పల్లెకు 'వలస' | Water for irrigation after decades | Sakshi
Sakshi News home page

పల్లెకు 'వలస'

Published Sun, Aug 6 2017 2:05 AM | Last Updated on Mon, Oct 1 2018 2:16 PM

పల్లెకు 'వలస' - Sakshi

పల్లెకు 'వలస'

- మళ్లీ పల్లెబాట పడుతున్న ‘సింగూరు’ రైతులు 
దశాబ్దాల తర్వాత సేద్యానికి నీళ్లు
కాలువలు పూర్తి చేసి 47,500 ఎకరాలకు నీరు విడుదల 
ఇన్నాళ్లూ కరువుతో పట్నం వలస వెళ్లిన వందలాది కుటుంబాలు
ప్రాజెక్టుకు నీటి రాకతో తిరిగి వెనక్కి ∙20 ఏళ్ల తర్వాత వ్యవసాయం 
పొలం పనుల్లో రైతులు.. కళకళలాడుతున్న పంట పొలాలు

సాగు చేద్దామంటే చుక్క నీరు లేక.. చేయడానికి పనేమీ దొరక్క.. బతకాలంటే పట్నం పోక తప్పదనే బాధతో.. పొట్ట చేతబట్టుకుని హైదరాబాద్‌కు వలస వచ్చిన రైతు కుటుంబాలు అవి. కానీ ఇప్పుడు తట్టాబుట్టా సర్దుకుని తిరిగి తమ పల్లె బాట పడుతున్నాయి. సింగూరు నీటితో తమ పొలాల్లో బంగారం పండించుకోవచ్చనే ఆశతో వెనుదిరుగుతున్నాయి. సంగారెడ్డి జిల్లా ఆందోల్, పుల్‌కల్‌ మండలాలతో పాటు చుట్టుపక్కల ఉన్న 44 గ్రామాలకు చెందిన వందలాది రైతు కుటుంబాల గాథ ఇది. సింగూరు ప్రాజెక్టు కాలువలు పూర్తి చేసి.. ఆ నీటితో చెరువులు నింపి, పొలాలకు అందిస్తుండడమే దీనికి కారణం. ఇరవై ముప్పై ఏళ్ల కింద సింగూరు ప్రాంతం నుంచి వలస వెళ్లిన వందలాది కుటుంబాలు కూడా తిరిగి స్వగ్రామాలకు వచ్చి.. తమ పొలాలను సాగు చేసుకుంటున్నాయి. ఈ అంశంపై ఈ వారం ‘సాక్షి’ఫోకస్‌...                                
– జోగిపేట, పుల్‌కల్‌ (ఆందోల్‌)
 
సాగు చేద్దామంటే నీళ్లు లేక.. బోర్లు వేసే స్థోమత లేక ఉపాధి కోసం పొట్టచేతబట్టుకుని పట్నం బాట పట్టిన ‘సింగూరు’ప్రజలు తిరిగి సొంతూళ్ల బాట పడుతున్నారు. సింగూరు ప్రాజెక్టు పరిధిలోని ఆందోల్, పుల్‌కల్‌ మండలాలకు చెందిన 759 కుటుంబాలు వ్యవసాయం చేసుకునేందుకు మళ్లీ స్వగ్రామాలకు చేరుకున్నాయి. దాదాపు మూడు దశాబ్దాల కింద 1990–91లో కురిసిన భారీ వర్షాలతో ఆందోల్‌ పెద్ద చెరువులోకి భారీగా నీరు వచ్చి పొంగి పొర్లగా.. ఇప్పటిదాకా మళ్లీ చెరువు నిండిందే లేదు. అలాంటిది ఈ ఏడాది సింగూరు ప్రాజెక్టు నీటిని కాలువల ద్వారా ఆందోల్‌ పెద్ద చెరువుకు మళ్లించడంతో.. నీరు నిండి అలుగు పారింది. ఇలా అలుగుపారి పిల్ల కాలువల ద్వారా వచ్చిన నీటిని సైతం దాదాపు నెల రోజుల పాటు రైతులు పొలాలకు మళ్లించుకున్నారు. మొత్తంగా 25 ఏళ్లుగా బీడుగా ఉన్న భూములు ఇప్పుడు పంటలతో కళకళలాడుతున్నాయి.
 
