Mla babu mohan
-
కొత్త పంచాయతీలు ఏకగ్రీవం చేసుకోండి
జోగిపేట(అందోల్) సంగారెడ్డి : జిల్లాలో మొదటి నూతన పంచాయతీ భవనాన్ని బ్రాహ్మణపల్లిలోనే నిర్మిస్తానని, అందుకు అవసరమైన నిధులను నియోజకవర్గ అభివృద్ధి నిధుల నుంచి మంజూరు చేస్తున్నట్లు అందోల్ ఎమ్మెల్యే పి.బాబూమోహన్ ప్రకటించారు. గురువారం అందోల్ మండలం బ్రాహ్మణపల్లి గ్రామ నూతన గ్రామ పంచాయతీని కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లుతో కలిసి ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడారు. సీఎం కేసీఆర్ పుణ్యమాఅని నియోజకవర్గంలో చాలా వరకు కొత్త పంచాయతీలను ఏర్పాటు చేసుకోగలిగామన్నారు. ప్రభుత్వం కొత్త పంచాయతీలను అన్ని విధాలుగా అభివృద్ధి చేయాలన్న పట్టుదలతో ఉందన్నారు. అభివృద్ధికి అడ్డుపడే వారి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. కొత్త పంచాయతీల్లో పాలకవర్గాన్ని ఏకగ్రీవం చేసుకుంటే గ్రామాన్ని అందరి అభిప్రాయాల మేరకు అభివృద్ధి చేసుకునే అవకాశం ఉంటుందన్నారు. ఆరోగ్యం బాగా లేకున్నా నాకు ఇష్టమైన బ్రాహ్మణపల్లి గ్రామానికి వచ్చానని అన్నారు. తనకు భగవంతుడు ఆకాశమంత కీర్తిని ఇవ్వగలిగాడని, నాకు ఈ రోజు ఆరోగ్యం బాగా ఉంటే ఆస్ట్రేలియాలో ప్రధాని పక్కన కూర్చునే కార్యక్రమానికి వెళ్లే వాడినని, అలాంటి గుర్తింపు తనకు ఉందని, గ్రామాల్లో కొన్ని కలుపు మొక్కల వల్ల ఇబ్బందిగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ శ్రీనివాస్‌రెడ్డి, ఎంపీడీఓ నర్సింగ్‌రావు, తహసీల్దార్ నాగేశ్వరరావు, ఎంపీపీ ఉపాధ్యక్షుడు కే.రమేశ్, జిల్లా రైతు సమన్వయ సమితి సభ్యులు లింగాగౌడ్, జగన్మోహన్రెడ్డి, మండల రైతు సమన్వయ సమితి కోఆర్డినేటర్ వర్కల అశోక్, కౌన్సిలర్లు శ్రీకాంత్, గోపాల్, లక్ష్మణ్, నవీన్, గ్రామ పెద్దలు నారాయణ భట్టాచారి, సుదర్శన భట్టాచారి, ఈఓ పీఆర్డీ శ్రీనివాసరావు, ఏపీఓ అర్చన, మార్కెట్ డైరెక్టర్ మల్లికార్జున్, మాణిక్‌రెడ్డి, స్పెషల్ ఆఫీసర్ యశస్విని, టీఆర్ఎస్ పట్టణ, యవత అ«ధ్యక్షుడు సీహెచ్. వెంకటేశం, జి.రవీంద్రగౌడ్, టీఆర్ఎస్ నాయకులు జాకీర్, శ్రీధర్‌రెడ్డిలతో పాటు గ్రామస్తులు పాల్గొన్నారు. -
ఎమ్మెల్యే హాస్యనటుడు బాబూ మోహన్‌కు చుక్కెదురు
-
ఆయన...ఊ.. అందగాడా కమాన్.. అనేవారు..
