chairman of the Legislative Council swamy goud
-
అభివృద్ధే లక్ష్యంగా..
నిర్మాణాత్మక సలహాలివ్వాలి గజ్వేల్ : అభివృద్ధే ధ్యేయంగా ముందుకు సాగుతున్న ప్రభుత్వానికి పార్టీలకతీతంగా సహకరించాల్సిన అవసరం ఉందని రాష్ట్ర శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్ ప్రతిపక్షాలను కోరారు. గురువారం గజ్వేల్ నియోజక వర్గంలోని గజ్వేల్, తూప్రాన్, ములుగు, వర్గల్, జగదేవ్‌పూర్ మండలాల్లో పర్యటించిన ఆయన అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. గజ్వేల్ మండలం బంగ్లా వెంకటాపూర్‌లోని పెద్దచెరువులో రూ.31.34 లక్షల వ్యయంతో చేపట్టనున్న మిషన్ కాకతీయ పనులను ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో స్వామిగౌడ్ మాట్లాడారు. పేద, బడుగు వర్గాల సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు చేపడుతోందని కొనియాడారు. మహిళల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదని చెప్పారు. స్వయం సహాయక బృందాలకు రుణాలను రూ.5 నుంచి రూ.10 లక్షలకు పెంచిందని తెలిపారు. ప్రభుత్వం కల్పిస్తోన్న అవకాశాలను సద్వినియోగం చేసుకొని స్వావలంబనవైపు పయనించాలని పిలుపునిచ్చారు. సొంత నియోజకవర్గమైన గజ్వేల్‌ను అన్ని రంగాల్లో ఆదర్శంగా నిలపడానికి సీఎం కేసీఆర్ నిరంతరం శ్రమిస్తున్నారని తెలిపారు. సీఎం ఆశయాలకనుగుణంగా ‘గడా’ (గజ్వేల్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీ) ఓఎస్డీ హన్మంతరావు పనిచేస్తున్నారన్నారు. నియోజకవర్గంలోని ప్రజలు ఏ సమస్య ఉన్నా హన్మంతరావుకు చెబితే క్షణాల్లో ఆయన సీఎం దృష్టికి వెళ్లి పరిష్కారమయ్యేలా చొరవ చూపుతారన్నారు. బంగ్లా వెంకటాపూర్ సర్పంచ్ విజ్ఞప్తి మేరకు గ్రామంలో మురుగునీటి కాల్వల నిర్మాణం కోసం రూ.25 లక్షలు మంజూరు చేయాలని ‘గడా’ ఓఎస్డీకి స్వామిగౌడ్ సూచించారు. కార్యక్రమంలో ‘గడా’ ఓఎస్డీ హన్మంతరావు, గజ్వేల్ నగర పంచాయతీ చైర్మన్ గాడిపల్లి భాస్కర్, ఎంపీపీ చిన్నమల్లయ్య, జెడ్పీటీసీ సభ్యులు జేజాల వెంకటేశ్‌గౌడ్, టీఆర్ఎస్ గజ్వేల్ నియోజకవర్గ ఇన్చార్జి భూంరెడ్డి, డీసీసీబీ మాజీ చైర్మన్ ఎలక్షన్‌రెడ్డి, టీఆర్ఎస్ గజ్వేల్ మండల అధ్యక్షులు మద్దూరి శ్రీనివాస్‌రెడ్డి, టీఆర్ఎస్వీ జిల్లా అధ్యక్షులు మాదాసు శ్రీనివాస్, టీఆర్ఎస్ జిల్లా అధికార ప్రతినిధి పండరి రవీందర్రావు, బంగ్లావెంకటాపూర్ సర్పంచ్ బాలమణి, ఎంపీటీసీ సభ్యులు అంజిరెడ్డి, నాయకులు బురాన్, గోపాల్ తదితరులు పాల్గొన్నారు. ఇదిలావుంటే సభలో పలువురు మహిళలు తమ సమస్యలను పరిష్కరించాలని మండలి చైర్మన్‌ను వేడుకున్నారు. అంతకుముందు మండలి చైర్మన్‌కు బోనాలతో స్వాగతం పలికారు. -
తెలంగాణ యోధులకు గుర్తింపులేదు
బంగారు తెలంగాణలో కులవృత్తుల అభివృద్ధి సంఘాలకు కుల పిచ్చి ఉండొద్దు శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్ మిడ్జిల్: స్వాతంత్య్రం కోసం ఎంతోమంది తెలంగాణ యోధులు పోరాడినా కానీ వారి విగ్రహాలు ట్యాంక్‌బండ్‌పై లేకుండా ఆంధ్రాపాలకులు కుట్ర చేశారని శాసన మండలి చైర్మన్ స్వామిగౌడ్ పేర్కొన్నారు. మంగళవారం జడ్చర్ల నియోజకవర్గంలో పర్యటించిన ఆయన మిడ్జిల్‌లోని గౌడ సంఘం ఆధ్వర్యంలో ప్రతిష్ఠించనున్న సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహ ఆవిష్కరణకు భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణలో స్వాతంత్య్రం కోసం పోరాటం చేసిన వారి కీర్త ప్రతిష్టలు ఆంధ్రా పాలకుల పెత్తనం వల్ల అంతరించి పోయిందన్నారు. తెలంగాణ యోధులను స్మరించుకోవాలని, వారి విగ్రహాలను ట్యాంక్‌బండ్‌పై ప్రతిష్ఠించేందుకు ముఖ్యమంత్రిని కోరతానన్నారు. దొరలు, నవాబుల పాలన అంతమొందించేందుకు 350ఏళ్ల కిత్రం సర్దార్ పాపన్నగౌడ్ పోరాటం చేసినందుకు ఆయనను గోల్కోండ కోట దగ్గర నవాబులు అతి దారణంగా నరికి చంపారని గుర్తు చేశారు. తెలంగాణలోని ప్రతి మండల కేంద్రంలో పాపన్నగౌడ్ విగ్రహాలను ప్రతిష్ఠించేందుకు గౌడ సోదరులు ముందుకు రావాలన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో కులవృత్తులు పూర్తిగా అంతరించి పోయాయన్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సాధించిన కేసీఆర్ కృషి వల్ల బంగారు తెలంగాణలో మళ్లీ కులవృత్తులు అభివృద్ధి చెందుతాయన్నారు. కుల సంఘాలు ప్రతిష్టంగా ఉండాలే కానీ కుల పిచ్చి ఉండకూడదని సూచించారు. గౌడ కులస్తులకు ప్రభుత్వపరంగా అన్ని సౌకర్యాలు కల్పించేందుకు మంత్రులతో కలిసి కృషి చేస్తానని చెప్పారు. వన నర్సరీల ద్వారా తాటి, ఈత చెట్ల పెంపకం గ్రామాల్లో కల్తీకల్లును నివారించేందుకు ప్రభుత్వం చేపట్టిన హరిత వనం కార్యక్రమంలో వన నర్సరీల ద్వారా తాటి, ఈత చెట్లను పెంచి గౌడ కులస్తులకు అందజేస్తామని ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి అన్నారు. అలాగే ప్రభుత్వం గ్రామాల్లో గీత కార్మికులకు సొసైటీ ద్వారా ఐదు ఎకరాల భూమి ఇచ్చి తాటి, ఈత వనాలను పెంచేందుకు కృషి చేస్తుందని తెలిపారు. ఎవరూ కల్తీకల్లును ప్రోత్సహించవద్దని సూచించారు. పార్లమెంటరీ కార్యదర్శి శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ రజాకర్లను ఎదిరించిన ఘనత గౌడ సంఘానిదేనని అన్నారు. ప్రభుత్వపరంగా గౌడ కులస్తుల కోసం ఐదు ఎకరాల భూమి త్వరలో ఇప్పించేందుకు మంత్రి లక్ష్మారెడ్డితో కలిసి కృషి చేస్తానన్నారు. గీత కార్మికులకు పింఛన్లు వచ్చే విధంగా ప్రయత్నిస్తానని పేర్కొన్నారు. అనంతరం సంఘం ఆధ్వర్యంలో ముఖ్య అతిథులను సన్మానించారు. కార్యక్రమంలో నాయకులు లక్ష్మణ్‌గౌడ్, పల్లెరవికమార్‌గౌడ్, శ్రీనివాస్‌గౌడ్, రమేశ్‌గౌడ్, జెడ్పీటీసీ హైమావతి, ఎంపీపీ దీప, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు విఠల్‌రావు ఆర్య, తదితరులు పాల్గొన్నారు.