పాలనలో ఎవరి శైలి వారిది. బాబు శైలి బాబుది, కేసీఆర్ శైలి కేసీఆర్‌ది. ఇక వైఎస్సార్ ఒక గొప్ప నేత. కాకుంటే ఇంతమంది జనం ఆయన్ని మహానుభావుడు అంటారా? వైఎస్సార్ ఎంత డైనమిక్‌గా ఉండేవారో రోజూ పేపర్లలో చూసేవాళ్లం. సాహసోపేతమైన నిర్ణయాలను అప్పటికప్పుడే తీసుకునేవారు. అలాంటి తత్వాన్ని ఎన్టీఆర్‌లో చూశాను, వైఎస్సార్‌లో చూశాను. నిర్ణయాలను వేగంగా తీసుకునే లక్షణమే నాయకులను చేస్తుంది. ఇలాంటి నేతలే డెసిషన్ మేకర్స్.
సినిమా వాళ్లంటేనే అందరికీ చిన్న చూపు అని, ఏ ఘటన జరిగినా అందరూ సినిమావాళ్లమీదే పడతారని ప్రముఖ నటుడు, మాజీ మంత్రి, టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే బాబూమోహన్ ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నో కష్టాలు పడి, ఎందరిని ప్రాధేయపడితేనో సినీ నటులకు పాపులారిటీ వస్తుందని దాన్ని దెబ్బతీయడమే పనిగా పెట్టుకుంటున్నారన్నారు. డ్రగ్స్ విషయంలో అందరినీ పక్కనబెట్టి సినిమా వాళ్లతోనే ప్రపంచం కూలిపోతోంది అనేలా ప్రచారం చేశారని, ఏది వచ్చినా, ఏం జరి గినా ముందుగా సినిమావాళ్లనే బద్‌నాం చేస్తున్నారని విమర్శించారు. లేబర్ మంత్రిగా తొలి దశలో నటించిన తాను రాజకీయాల్లో చేరి కార్మిక మంత్రిగా కావడం ఊహించలేదన్నారు. నటనలో, రాజకీయాల్లో ఎన్టీఆర్ దేవుడని, సాహసోపేత నిర్ణయాలు తీసుకోవడంలో వైఎస్ రాజశేఖరరెడ్డి చాలా గొప్పనేత అని ప్రశంసించిన బాబూ మోహన్ అభిప్రాయాలు ఆయన మాటల్లోనే...
సినిమాల్లో నిర్మాతలు, దర్శకులు, హీరోలు తోటినటులను ఇబ్బంది పెడతారా?
కొందరిలో అలాంటి స్వభావం ఉంటుంది. సినీరంగంలో నవరసాలూ ఉంటాయి. కొందరు కనబడతారు, కొందరు కనబడరు. కొందరు పైకి చిరునవ్వు నవ్వినా, లోపల మాత్రం.. నీ... నా కొడకా.. దొరకవా అన్నట్లుగా ఉంటుంది. ఇవన్నీ సహజం.
ఏ హీరో అంటే మీకు బాగా ఇష్టం?
అందరూ ఇష్టమే. ఎన్టీఆర్ అంటే ఇక దేవుడే. కానీ అక్కినేని ఎంత ప్రేమగా పిలిచేవారంటే. ఊ.. అందగాడా కమాన్.. అనేవారు. బాబూ మోహన్ అని ఎన్నడూ పిలిచేవారు కాదు. చేయిపట్టి లాక్కుని కూర్చొబెట్టుకునేవారు.
నాడూ నేడూ చిత్రపరిశ్రమ పరిస్థితి ఎలా ఉంది?