పాలనలో ఎవరి శైలి వారిది. బాబు శైలి బాబుది, కేసీఆర్ శైలి కేసీఆర్‌ది. ఇక వైఎస్సార్ ఒక గొప్ప నేత. కాకుంటే ఇంతమంది జనం ఆయన్ని మహానుభావుడు అంటారా? వైఎస్సార్ ఎంత డైనమిక్‌గా ఉండేవారో రోజూ పేపర్లలో చూసేవాళ్లం. సాహసోపేతమైన నిర్ణయాలను అప్పటికప్పుడే తీసుకునేవారు. అలాంటి తత్వాన్ని ఎన్టీఆర్‌లో చూశాను, వైఎస్సార్‌లో చూశాను. నిర్ణయాలను వేగంగా తీసుకునే లక్షణమే నాయకులను చేస్తుంది. ఇలాంటి నేతలే డెసిషన్ మేకర్స్. సినిమా వాళ్లంటేనే అందరికీ చిన్న చూపు అని, ఏ ఘటన జరిగినా అందరూ సినిమావాళ్లమీదే పడతారని ప్రముఖ నటుడు, మాజీ మంత్రి, టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాబూమోహన్ ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నో కష్టాలు పడి, ఎందరిని ప్రాధేయపడితేనో సినీ నటులకు పాపులారిటీ వస్తుందని దాన్ని దెబ్బతీయడమే పనిగా పెట్టుకుంటున్నారన్నారు. డ్రగ్స్ విషయంలో అందరినీ పక్కనబెట్టి సినిమా వాళ్లతోనే ప్రపంచం కూలిపోతోంది అనేలా ప్రచారం చేశారని, ఏది వచ్చినా, ఏం జరి గినా ముందుగా సినిమావాళ్లనే బద్నాం చేస్తున్నారని విమర్శించారు. లేబర్ మంత్రిగా తొలి దశలో నటించిన తాను రాజకీయాల్లో చేరి కార్మిక మంత్రిగా కావడం ఊహించలేదన్నారు. నటనలో, రాజకీయాల్లో ఎన్టీఆర్ దేవుడని, సాహసోపేత నిర్ణయాలు తీసుకోవడంలో వైఎస్ రాజశేఖరరెడ్డి చాలా గొప్పనేత అని ప్రశంసించిన బాబూ మోహన్ అభిప్రాయాలు ఆయన మాటల్లోనే... సినిమాల్లో నిర్మాతలు, దర్శకులు, హీరోలు తోటినటులను ఇబ్బంది పెడతారా? కొందరిలో అలాంటి స్వభావం ఉంటుంది. సినీరంగంలో నవరసాలూ ఉంటాయి. కొందరు కనబడతారు, కొందరు కనబడరు. కొందరు పైకి చిరునవ్వు నవ్వినా, లోపల మాత్రం.. నీ... నా కొడకా.. దొరకవా అన్నట్లుగా ఉంటుంది. ఇవన్నీ సహజం. ఏ హీరో అంటే మీకు బాగా ఇష్టం? అందరూ ఇష్టమే. ఎన్టీఆర్ అంటే ఇక దేవుడే. కానీ అక్కినేని ఎంత ప్రేమగా పిలిచేవారంటే. ఊ.. అందగాడా కమాన్.. అనేవారు. బాబూ మోహన్ అని ఎన్నడూ పిలిచేవారు కాదు. చేయిపట్టి లాక్కుని కూర్చొబెట్టుకునేవారు. నాడూ నేడూ చిత్రపరిశ్రమ పరిస్థితి ఎలా ఉంది? అప్పట్లో మాతోపాటు ఇతరులూ బాగుండాలి అనుకునేవారు. ఇప్పుడయితే నేను బాగుంటే చాలు ఎవరెక్కడికి పోతే ఏం అనే పరిస్థితి వచ్చేసింది. సినిమా ఎంతో బాగున్నా బాగుంది అనడానికి ఇప్పుడెవరికీ మనసు రావడం లేదు. పక్కోడు సినిమా తీస్తే ఏ థియేటరూ దొరకనివ్వరు. స్పష్టంగా చెప్పాలంటే తెలుగు చిత్రసీమ ఆ నలుగురి రాజ్యంగా అయిపోయిందిప్పుడు. వాళ్లేం చెబితే అదే జరుగుతోంది. నువ్వు బతుకు నీతోపాటు నలుగురూ బతకనివ్వు అనేది వ్యాపారం. గతంలో నేను సమ్మక్క సారక్క మహాత్మ్యం అనే సినిమా తీశాను. వరంగల్‌లో విడుదల చేయడానికి నాలుగు థియేటర్లు దొరికాయి. కానీ సాయంత్రానికే వాటిని రద్దు చేశారు. ఆ నలుగురే కారణం. బలమున్న నటులు, నిర్మాతల కొడుకులు ముక్కూ మొహం సక్కగ లేకున్నా హీరోలే అవుతారు. నా కొడుకు ఆరడుగుల అందగాడే అయినా చాన్సు రాదు. కమెడియన్ కొడుకు కూడా హీరో అవుతాడా అనే ఈసడింపు కావచ్చు. ఇతరులకు ఎలాంటి అవకాశాలూ రావు. ఇవ్వరు. వస్తే తొక్కేస్తారు. ఇప్పుడొచ్చే హీరోలందరూ శోభన్‌బాబు, ఎన్టీఆర్‌లాగానే చక్కగా ఉన్నారా? రాజకీయ పాత్రల్లో డైలాగ్ డెలివరీలో ఒక ట్రెండ్ సృష్టించారు. ఎలా సాధ్యపడింది? తొలిదశలో