నిర్మాణాత్మక సలహాలివ్వాలి
గజ్వేల్ : అభివృద్ధే ధ్యేయంగా ముందుకు సాగుతున్న ప్రభుత్వానికి పార్టీలకతీతంగా సహకరించాల్సిన అవసరం ఉందని రాష్ట్ర శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్ ప్రతిపక్షాలను కోరారు. గురువారం గజ్వేల్ నియోజక వర్గంలోని గజ్వేల్, తూప్రాన్, ములుగు, వర్గల్, జగదేవ్‌పూర్ మండలాల్లో పర్యటించిన ఆయన అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. గజ్వేల్ మండలం బంగ్లా వెంకటాపూర్‌లోని పెద్దచెరువులో రూ.31.34 లక్షల వ్యయంతో చేపట్టనున్న మిషన్ కాకతీయ పనులను ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో స్వామిగౌడ్ మాట్లాడారు.
పేద, బడుగు వర్గాల సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు చేపడుతోందని కొనియాడారు. మహిళల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదని చెప్పారు. స్వయం సహాయక బృందాలకు రుణాలను రూ.5 నుంచి రూ.10 లక్షలకు పెంచిందని తెలిపారు. ప్రభుత్వం కల్పిస్తోన్న అవకాశాలను సద్వినియోగం చేసుకొని స్వావలంబనవైపు పయనించాలని పిలుపునిచ్చారు. సొంత నియోజకవర్గమైన గజ్వేల్‌ను అన్ని రంగాల్లో ఆదర్శంగా నిలపడానికి సీఎం కేసీఆర్ నిరంతరం శ్రమిస్తున్నారని తెలిపారు.
సీఎం ఆశయాలకనుగుణంగా ‘గడా’ (గజ్వేల్ ఏరియా డెవలప్‌మెంట్ అథారిటీ) ఓఎస్‌డీ హన్మంతరావు పనిచేస్తున్నారన్నారు. నియోజకవర్గంలోని ప్రజలు ఏ సమస్య ఉన్నా హన్మంతరావుకు చెబితే క్షణాల్లో ఆయన సీఎం దృష్టికి వెళ్లి పరిష్కారమయ్యేలా చొరవ చూపుతారన్నారు. బంగ్లా వెంకటాపూర్ సర్పంచ్ విజ్ఞప్తి మేరకు గ్రామంలో మురుగునీటి కాల్వల నిర్మాణం కోసం రూ.25 లక్షలు మంజూరు చేయాలని ‘గడా’ ఓఎస్‌డీకి స్వామిగౌడ్ సూచించారు.
కార్యక్రమంలో ‘గడా’ ఓఎస్‌డీ హన్మంతరావు, గజ్వేల్ నగర పంచాయతీ చైర్మన్ గాడిపల్లి భాస్కర్, ఎంపీపీ చిన్నమల్లయ్య, జెడ్పీటీసీ సభ్యులు జేజాల వెంకటేశ్‌గౌడ్, టీఆర్‌ఎస్ గజ్వేల్ నియోజకవర్గ ఇన్‌చార్జి భూంరెడ్డి, డీసీసీబీ మాజీ చైర్మన్ ఎలక్షన్‌రెడ్డి, టీఆర్‌ఎస్ గజ్వేల్ మండల అధ్యక్షులు మద్దూరి శ్రీనివాస్‌రెడ్డి, టీఆర్‌ఎస్వీ జిల్లా అధ్యక్షులు మాదాసు శ్రీనివాస్, టీఆర్‌ఎస్ జిల్లా అధికార ప్రతినిధి పండరి రవీందర్‌రావు, బంగ్లావెంకటాపూర్ సర్పంచ్ బాలమణి, ఎంపీటీసీ సభ్యులు అంజిరెడ్డి, నాయకులు బురాన్, గోపాల్ తదితరులు పాల్గొన్నారు. ఇదిలావుంటే సభలో పలువురు మహిళలు తమ సమస్యలను పరిష్కరించాలని మండలి చైర్మన్‌ను వేడుకున్నారు. అంతకుముందు మండలి చైర్మన్‌కు బోనాలతో స్వాగతం పలికారు.
అభివృద్ధే లక్ష్యంగా..
Published Fri, May 8 2015 12:28 AM | Last Updated on Tue, Aug 14 2018 10:51 AM
Advertisement