అప్పట్లో మాతోపాటు ఇతరులూ బాగుండాలి అనుకునేవారు. ఇప్పుడయితే నేను బాగుంటే చాలు ఎవరెక్కడికి పోతే ఏం అనే పరిస్థితి వచ్చేసింది. సినిమా ఎంతో బాగున్నా బాగుంది అనడానికి ఇప్పుడెవరికీ మనసు రావడం లేదు. పక్కోడు సినిమా తీస్తే ఏ థియేటరూ దొరకనివ్వరు. స్పష్టంగా చెప్పాలంటే తెలుగు చిత్రసీమ ఆ నలుగురి రాజ్యంగా అయిపోయిందిప్పుడు. వాళ్లేం చెబితే అదే జరుగుతోంది. నువ్వు బతుకు నీతోపాటు నలుగురూ బతకనివ్వు అనేది వ్యాపారం. గతంలో నేను సమ్మక్క సారక్క మహాత్మ్యం అనే సినిమా తీశాను.
వరంగల్‌లో విడుదల చేయడానికి నాలుగు థియేటర్లు దొరికాయి. కానీ సాయంత్రానికే వాటిని రద్దు చేశారు. ఆ నలుగురే కారణం. బలమున్న నటులు, నిర్మాతల కొడుకులు ముక్కూ మొహం సక్కగ లేకున్నా హీరోలే అవుతారు. నా కొడుకు ఆరడుగుల అందగాడే అయినా చాన్సు రాదు. కమెడియన్ కొడుకు కూడా హీరో అవుతాడా అనే ఈసడింపు కావచ్చు. ఇతరులకు ఎలాంటి అవకాశాలూ రావు. ఇవ్వరు. వస్తే తొక్కేస్తారు. ఇప్పుడొచ్చే హీరోలందరూ శోభన్‌బాబు, ఎన్టీఆర్‌లాగానే చక్కగా ఉన్నారా?
రాజకీయ పాత్రల్లో డైలాగ్ డెలివరీలో ఒక ట్రెండ్ సృష్టించారు. ఎలా సాధ్యపడింది?
తొలిదశలో ముత్యాల సుబ్బయ్య తీస్తున్న సినిమాలో లేబర్ మంత్రిగా చిన్న గెస్ట్ రోల్‌లో నటించాను. రావుగోపాలరావుతో కాంబినేషన్ ఉన్న పాత్ర. బాబూమోహన్ అయితే బాగుంటుందని రాజశేఖర్ చెబితే సరే సరే అంటూ చిరాకుపడి నాకే ఇచ్చారు. యాక్షన్ పాత్ర ముగిసి డబ్బింగు చెప్పేటప్పుడు చూసి ‘‘అబ్బబ్బ.. ఏమున్నాడు.. లేబర్ మంత్రిగెటప్‌లో ఏమున్నాడే.. భలే చేశాడే’’ అంటూ పదిసార్లు అన్నారట రావుగోపాలరావు. ఆయనంతటి గొప్ప నటుడే నా పాత్రను మెచ్చుకున్నారే అని తెగ సంతోషపడ్డాను. ఆరోజుల్లో ఆయనే తిరుగులేని స్టార్. ఇక నన్ను నేను చూసుకుని తెగ మురిసిపోయాను. అన్నేళ్ల నటజీవితం తర్వాత రాజకీయరంగంలో అడుగుపెట్టాక అదే లేబర్ మంత్రిగా అయ్యాను. అచ్చు కార్మిక మంత్రిగా ఉన్నాడే అని నా కెరీర్ మొదట్లో ఆయన పొగిడారు. తర్వాత నిజంగానే కార్మిక మంత్రిని అయిపోయాను. అలాగే బిచ్చగాడి పాత్ర వేసి ఒక ముద్ద ఉంటే వెయ్యండమ్మో అనే డైలాగ్ చెబితే జనం పడిపోయారు. ఒకసారి రైల్లో రాజమండ్రి వెళుతుంటే ఒక జడ్జి గారు పరిచయం అయ్యారు. ‘మా మనవడు మీ ఫ్యాన్ సర్, స్కూల్‌నుంచి రాగానే బువ్వ ఉంటే వెయ్యండమ్మో అంటూ వస్తాడు’ అన్నారు. ఎంత సంతోషమేసిందో.