ముత్యాల సుబ్బయ్య తీస్తున్న సినిమాలో లేబర్ మంత్రిగా చిన్న గెస్ట్ రోల్లో నటించాను. రావుగోపాలరావుతో కాంబినేషన్ ఉన్న పాత్ర. బాబూమోహన్ అయితే బాగుంటుందని రాజశేఖర్ చెబితే సరే సరే అంటూ చిరాకుపడి నాకే ఇచ్చారు. యాక్షన్ పాత్ర ముగిసి డబ్బింగు చెప్పేటప్పుడు చూసి ‘‘అబ్బబ్బ.. ఏమున్నాడు.. లేబర్ మంత్రిగెటప్లో ఏమున్నాడే.. భలే చేశాడే’’ అంటూ పదిసార్లు అన్నారట రావుగోపాలరావు. ఆయనంతటి గొప్ప నటుడే నా పాత్రను మెచ్చుకున్నారే అని తెగ సంతోషపడ్డాను. ఆరోజుల్లో ఆయనే తిరుగులేని స్టార్. ఇక నన్ను నేను చూసుకుని తెగ మురిసిపోయాను. అన్నేళ్ల నటజీవితం తర్వాత రాజకీయరంగంలో అడుగుపెట్టాక అదే లేబర్ మంత్రిగా అయ్యాను. అచ్చు కార్మిక మంత్రిగా ఉన్నాడే అని నా కెరీర్ మొదట్లో ఆయన పొగిడారు. తర్వాత నిజంగానే కార్మిక మంత్రిని అయిపోయాను. అలాగే బిచ్చగాడి పాత్ర వేసి ఒక ముద్ద ఉంటే వెయ్యండమ్మో అనే డైలాగ్ చెబితే జనం పడిపోయారు. ఒకసారి రైల్లో రాజమండ్రి వెళుతుంటే ఒక జడ్జి గారు పరిచయం అయ్యారు. ‘మా మనవడు మీ ఫ్యాన్ సర్, స్కూల్నుంచి రాగానే బువ్వ ఉంటే వెయ్యండమ్మో అంటూ వస్తాడు’ అన్నారు. ఎంత సంతోషమేసిందో. డ్రగ్స్ కేసులో సినీ పరిశ్రమకు చాలా చెడ్డపేరు వచ్చింది కదా? ఏది వచ్చినా, ఏం జరిగినా ముందుగా సినిమావాళ్లమీదే పడతారు. చివరికి మీడియా కూడా మామీదే పడుతుంది. బాబూమోహన్ అట.. ఎన్టీఆర్ అట.. అలా మా పేర్లు వాడుకోవడం కోసమే ఈ గోలంతా తప్ప, ఎప్పటినుంచో జరుగుతున్న వ్యవహారంలో ఇరుక్కున్నవారిని ఈజీగా వదిలేస్తారు. మా ప్రతిష్టను దెబ్బతీయడానికి వాడుకుం టారు. ఎన్ని కష్టాలు పడి ఎందరిని ప్రాధేయపడితేనో మాకు ఈ ఆదరణ వచ్చింది. మీ దర్యాప్తుల కోసం, మీకు పేరు రావడం కోసం మా ప్రతిష్టని దెబ్బతీయాలా? పొద్దున మొదలు పెడితే ఆ స్క్రోలింగ్ ఏమిటి... అమ్మో ఏమో అయిపోతోంది. ప్రపంచం కూలి పోతోంది అనే స్థాయిలో ప్రచారం చేశారు. సినిమా వాళ్లలో కొందరు అనండి ఒప్పుకుం టాము. కానీ కొందరు అనలేదే. అందరినీ కలిపేస్తున్నారు. టీవీ ఆన్ చేస్తే చాలు ఉదయం నుంచి సాయంత్రం దాకా ప్రచారం మోత. ఇంకేమీ లేవా..? సినిమాల నుంచి రాజకీయాలకు ఎలా వచ్చారు? ఎన్టీరామారావు అభిమానిని. అన్నగారు చెబితే వారి పార్టీ తరపున ప్రచారం చేయవలసి వచ్చింది. మొదటిసారి వెళ్లినప్పుడు ఒక పార్టీ తరపున ప్రచారం చేయడం ఎందుకు అనిపించింది. కానీ అన్నగారి మాట జవదాటలేను. పోతే పలానా పార్టీ మనిషి అనే ముద్రపడిపోతుంది. అన్నగారి ఆర్డర్ కాబట్టి వెళ్లాను. నేను ప్రచారం చేసిన మనిషి తలసాని శ్రీనివాస యాదవ్ గెలిచాడు. నేను రాజకీయాల్లోకి ఎలా వచ్చానంటే.. దాసరి సినిమా షూటింగులో ఉండగా మాజీ హోంమంత్రి ఇంద్రారెడ్డి ఒకసారి పిలి పించారు. నామినేషన్ మీద సంతకం పెట్టు అన్నారు. నామినేషన్ ఏమిటి అని అడిగాను. ముందు సంతకం పెట్టు అని బలవంతం చేసి పెట్టిం చాడు. తర్వాత వెంటనే రోడ్డు మీద నిలబెట్టి జనం ముందు మాట్లాడమన్నాడు. ఏం ఉపన్యాసం అంటే పోటీ చేస్తున్నావు కదా అన్నాడు. ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని కూలగొట్టేయడం అన్యాయం అనిపించలేదా? అన్యాయం అనిపించింది కాబట్టే రాష్ట్రమంతటా తిరిగాను. అన్నగారికి అనుకూలంగా ప్రచారం చేశాను. తర్వాత కొంత కాలానికే ఆయన చని పోయారు. ఆ ఘటనతో పూర్తిగా విరక్తి వచ్చేసింది. అన్నే నాకు ముఖ్యం. సినిమాలు చేస్తూనే అన్నగారు ఏం చేస్తే ఆ పని నేనూ చేయాలనిపించింది. ఆ క్రమంలో భిక్షాటన చేశాను. బట్టలషాపులకు వెళ్లి పేదలకు బట్టలు అడిగాను. కానీ నాకు అప్పటికి స్టార్ వాల్యూ ఉంది కాబట్టి ఎక్కడికి వెళ్లినా జనం వెంటబడేవారు. మా జిల్లాలోనే ఒకసారి జనం మధ్యలో చచ్చిపోతానేమో అన్నంత భయం వేసింది. ఏం చేయాలో అర్థం కాక బాబుకు ఫోన్ చేశాను. ఆయన సీటు ఇచ్చారు.. గెలిచాను. 2001లో కేసీఆర్ పార్టీ పెట్టినప్పుడు మిమ్మల్ని పిలవలేదు కదా? గతంలో నన్ను గెలిపించడానికి సిద్దిపేట ఏరియాలో మూడు నెలలు గ్రామాల్లో తిరి గారు కేసీఆర్. వ్యక్తిగతంగా చాలా మంచి అభిమానం ఉండేది. ఆయన పార్టీ పెట్టినప్పుడు నన్ను పిలవలేదు. ఇబ్బంది పెట్టలేదు కూడా. కానీ బాబు నాకు టిక్కెట్ ఇవ్వనన్నప్పుడు టీడీపీకి రాజీనామా చేశాను. ఇక రాజకీయాలు వద్దనుకున్నాను. అప్పుడే కేసీఆర్ నుంచి ఫోన్ వచ్చింది. ‘బామ్మర్దీ రా’ అన్నారు. ‘నేను నిన్ను ఇంతవరకూ ఎప్పుడూ ఇబ్బంది పెట్టలేదు. ఇప్పుడు నీకు ప్రాబ్లమ్ వచ్చింది. నిన్ను కాపాడుకోవాల్సిన బాధ్యత నాది. రా..’ అన్నారు. అలా ఉదయం పిలిచాడు. సాయంత్రానికి నామినేషన్ వేయించాడు. గెలిపించాడు. బాబూ మోహన్‌కి టీడీపీ వాళ్లు అన్యాయం చేసారని జనం గ్రహించారు. వాళ్లూ వీళ్లూ కూడా ఒక్కటై నాకు మద్దతుగా నిలబడ్డారు. చంద్రబాబు మీకు ఎందుకు సీటివ్వలేదు? చాలా జరిగాయి. ఎవరు నాపై వ్యతిరేకంగా చెప్పారో, ఆయన వేటిని నమ్మారో.. ఆ వివరాల్లోకి ఇప్పుడు పోను. తప్పించుకుంటున్నారు అని మీరు ఎత్తిచూపినా సరే పాత విషయాల్లోకి వెళ్లను. గతాన్ని తవ్వుకుంటూ ఉంటే ఇంత ముందుకొచ్చేటోడిని కాదు. జీవితంలో మీకు బాగా సంతోషం కలిగించిన ఘటన ఏది? సినిమాల్లో, రాజకీయాల్లో అవకాశాలు లేవు. అన్నీ వదులుకుని ఇంట్లో కూర్చుని ఉండిపోయాను. గతంలో నేను చూసిన కేసీఆర్ ఉద్యమనేతగా మహాత్ముడి స్థాయికి పెరిగిపోయారు. నేను భూమ్మీదే ఉండి ఆయన్ని తలెత్తి చూడాల్సిన పరిస్థితి. అప్పుడు సైతం ఆయనే నన్ను బామ్మర్దీ... రా అని పిలిచారు. తెలంగాణ సీఎం అయిపోయినట్లే అనేంత స్థాయిలో ఉన్నప్పుడు కూడా ఆయన నన్ను చిన్నప్పుడు పిలిచినట్లే అదే సాన్నిహిత్యంతో పిలిచారే.. ఇలాంటి మహానుభావులు ఉంటారా అని బాగా సంతోషం వేసింది. (బాబూమోహన్‌తో ఇంటర్వ్యూ పూర్తి పాఠం కింది లింకుల్లో చూడండి) https://goo.gl/MuV9JT https://goo.gl/BYCEpR -
పల్లెకు 'వలస'
- మళ్లీ పల్లెబాట పడుతున్న ‘సింగూరు’ రైతులు - దశాబ్దాల తర్వాత సేద్యానికి నీళ్లు - కాలువలు పూర్తి చేసి 47,500 ఎకరాలకు నీరు విడుదల - ఇన్నాళ్లూ కరువుతో పట్నం వలస వెళ్లిన వందలాది కుటుంబాలు - ప్రాజెక్టుకు నీటి రాకతో తిరిగి వెనక్కి ∙20 ఏళ్ల తర్వాత వ్యవసాయం - పొలం పనుల్లో రైతులు.. కళకళలాడుతున్న పంట పొలాలు సాగు చేద్దామంటే చుక్క నీరు లేక.. చేయడానికి పనేమీ దొరక్క.. బతకాలంటే పట్నం పోక తప్పదనే బాధతో.. పొట్ట చేతబట్టుకుని హైదరాబాద్‌కు వలస వచ్చిన రైతు కుటుంబాలు అవి. కానీ ఇప్పుడు తట్టాబుట్టా సర్దుకుని తిరిగి తమ పల్లె బాట పడుతున్నాయి. సింగూరు నీటితో తమ పొలాల్లో బంగారం పండించుకోవచ్చనే ఆశతో వెనుదిరుగుతున్నాయి. సంగారెడ్డి జిల్లా ఆందోల్, పుల్కల్ మండలాలతో పాటు చుట్టుపక్కల ఉన్న 44 గ్రామాలకు