్వామిగౌడ్ స్వగ్రామం రాజేంద్రనగర్ మండలంలోని కిస్మత్పూర్. పంచాయతీ సేవక్‌గా ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించిన ఆయన.. ఉద్యోగసంఘం నేతగా ఎదిగారు. టీఎన్జీఓ సారథ్య బాధ్యతలు చేపట్టి తెలంగాణ ఉద్యమంలో కీలక భూమిక పోషించారు. వివిధ ఉద్యోగ సంఘాలను ఏకతాటిమీదకు తేవడం ద్వారా ప్రత్యేక రాష్ట్ర పోరాటంలో ప్రధానపాత్ర వహించారు. స్వామిగౌడ్ ఉద్యమస్ఫూర్తి, పోరాట పటిమను గుర్తించిన టీఆర్ఎస్ అధినేత కేసీఆర్.. ఆయనకు పదవీవిరమణ అనంతరం ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టారు. ఒకప్పుడు చిరుద్యోగిగా ప్రస్తానాన్ని ప్రారంభించిన స్వామిగౌడ్.. ఇప్పుడు ‘పెద్దల సభ’కు పెద్దమనిషిగా వ్యవహరించనున్నారు. బుధవారం కౌన్సిల్ చైర్మన్‌కు జరిగిన ఎన్నికల్లో ఆయన విజయం సాధించారు. తెలంగాణ ప్రభుత్వంలో తొలి శాసనమండలి అధ్యక్షుడిగా గెలుపొందిన గౌడ్సాబ్.. ఇక నుంచి జిల్లా రాజకీయాల్లోనూ తనదైన ముద్రవేయనున్నారు. మంత్రివర్గంలో స్వామిగౌడ్‌కు అవకాశం కల్పిస్తానని ముఖ్యమంత్రి కేసీఆర్ హామీ ఇచ్చిన ప్పటికీ, సామాజిక సమీకరణలు, సమతుల్యత నేపథ్యంలో ఆయనకు ఛాన్స్ రాలేదు. ఈ క్రమంలోనే స్వామిగౌడ్‌కు కీలక పదవి కట్టబెట్టాలని కేసీఆర్ నిర్ణయించారు. ఈ మేరకు టీఆర్ఎస్కు సంఖ్యాబలం లేనప్పటికీ, ఇతర పార్టీల సభ్యులను ఆకర్షించడంతో కౌన్సిల్ చైర్మన్ పదవి దక్కించుకునేందుకు మార్గం సుగమం చేశారు. ముగ్గురి ఓట్లు టీఆర్ఎస్కే! శాసనమండలి ఎన్నిక ల్లో అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. సొంత పార్టీలు జారీ చేసిన విప్‌లను ధిక్కరించి ఇద్దరు ఎమ్మెల్సీలు టీఆర్ఎస్కు అండగా నిలిచారు. తెలుగుదేశం తరుఫున కౌన్సిల్‌కు ఎన్నికైన పట్నం నరేందర్‌రెడ్డి సాధారణ ఎన్నికలకు ముందు కారెక్కారు. సాంకేతికంగా టీడీపీ సభ్యుడిగా ఉన్న నరేందర్.. ఆ పార్టీ జారీచేసిన విప్‌ను ఉల్లంఘించి స్వామిగౌడ్‌కు ఓటేశారు. అలాగే కాంగ్రెస్ ఎమ్మెల్సీగా వ్యవహరిస్తున్న యాదవరెడ్డి వ్యూహాత్మకంగా టీఆర్ఎస్ అభ్యర్థికి మద్దతు పలికారు. వీరేకాకుండా ఉపాధ్యాయ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న జనార్దన్ రెడ్డి ఇటీవల గులాబీ గూటికి చేరారు. ఆయన కూడా టీఆర్ఎస్కు అనుకూలంగా నడుచుకున్నారు. ఎమ్మెల్సీ నాగేశ్వర్ కూడా స్వామిగౌడ్‌కు మద్దతు పలికారు.