డ్రగ్స్ కేసులో సినీ పరిశ్రమకు చాలా చెడ్డపేరు వచ్చింది కదా?
ఏది వచ్చినా, ఏం జరిగినా ముందుగా సినిమావాళ్లమీదే పడతారు. చివరికి మీడియా కూడా మామీదే పడుతుంది. బాబూమోహన్ అట.. ఎన్టీఆర్ అట.. అలా మా పేర్లు వాడుకోవడం కోసమే ఈ గోలంతా తప్ప, ఎప్పటినుంచో జరుగుతున్న వ్యవహారంలో ఇరుక్కున్నవారిని ఈజీగా వదిలేస్తారు. మా ప్రతిష్టను దెబ్బతీయడానికి వాడుకుం టారు. ఎన్ని కష్టాలు పడి ఎందరిని ప్రాధేయపడితేనో మాకు ఈ ఆదరణ వచ్చింది. మీ దర్యాప్తుల కోసం, మీకు పేరు రావడం కోసం మా ప్రతిష్టని దెబ్బతీయాలా? పొద్దున మొదలు పెడితే ఆ స్క్రోలింగ్ ఏమిటి... అమ్మో ఏమో అయిపోతోంది. ప్రపంచం కూలి పోతోంది అనే స్థాయిలో ప్రచారం చేశారు. సినిమా వాళ్లలో కొందరు అనండి ఒప్పుకుం టాము. కానీ కొందరు అనలేదే. అందరినీ కలిపేస్తున్నారు. టీవీ ఆన్ చేస్తే చాలు ఉదయం నుంచి సాయంత్రం దాకా ప్రచారం మోత. ఇంకేమీ లేవా..?
సినిమాల నుంచి రాజకీయాలకు ఎలా వచ్చారు?
ఎన్టీరామారావు అభిమానిని. అన్నగారు చెబితే వారి పార్టీ తరపున ప్రచారం చేయవలసి వచ్చింది. మొదటిసారి వెళ్లినప్పుడు ఒక పార్టీ తరపున ప్రచారం చేయడం ఎందుకు అనిపించింది. కానీ అన్నగారి మాట జవదాటలేను. పోతే పలానా పార్టీ మనిషి అనే ముద్రపడిపోతుంది. అన్నగారి ఆర్డర్ కాబట్టి వెళ్లాను. నేను ప్రచారం చేసిన మనిషి తలసాని శ్రీనివాస యాదవ్ గెలిచాడు. నేను రాజకీయాల్లోకి ఎలా వచ్చానంటే.. దాసరి సినిమా షూటింగులో ఉండగా మాజీ హోంమంత్రి ఇంద్రారెడ్డి ఒకసారి పిలి పించారు. నామినేషన్ మీద సంతకం పెట్టు అన్నారు. నామినేషన్ ఏమిటి అని అడిగాను. ముందు సంతకం పెట్టు అని బలవంతం చేసి పెట్టిం చాడు. తర్వాత వెంటనే రోడ్డు మీద నిలబెట్టి జనం ముందు మాట్లాడమన్నాడు. ఏం ఉపన్యాసం అంటే పోటీ చేస్తున్నావు కదా అన్నాడు.
ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని కూలగొట్టేయడం అన్యాయం అనిపించలేదా?
అన్యాయం అనిపించింది కాబట్టే రాష్ట్రమంతటా తిరిగాను. అన్నగారికి అనుకూలంగా ప్రచారం చేశాను. తర్వాత కొంత కాలానికే ఆయన చని పోయారు. ఆ ఘటనతో పూర్తిగా విరక్తి వచ్చేసింది. అన్నే నాకు ముఖ్యం. సినిమాలు చేస్తూనే అన్నగారు ఏం చేస్తే ఆ పని నేనూ చేయాలనిపించింది. ఆ క్రమంలో భిక్షాటన చేశాను. బట్టలషాపులకు వెళ్లి పేదలకు బట్టలు అడిగాను. కానీ నాకు అప్పటికి స్టార్ వాల్యూ ఉంది కాబట్టి ఎక్కడికి వెళ్లినా జనం వెంటబడేవారు. మా జిల్లాలోనే ఒకసారి జనం మధ్యలో చచ్చిపోతానేమో అన్నంత భయం వేసింది. ఏం చేయాలో అర్థం కాక బాబుకు ఫోన్ చేశాను. ఆయన సీటు ఇచ్చారు.. గెలిచాను.