చెందిన వందలాది రైతు కుటుంబాల గాథ ఇది. సింగూరు ప్రాజెక్టు కాలువలు పూర్తి చేసి.. ఆ నీటితో చెరువులు నింపి, పొలాలకు అందిస్తుండడమే దీనికి కారణం. ఇరవై ముప్పై ఏళ్ల కింద సింగూరు ప్రాంతం నుంచి వలస వెళ్లిన వందలాది కుటుంబాలు కూడా తిరిగి స్వగ్రామాలకు వచ్చి.. తమ పొలాలను సాగు చేసుకుంటున్నాయి. ఈ అంశంపై ఈ వారం ‘సాక్షి’ఫోకస్... – జోగిపేట, పుల్కల్ (ఆందోల్) సాగు చేద్దామంటే నీళ్లు లేక.. బోర్లు వేసే స్థోమత లేక ఉపాధి కోసం పొట్టచేతబట్టుకుని పట్నం బాట పట్టిన ‘సింగూరు’ప్రజలు తిరిగి సొంతూళ్ల బాట పడుతున్నారు. సింగూరు ప్రాజెక్టు పరిధిలోని ఆందోల్, పుల్కల్ మండలాలకు చెందిన 759 కుటుంబాలు వ్యవసాయం చేసుకునేందుకు మళ్లీ స్వగ్రామాలకు చేరుకున్నాయి. దాదాపు మూడు దశాబ్దాల కింద 1990–91లో కురిసిన భారీ వర్షాలతో ఆందోల్ పెద్ద చెరువులోకి భారీగా నీరు వచ్చి పొంగి పొర్లగా.. ఇప్పటిదాకా మళ్లీ చెరువు నిండిందే లేదు. అలాంటిది ఈ ఏడాది సింగూరు ప్రాజెక్టు నీటిని కాలువల ద్వారా ఆందోల్ పెద్ద చెరువుకు మళ్లించడంతో.. నీరు నిండి అలుగు పారింది. ఇలా అలుగుపారి పిల్ల కాలువల ద్వారా వచ్చిన నీటిని సైతం దాదాపు నెల రోజుల పాటు రైతులు పొలాలకు మళ్లించుకున్నారు. మొత్తంగా 25 ఏళ్లుగా బీడుగా ఉన్న భూములు ఇప్పుడు పంటలతో కళకళలాడుతున్నాయి. వైఎస్ హయాంలో.. ఆందోల్ నియోజకవర్గంలోని 40 వేల ఎకరాలకు సాగునీరు అందించాలన్న ఉద్దేశంతో వైఎస్ రాజశేఖరరెడ్డి సింగూరు కాలువ పనులకు రూ.89.98 కోట్లు మంజూరు చేశారు. స్వయంగా వైఎస్ శంకుస్థాపన కూడా చేసి.. పనులు ప్రారంభించారు. కానీ ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలేవీ ఈ ప్రాజెక్టును పట్టించుకోలేదు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటయ్యాక సింగూరుపై మంత్రి హరీశ్‌రావు ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. ఎప్పటికప్పుడు అధికారులతో సమీక్షిస్తూ కాలువలు పూర్తి చేయించారు. దీంతో గత యాసంగిలోనే రైతులకు నీరందింది. అంతేకాక ప్రత్యేకంగా 90 చెరువులను సింగూరు నీటితో నింపేందుకు అదనంగా కాలువల నిర్మాణాన్ని చేపట్టారు. మొత్తంగా యాసంగిలో 30 వేల ఎకరాలకు సాగునీరు అందించగా.. ఖరీఫ్‌లో 40 వేల ఎకరాలకు నీరందించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఇక్కడి ఎమ్మెల్యే బాబూమోహన్ కూడా ప్రత్యేక శ్రద్ధ చూపించడంతో కాలువ పనులు వేగంగా పూర్తయ్యాయి. రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు ఈ రెండు మండలాల్లోంచి కొన్నేళ్లుగా పెద్ద సంఖ్యలో కుటుంబాలు వలస వెళ్లాయి. పుల్కల్ మండలంలోని బొమ్మారెడ్డిగూడెం పంచాయతీ పరిధి నుంచి సుమారు 38 కుటుంబాలు పట్నం వెళ్లాయి. ఇలాంటి వారిలో వివిధ గ్రామాలకు చెందిన వందలాది రైతు కుటుంబాలు స్వగ్రామాలకు తిరిగి వచ్చాయని రెవెన్యూ అధికారులు గుర్తించారు. వీరికి హైదరాబాద్‌లోనే రేషన్‌కార్డులు, అక్కడి చిరునామాలతోనే ఆధార్‌కార్డులు ఉన్నాయి. ఇప్పుడు వారంతా హైదరాబాద్‌లోని కార్డులను రద్దు చేసి.. తమ స్వగ్రామాల చిరునామాతో ఇవ్వాలని తహసీల్దార్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్నారు. 