వైఎస్‌ హయాంలో..
ఆందోల్‌ నియోజకవర్గంలోని 40 వేల ఎకరాలకు సాగునీరు అందించాలన్న ఉద్దేశంతో వైఎస్‌ రాజశేఖరరెడ్డి సింగూరు కాలువ పనులకు రూ.89.98 కోట్లు మంజూరు చేశారు. స్వయంగా వైఎస్‌ శంకుస్థాపన కూడా చేసి.. పనులు ప్రారంభించారు. కానీ ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలేవీ ఈ ప్రాజెక్టును పట్టించుకోలేదు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఏర్పాటయ్యాక సింగూరుపై మంత్రి హరీశ్‌రావు ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. ఎప్పటికప్పుడు అధికారులతో సమీక్షిస్తూ కాలువలు పూర్తి చేయించారు. దీంతో గత యాసంగిలోనే రైతులకు నీరందింది. అంతేకాక ప్రత్యేకంగా 90 చెరువులను సింగూరు నీటితో నింపేందుకు అదనంగా కాలువల నిర్మాణాన్ని చేపట్టారు. మొత్తంగా యాసంగిలో 30 వేల ఎకరాలకు సాగునీరు అందించగా.. ఖరీఫ్‌లో 40 వేల ఎకరాలకు నీరందించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఇక్కడి ఎమ్మెల్యే బాబూమోహన్‌ కూడా ప్రత్యేక శ్రద్ధ చూపించడంతో కాలువ పనులు వేగంగా పూర్తయ్యాయి.
 
రేషన్‌ కార్డుల కోసం దరఖాస్తులు
ఈ రెండు మండలాల్లోంచి కొన్నేళ్లుగా పెద్ద సంఖ్యలో కుటుంబాలు వలస వెళ్లాయి. పుల్కల్‌ మండలంలోని బొమ్మారెడ్డిగూడెం పంచాయతీ పరిధి నుంచి సుమారు 38 కుటుంబాలు పట్నం వెళ్లాయి. ఇలాంటి వారిలో వివిధ గ్రామాలకు చెందిన వందలాది రైతు కుటుంబాలు స్వగ్రామాలకు తిరిగి వచ్చాయని రెవెన్యూ అధికారులు గుర్తించారు. వీరికి హైదరాబాద్‌లోనే రేషన్‌కార్డులు, అక్కడి చిరునామాలతోనే ఆధార్‌కార్డులు ఉన్నాయి. ఇప్పుడు వారంతా హైదరాబాద్‌లోని కార్డులను రద్దు చేసి.. తమ స్వగ్రామాల చిరునామాతో ఇవ్వాలని తహసీల్దార్‌ కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్నారు.
 
20 ఏళ్లుగా బీడు భూములే..
సింగూరు ప్రాజెక్టు పరిధిలోనే ఉన్నా.. ఆందోల్, పుల్క ల్‌ మండలాల్లోని వేల ఎకరాలకు నీరందకపోవడంతో అవన్నీ దాదాపు 20 ఏళ్లుగా బీడుగా మారిపోయాయి. ఈ ప్రాంతాలకు వందలాది కుటుంబాలు పొట్టచేత పట్టుకుని హైదరాబాద్‌ సహా ఇతర పట్టణాలకు వలస వెళ్లిపోయాయి. వారంతా సికింద్రాబాద్, పటాన్‌చెరు, రామచంద్రాపురం, రంగారెడ్డి జిల్లాలోని పలు ప్రాంతాలలో అడ్డా కూలీలుగా మారిపోయారు. పనులు దొరకక, కడుపు నిండక అర్ధాకలితోనూ అలమటించారు. ఇప్పుడు పొలాలకు సింగూరు జలాలు వస్తుండడంతో తిరిగి వచ్చారు.
 