2001లో కేసీఆర్ పార్టీ పెట్టినప్పుడు మిమ్మల్ని పిలవలేదు కదా?
గతంలో నన్ను గెలిపించడానికి సిద్దిపేట ఏరియాలో మూడు నెలలు గ్రామాల్లో తిరి గారు కేసీఆర్. వ్యక్తిగతంగా చాలా మంచి అభిమానం ఉండేది. ఆయన పార్టీ పెట్టినప్పుడు నన్ను పిలవలేదు. ఇబ్బంది పెట్టలేదు కూడా. కానీ బాబు నాకు టిక్కెట్ ఇవ్వనన్నప్పుడు టీడీపీకి రాజీనామా చేశాను. ఇక రాజకీయాలు వద్దనుకున్నాను. అప్పుడే కేసీఆర్ నుంచి ఫోన్ వచ్చింది. ‘బామ్మర్దీ రా’ అన్నారు. ‘నేను నిన్ను ఇంతవరకూ ఎప్పుడూ ఇబ్బంది పెట్టలేదు. ఇప్పుడు నీకు ప్రాబ్లమ్ వచ్చింది. నిన్ను కాపాడుకోవాల్సిన బాధ్యత నాది. రా..’ అన్నారు. అలా ఉదయం పిలిచాడు. సాయంత్రానికి నామినేషన్ వేయించాడు. గెలిపించాడు. బాబూ మోహన్‌కి టీడీపీ వాళ్లు అన్యాయం చేసారని జనం గ్రహించారు. వాళ్లూ వీళ్లూ కూడా ఒక్కటై నాకు మద్దతుగా నిలబడ్డారు.
చంద్రబాబు మీకు ఎందుకు సీటివ్వలేదు?
చాలా జరిగాయి. ఎవరు నాపై వ్యతిరేకంగా చెప్పారో, ఆయన వేటిని నమ్మారో.. ఆ వివరాల్లోకి ఇప్పుడు పోను. తప్పించుకుంటున్నారు అని మీరు ఎత్తిచూపినా సరే పాత విషయాల్లోకి వెళ్లను. గతాన్ని తవ్వుకుంటూ ఉంటే ఇంత ముందుకొచ్చేటోడిని కాదు.
జీవితంలో మీకు బాగా సంతోషం కలిగించిన ఘటన ఏది?
సినిమాల్లో, రాజకీయాల్లో అవకాశాలు లేవు. అన్నీ వదులుకుని ఇంట్లో కూర్చుని ఉండిపోయాను. గతంలో నేను చూసిన కేసీఆర్ ఉద్యమనేతగా మహాత్ముడి స్థాయికి పెరిగిపోయారు. నేను భూమ్మీదే ఉండి ఆయన్ని తలెత్తి చూడాల్సిన పరిస్థితి. అప్పుడు సైతం ఆయనే నన్ను బామ్మర్దీ... రా అని పిలిచారు. తెలంగాణ సీఎం అయిపోయినట్లే అనేంత స్థాయిలో ఉన్నప్పుడు కూడా ఆయన నన్ను చిన్నప్పుడు పిలిచినట్లే అదే సాన్నిహిత్యంతో పిలిచారే.. ఇలాంటి మహానుభావులు ఉంటారా అని బాగా సంతోషం వేసింది.
(బాబూమోహన్‌తో ఇంటర్వ్యూ పూర్తి పాఠం కింది లింకుల్లో చూడండి)
https://goo.gl/MuV9JT
https://goo.gl/BYCEpR
Comments
Please login to add a commentAdd a comment