20 ఏళ్లుగా బీడు భూములే.. సింగూరు ప్రాజెక్టు పరిధిలోనే ఉన్నా.. ఆందోల్, పుల్క ల్ మండలాల్లోని వేల ఎకరాలకు నీరందకపోవడంతో అవన్నీ దాదాపు 20 ఏళ్లుగా బీడుగా మారిపోయాయి. ఈ ప్రాంతాలకు వందలాది కుటుంబాలు పొట్టచేత పట్టుకుని హైదరాబాద్ సహా ఇతర పట్టణాలకు వలస వెళ్లిపోయాయి. వారంతా సికింద్రాబాద్, పటాన్చెరు, రామచంద్రాపురం, రంగారెడ్డి జిల్లాలోని పలు ప్రాంతాలలో అడ్డా కూలీలుగా మారిపోయారు. పనులు దొరకక, కడుపు నిండక అర్ధాకలితోనూ అలమటించారు. ఇప్పుడు పొలాలకు సింగూరు జలాలు వస్తుండడంతో తిరిగి వచ్చారు. ఇది నా అదృష్టం.. ‘‘ఖరీఫ్ సీజన్లో 47,500 ఎకరాలకు సాగునీరు అందించేందుకు సింగూరు జలాలను వదిలే అవకాశం నాకు దక్కడాన్ని జీవితంలో మరిచిపోలేను. రైతులకు నీరందించే అవకాశం దక్కడం అదృష్టంగా భావిస్తున్నా. సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్‌రావుల కృషితోనే సింగూరు జలాలు అందుతున్నాయి. ఉపాధి కోసం పట్టణ ప్రాంతాలకు వలస వెళ్లిన వందల కుటుంబాలు వెనక్కి రావడం సంతోషంగా ఉంది. ఇక నుంచి ఆందోల్, పుల్కల్లలోని ఒక్క చెరువును కూడా ఎండిపోనివ్వం. సింగూరులోకి కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా నీరు వస్తుందని సీఎం అసెంబ్లీలోనే స్వయంగా చెప్పారు కూడా..’’ – పి.బాబూమోహన్, ఆందోల్, ఎమ్మెల్యే వందల కుటుంబాలు వెనక్కి.. సింగూరు జలాలు రావడంతో వివిధ ప్రాం తాలకు వలస వెళ్లిన రైతులంతా తిరిగి సొంతూళ్లకు వస్తున్నారు. ఆందోల్ మండల పరిధిలోని కాలువ పరీవాహక ప్రాంతాలకు చెందిన 438 కుటుంబాలు దాదాపు 25 ఏళ్ల తర్వాత తిరిగి వెనక్కి వచ్చాయి. ఆందోల్ మండల పరిధిలోని కన్సాన్పల్లి, రాంసానిపల్లి, అన్నాసాగర్, పోసానిపేట, మాసానిపల్లి గ్రామాలకు చెందిన రైతులు దాదాపు 1,338 మంది వరకు ఉన్నట్లు అంచనా. ఇక పుల్కల్ మండలంలో సుమారు 15 గ్రామాలకు చెందిన 321 రైతు కుటుంబాలు తిరిగి స్వగ్రామాలకు వచ్చి పంటలను సాగు చేసుకుంటున్నాయి. నాడు బీళ్లు.. నేడు పంటలు ఈ ప్రాం తంలో ఏళ్ల తరబడి బీడుగా ఉన్న భూములు ఇప్పుడు ఎక్కడ చూసినా నారుమళ్లు, వరినాట్లతో కళ కళలాడుతున్నాయి. ఉపాధి కోసం వలస వెళ్లిన రైతులంతా వెనక్కి వచ్చి వారి భూముల్లో పంటలు వేస్తున్నారు. తమ పొలాల్లో తిరిగి నాట్లు వేసుకోవడం, దున్నుకోవడంతో వారి ముఖాల్లో ఆనందం కనిపిస్తోంది. యాసంగి నాటికే కొన్ని కుటుంబాలు పంటలు వేయగా.. ఇప్పుడు సాగు మరింతగా పెరిగింది. రైతులంతా పంటలు సాగు చేసుకుంటుండడంతో ఇక్కడ కూలీలు దొరకని పరిస్థితి ఏర్పడడం గమనార్హం. ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 30 టీఎంసీలు (529 అడుగులు) ప్రస్తుత నీటి నిల్వ18 టీఎంసీలు (521 అడుగులు) ఎడమ కాలువ ద్వారా సరఫరా 37,500 ఎకరాలకు 90 చెరువుల ద్వారా సరఫరా 10,000 ఎకరాలకు వెనక్కి వచ్చిన కుటుంబాలు 759 నీరు రావడంతో పల్లెకు వచ్చా.. ‘‘ఇప్పటివరకు ప్రైవేటు ఉద్యోగం చేస్తూ సంగారెడ్డిలో ఉన్నాం. ఇçప్పుడు సింగూరు నీరు వస్తుండటంతో తిరిగి ఊరికి వచ్చాం. ఇంత కాలం బీడుగా ఉన్న భూమిలో అచ్చుకట్టి పొలం చేశాను. పంటలు పండిస్తూ నలుగురికి పని కల్పించే అవకాశం వచ్చింది. కుటుంబంతో కలసి ఇంటి వద్దే పనిచేసుకోవడం ఆనందంగా ఉంది..’’ – గోపాల్ రాథోడ్, బొమ్మారెడ్డిగూడెం పొలాలన్నీ కళకళలాడుతున్నాయి ‘‘నీటి వసతి లేకపోవడంతో ఏళ్ల తరబడి మా పంటలను బీళ్లుగా ఉంచుకున్నాం. పక్కనే సింగూరు ప్రాజెక్టు ఉన్నా నీటిని వినియోగించుకోలేని దుస్థితి ఉండేది. ప్రభుత్వం కాలువల పనులు పూర్తిచేసి చెరువులు నింపి సేద్యానికి నీరందిస్తోంది. దీంతో ఇప్పుడు ఎక్కడ చూసినా పొలాల నిండా నాట్లతో, కూలీలతో కళకళలాడుతున్నాయి..’’ – పెంటయ్య, రైతు, పుల్కల్ మూడెకరాల్లో వరి వేస్తున్నాం.. ‘‘సింగూరు నీరు రావడంతో ఉన్న మూడెకరాల్లో వరి పంట వేస్తున్నా. గత రబీ లో నీరు వచ్చినప్పుడు పంట లు వేసిన. ఇప్పుడు కూడా నీరు వస్తోంది. వారం రోజు ల్లో నాట్లు వేస్తాం. ఇప్పటివరకు నీళ్లు లేక వలస పోయాం. ఇప్పుడు మాకే పని కోసం మనుషులు సరిపోవడం లేదు..’’ –అల్గొల స్వప్న, సింగూరు 611 రేషన్‌కార్డులకు దరఖాస్తులు ‘‘ఏళ్ల క్రితం వివిధ ప్రాంతాలకు వలసవెళ్లిన వారు ఇప్పుడు సొంత గ్రామాలకు తిరిగి వస్తున్నారు. తమకు పట్నంలో రేషన్, ఆధార్‌కార్డు ఉన్నాయని, వాటిని రద్దు చేసి ఇక్కడ ఇవ్వాలంటూ ఇప్పటివరకు 611 మంది దరఖాస్తు చేసుకున్నారు. కార్డుల మంజూరు కోసం ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు పంపించాం..’’ – తహసీల్దార్ 47,500 ఎకరాలకు నీరిస్తున్నాం ‘‘ఖరీఫ్ సీజన్లో సింగూరు ప్రాజెక్టు ఎడమ కాలువ ద్వారా ఆందోల్, పుల్కల్ మండలాలతో పాటు మునిపల్లి, సదాశివపేట తదితర 44 గ్రామాల్లోని 47,500 ఎకరాలకు సాగునీటిని అందిస్తున్నాం. యాసంగిలో సుమారు 30 వేల ఎకరాల వరకు నీరందించాం. అప్పట్లో 70 చెరువులను నింపగా.. ఈ ఖరీఫ్ సీజన్లో 90 చెరువులను నింపి పది వేల ఎకరాలకు, కాలువల ద్వారా 37,500 ఎకరాలకు నీరందిస్తున్నాం. మరో 30 చెరువులను నింపేందుకు నిధుల కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాం. వచ్చే యాసంగికి కుడి కాలువ ద్వారా 2,500 ఎకరాలకు నీరందించేందుకు చర్యలు తీసుకుంటున్నాం..’’ – బాలగణేశ్, సాగునీటి శాఖ డిప్యూటీ ఈఈ -
'నాణ్యత లేకుంటే బ్లాక్‌లిస్ట్‌లోకే..'
టేక్మాల్ (మెదక్) : మిషన్ కాకతీయ పనుల్లో నాణ్యత పాటించకుంటే కాంట్రాక్టర్లను బ్లాక్‌లిస్ట్‌లో పెడతామని ఆందోల్ ఎమ్మెల్యే బాబూమోహన్ హెచ్చరించారు. శనివారం మండలంలోని బొడ్మట్‌పల్లి గ్రామంలోని గటంగారోల్ల కుంటలో మిషన్‌కాకతీయ పనులను ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ... పనులను నాణ్యంగా, త్వరితగతిన చేయకుంటే లైసెన్స్‌ను రద్దు చేస్తామన్నారు. పనులపై అశ్రద్ధ వద్దని, ఎప్పటికప్పుడు తనకు వివరాలు అందించాలని అధికారులను ఆదేశించారు. టేక్మాల్ మండలంలో రెండో విడత మిషన్ కాకతీయ పథకంలో భాగంగా 35 చెరువుల పనులకు రూ.17.23 కోట్లు మంజూరైనట్లు ఆయన తెలిపారు. -
జాతరలో ఎమ్మెల్యేకు అవమానం..
మేడారం (వరంగల్) : ప్రముఖ హాస్యనటుడు, టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాబూమోహన్‌కు మేడారం జాతరలో పోలీసుల నుంచి అవమానం ఎదురైంది. బాబూమోహన్ శుక్రవారం సమ్మక్క సారలమ్మల దర్శనం కోసం వెళ్లగా వీఐపీలు దర్శనానికి వెళ్లే ద్వారం గేటుకు డీఎస్పీ తాళం వేసి వెళ్లిపోయారు. ఈ సందర్భంగా బాబూ మోహన్ పోలీసుల తీరుపై అసహనం వ్యక్తం చేశారు. కొద్దిసేపటి తర్వాత పోలీసులే గేటు తాళం పగులగొట్టి ఎమ్మెల్యేకు దర్శనం కల్పించారు. బాబూమోహన్ మాట్లాడుతూ.. జాతరలో పోలీసుల తీరు అభ్యంతరకరంగా ఉందని అన్నారు. ఘటనపై సీఎంకు ఫిర్యాదు చేస్తానని తెలిపారు. -
ఇన్ని కోట్ల రుణాలు ఇస్తారా?.. నాకు తెల్వదే!