ఇది నా అదృష్టం..
‘‘ఖరీఫ్‌ సీజన్‌లో 47,500 ఎకరాలకు సాగునీరు అందించేందుకు సింగూరు జలాలను వదిలే అవకాశం నాకు దక్కడాన్ని జీవితంలో మరిచిపోలేను. రైతులకు నీరందించే అవకాశం దక్కడం అదృష్టంగా భావిస్తున్నా. సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్‌రావుల కృషితోనే సింగూరు జలాలు అందుతున్నాయి. ఉపాధి కోసం పట్టణ ప్రాంతాలకు వలస వెళ్లిన వందల కుటుంబాలు వెనక్కి రావడం సంతోషంగా ఉంది. ఇక నుంచి ఆందోల్, పుల్కల్‌లలోని ఒక్క చెరువును కూడా ఎండిపోనివ్వం. సింగూరులోకి కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా నీరు వస్తుందని సీఎం అసెంబ్లీలోనే స్వయంగా చెప్పారు కూడా..’’
– పి.బాబూమోహన్, ఆందోల్, ఎమ్మెల్యే
 
వందల కుటుంబాలు వెనక్కి..
సింగూరు జలాలు రావడంతో వివిధ ప్రాం తాలకు వలస వెళ్లిన రైతులంతా తిరిగి సొంతూళ్లకు వస్తున్నారు. ఆందోల్‌ మండల పరిధిలోని కాలువ పరీవాహక ప్రాంతాలకు చెందిన 438 కుటుంబాలు దాదాపు 25 ఏళ్ల తర్వాత తిరిగి వెనక్కి వచ్చాయి. ఆందోల్‌ మండల పరిధిలోని కన్‌సాన్‌పల్లి, రాంసానిపల్లి, అన్నాసాగర్, పోసానిపేట, మాసానిపల్లి గ్రామాలకు చెందిన రైతులు దాదాపు 1,338 మంది వరకు ఉన్నట్లు అంచనా. ఇక పుల్కల్‌ మండలంలో సుమారు 15 గ్రామాలకు చెందిన 321 రైతు కుటుంబాలు తిరిగి స్వగ్రామాలకు వచ్చి పంటలను సాగు చేసుకుంటున్నాయి.
 
నాడు బీళ్లు.. నేడు పంటలు
ఈ ప్రాం తంలో ఏళ్ల తరబడి బీడుగా ఉన్న భూములు ఇప్పుడు ఎక్కడ చూసినా నారుమళ్లు, వరినాట్లతో కళ కళలాడుతున్నాయి. ఉపాధి కోసం వలస వెళ్లిన రైతులంతా వెనక్కి వచ్చి వారి భూముల్లో పంటలు వేస్తున్నారు. తమ పొలాల్లో తిరిగి నాట్లు వేసుకోవడం, దున్నుకోవడంతో వారి ముఖాల్లో ఆనందం కనిపిస్తోంది. యాసంగి నాటికే కొన్ని కుటుంబాలు పంటలు వేయగా.. ఇప్పుడు సాగు మరింతగా పెరిగింది. రైతులంతా పంటలు సాగు చేసుకుంటుండడంతో ఇక్కడ కూలీలు దొరకని పరిస్థితి ఏర్పడడం గమనార్హం.
 
ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 30 టీఎంసీలు (529 అడుగులు)
ప్రస్తుత నీటి నిల్వ18 టీఎంసీలు (521 అడుగులు)
ఎడమ కాలువ ద్వారా సరఫరా 37,500 ఎకరాలకు
90 చెరువుల ద్వారా సరఫరా 10,000 ఎకరాలకు
వెనక్కి వచ్చిన కుటుంబాలు 759
 
నీరు రావడంతో పల్లెకు వచ్చా..
‘‘ఇప్పటివరకు ప్రైవేటు ఉద్యోగం చేస్తూ సంగారెడ్డిలో ఉన్నాం. ఇçప్పుడు సింగూరు నీరు వస్తుండటంతో తిరిగి ఊరికి వచ్చాం. ఇంత కాలం బీడుగా ఉన్న భూమిలో అచ్చుకట్టి పొలం చేశాను. పంటలు పండిస్తూ నలుగురికి పని కల్పించే అవకాశం వచ్చింది. కుటుంబంతో కలసి ఇంటి వద్దే పనిచేసుకోవడం ఆనందంగా ఉంది..’’
– గోపాల్‌ రాథోడ్, బొమ్మారెడ్డిగూడెం
 
పొలాలన్నీ కళకళలాడుతున్నాయి
‘‘నీటి వసతి లేకపోవడంతో ఏళ్ల తరబడి మా పంటలను బీళ్లుగా ఉంచుకున్నాం. పక్కనే సింగూరు ప్రాజెక్టు ఉన్నా నీటిని వినియోగించుకోలేని దుస్థితి ఉండేది. ప్రభుత్వం కాలువల పనులు పూర్తిచేసి చెరువులు నింపి సేద్యానికి నీరందిస్తోంది. దీంతో ఇప్పుడు ఎక్కడ చూసినా పొలాల నిండా నాట్లతో, కూలీలతో కళకళలాడుతున్నాయి..’’
– పెంటయ్య, రైతు, పుల్‌కల్‌
 
మూడెకరాల్లో వరి వేస్తున్నాం..
‘‘సింగూరు నీరు రావడంతో ఉన్న మూడెకరాల్లో వరి పంట వేస్తున్నా. గత రబీ లో నీరు వచ్చినప్పుడు పంట లు వేసిన. ఇప్పుడు కూడా నీరు వస్తోంది. వారం రోజు ల్లో నాట్లు వేస్తాం. ఇప్పటివరకు నీళ్లు లేక వలస పోయాం. ఇప్పుడు మాకే పని కోసం మనుషులు సరిపోవడం లేదు..’’
–అల్గొల స్వప్న, సింగూరు
 
611 రేషన్‌కార్డులకు దరఖాస్తులు
‘‘ఏళ్ల క్రితం వివిధ ప్రాంతాలకు వలసవెళ్లిన వారు ఇప్పుడు సొంత గ్రామాలకు తిరిగి వస్తున్నారు. తమకు పట్నంలో రేషన్, ఆధార్‌కార్డు ఉన్నాయని, వాటిని రద్దు చేసి ఇక్కడ ఇవ్వాలంటూ ఇప్పటివరకు 611 మంది దరఖాస్తు చేసుకున్నారు. కార్డుల మంజూరు కోసం ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు పంపించాం..’’
– తహసీల్దార్‌
 
47,500 ఎకరాలకు నీరిస్తున్నాం
‘‘ఖరీఫ్‌ సీజన్‌లో సింగూరు ప్రాజెక్టు ఎడమ కాలువ ద్వారా ఆందోల్, పుల్కల్‌ మండలాలతో పాటు మునిపల్లి, సదాశివపేట తదితర 44 గ్రామాల్లోని 47,500 ఎకరాలకు సాగునీటిని అందిస్తున్నాం. యాసంగిలో సుమారు 30 వేల ఎకరాల వరకు నీరందించాం. అప్పట్లో 70 చెరువులను నింపగా.. ఈ ఖరీఫ్‌ సీజన్‌లో 90 చెరువులను నింపి పది వేల ఎకరాలకు, కాలువల ద్వారా 37,500 ఎకరాలకు నీరందిస్తున్నాం. మరో 30 చెరువులను నింపేందుకు నిధుల కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాం. వచ్చే యాసంగికి కుడి కాలువ ద్వారా 2,500 ఎకరాలకు నీరందించేందుకు చర్యలు తీసుకుంటున్నాం..’’
– బాలగణేశ్, సాగునీటి శాఖ డిప్యూటీ ఈఈ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement