అందోల్ ఎమ్మెల్యే బాబూమోహన్
పుల్కల్ : మిషన్ కాకతీయ కమీషన్ల కార్యక్రమంగా మారిందంటూ ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలు అర్థరహితమని అందోల్ ఎమ్మెల్యే బాబూ మోహన్ పేర్కొన్నారు. ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న మిషన్ కాకతీయ పనులపై ఆరోపణలు చేయడం తగదన్నారు. ఎక్కడైనా కమీషన్లు తీసుకున్నట్లు నిరూపిస్తే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానన్నారు. మంగళవారం మిన్‌పూర్, పుల్కల్, పోచారం గ్రామాల్లో మిషన్ కాకతీయ పనులను ప్రారంభించిన అనంతరం ఆయన సింగూర్ ఐబీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ప్రతిపక్షాలు తమ ఉనికిని కాపాడుకునేందుకే ఆరోపణలు చేస్తున్నాయన్నారు.
మిషన్ కాకతీయ పనులకు సంబంధించిన బిల్లుల చెల్లింపులు జరుగకుండానే రూ. కోట్లు దండుకుంటున్నారని విమర్శలు చేయడం ఎంతవరకు సమంజసమన్నారు. సీఎం కేసీఆర్ అవినీతికి దూరంగా ఉండాలన్న ఉద్దేశంతోనే మిషన్ కాకతీయ బిల్లుల చెల్లింపుల కోసం ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేశారన్నారు. ఇప్పటికీ చెరువుల పూడికతీత పనులు పూర్తయినా బిల్లులు చెల్లించలేదని, ఇరిగేషన్‌శాఖ అధికారుల కొలతల ఆధారంగా చెల్లింపులు జరగవన్నారు.
పూర్తయిన చెరువులపై విజిలెన్స్ బృందం తనిఖీ చేసిన పనుల పట్ల సంతృప్తి వ్యక్తం చేస్తేనే బిల్లులు చెల్లిస్తారన్నారు. ఈ కార్యక్రమాలను స్వచ్ఛందంగా నిర్వహించేందుకు దాతలు ఒకవైపు ముందుకొస్తుంటే జీర్ణించుకోలేకనే విమర్శలు చేస్తున్నారన్నారు. ఈ పనుల ద్వారా భూగర్భజలాలు పెరగడంతో పాటు మత్స్య కార్మికులకు జీవనోపాధి లభిస్తుందన్నారు. నియోజకవర్గంలో 132 చెరువులు మిషన్ కాకతీయ కింద ఎంపిక కాగా 104 చెరువుల టెండర్లు పూర్తయ్యాయని మరో 28 చెరువులకు వారం రోజుల్లో టెండర్లు పిలుస్తారన్నారు.
గత నెలలో ప్రారంభించిన చెరువు పనుల్లో 50 శాతం వరకు పనులు పూర్తయ్యాయని ఈ విషయంలో అందోల్ నియోజకవర్గం జిల్లాలోనే మొదటి స్థానంలో ఉందన్నారు. 132 చెరువులకు గాను రూ. 29 కోట్లు మంజూరయ్యాయని ఎమ్మెల్యే తెలిపారు. పోచారం చెరువుకు రూ. 34, పుల్కల్‌కు రూ.34, మిన్‌పూర్‌కు రూ.51 లక్షల చొప్పున నిధులు మంజూరయ్యాయని తెలిపారు. సమావేశంలో మాజీ ఎంపీ మాణిక్‌రెడ్డి, జిల్లా నాయకులు, పల్లె సంజీవయ్య, పార్టీ మండల నాయకులు గోవర్థన్, కనకారెడ్డి, సంగమేశ్వర్‌గౌడ్, స్వామి తదితరులు పాల్గొన్నారు.
కమీషన్లు తీసుకున్నట్లు నిరూపిస్తే రాజీనామా చేస్తా.!
Published Tue, May 19 2015 11:48 PM | Last Updated on Tue, Aug 14 2018 10:51 AM
Advertisement
Advertisement