ఎమ్మెల్యే బాబూమోహన్ జోగిపేట: వామ్మో రూ.29 కోట్లు మాఫీ అయ్యాయా.. నా నియోజకవర్గంలో రూ.79 కోట్లు రుణాలిచ్చారా? అంటూ మెదక్ జిల్లా అందోలు ఎమ్మెల్యే బాబూమోహన్ ఆశ్చర్యా న్ని వ్యక్తం చేశారు. శుక్రవారం జోగిపేటలో జరిగిన రుణమాఫీపత్రాల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. నియోజకవర్గం లోని 8సొసైటీల పరిధిలో రుణమాఫీ, రుణాల మంజూరు వివరాలను డీసీసీబీ సీఈవో శివకోటేశ్వరరావు వివరించగా ఎమ్మె ల్యే పైవిధంగా స్పందించారు. ఎమ్మెల్యే వ్యాఖ్యలకు అక్కడు న్నవారు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. -
కమీషన్లు తీసుకున్నట్లు నిరూపిస్తే రాజీనామా చేస్తా.!
అందోల్ ఎమ్మెల్యే బాబూమోహన్ పుల్కల్ : మిషన్ కాకతీయ కమీషన్ల కార్యక్రమంగా మారిందంటూ ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలు అర్థరహితమని అందోల్ ఎమ్మెల్యే బాబూ మోహన్ పేర్కొన్నారు. ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న మిషన్ కాకతీయ పనులపై ఆరోపణలు చేయడం తగదన్నారు. ఎక్కడైనా కమీషన్లు తీసుకున్నట్లు నిరూపిస్తే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానన్నారు. మంగళవారం మిన్పూర్, పుల్కల్, పోచారం గ్రామాల్లో మిషన్ కాకతీయ పనులను ప్రారంభించిన అనంతరం ఆయన సింగూర్ ఐబీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ప్రతిపక్షాలు తమ ఉనికిని కాపాడుకునేందుకే ఆరోపణలు చేస్తున్నాయన్నారు. మిషన్ కాకతీయ పనులకు సంబంధించిన బిల్లుల చెల్లింపులు జరుగకుండానే రూ. కోట్లు దండుకుంటున్నారని విమర్శలు చేయడం ఎంతవరకు సమంజసమన్నారు. సీఎం కేసీఆర్ అవినీతికి దూరంగా ఉండాలన్న ఉద్దేశంతోనే మిషన్ కాకతీయ బిల్లుల చెల్లింపుల కోసం ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేశారన్నారు. ఇప్పటికీ చెరువుల పూడికతీత పనులు పూర్తయినా బిల్లులు చెల్లించలేదని, ఇరిగేషన్‌శాఖ అధికారుల కొలతల ఆధారంగా చెల్లింపులు జరగవన్నారు. పూర్తయిన చెరువులపై విజిలెన్స్ బృందం తనిఖీ చేసిన పనుల పట్ల సంతృప్తి వ్యక్తం చేస్తేనే బిల్లులు చెల్లిస్తారన్నారు. ఈ కార్యక్రమాలను స్వచ్ఛందంగా నిర్వహించేందుకు దాతలు ఒకవైపు ముందుకొస్తుంటే జీర్ణించుకోలేకనే విమర్శలు చేస్తున్నారన్నారు. ఈ పనుల ద్వారా భూగర్భజలాలు పెరగడంతో పాటు మత్స్య కార్మికులకు జీవనోపాధి లభిస్తుందన్నారు. నియోజకవర్గంలో 132 చెరువులు మిషన్ కాకతీయ కింద ఎంపిక కాగా 104 చెరువుల టెండర్లు పూర్తయ్యాయని మరో 28 చెరువులకు వారం రోజుల్లో టెండర్లు పిలుస్తారన్నారు. గత నెలలో ప్రారంభించిన చెరువు పనుల్లో 50 శాతం వరకు పనులు పూర్తయ్యాయని ఈ విషయంలో అందోల్ నియోజకవర్గం జిల్లాలోనే మొదటి స్థానంలో ఉందన్నారు. 132 చెరువులకు గాను రూ. 29 కోట్లు మంజూరయ్యాయని ఎమ్మెల్యే తెలిపారు. పోచారం చెరువుకు రూ. 34, పుల్కల్కు రూ.34, మిన్పూర్కు రూ.51 లక్షల చొప్పున నిధులు మంజూరయ్యాయని తెలిపారు. సమావేశంలో మాజీ ఎంపీ మాణిక్‌రెడ్డి, జిల్లా నాయకులు, పల్లె సంజీవయ్య, పార్టీ మండల నాయకులు గోవర్థన్, కనకారెడ్డి, సంగమేశ్వర్‌గౌడ్, స్వామి తదితరులు పాల్గొన్నారు.