నమ్మకం నిలబెట్టుకుంటా
స్పెషలాఫీసర్ సోమేశ్‌కుమార్ వెల్లడి
బాధ్యతల స్వీకరణ
సిటీబ్యూరో: దాదాపు కోటి జనాభా కలిగిన హైదరాబాద్ మహా నగరానికి స్పెషలాఫీసర్‌గా నియమించి {పభుత్వం తనపై అతిపెద్ద బాధ్యతను ఉంచిందని జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేశ్‌కుమార్ అన్నారు. ముఖ్యమంత్రి నమ్మకాన్ని వమ్ము చేయకుండా, తన శాయశక్తులా అభివృద్ధికి కృషి చేస్తానని చెప్పారు. గురువారం ఉదయం 11.05 గంటలకు స్టాండింగ్ కమిటీ చైర్మన్(మేయర్) చాంబర్లో స్పెషలాఫీసర్‌గా బాధ్యతలు చేపట్టారు. శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి విధులు స్వీకరించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ, ముఖ్యమంత్రి ఆశయాలకుఅనుగుణంగా గ్రేటర్‌ను ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దేందుకు, ప్రజలకు సదుపాయాలు కల్పించేందుకు కృషి చేస్తానన్నారు. అధికారులు మరింత బాధ్యతాయుతంగా, జవాబుదారీతనంతో వ్యవహరించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటానని చెప్పారు.
ప్రభుత్వం తనపై ఉంచిన బృహత్తర బాధ్యతను నిర్వహించేందుకు మరింతగా కృషి చేయాల్సి ఉందన్నారు. ప్రజాఫిర్యాదుల పరిష్కారానికి ప్రాధాన్యమిస్తామని చెప్పారు. నిజమైన వరల్డ్‌క్లాస్ సిటీగా తీర్చిదిద్దేందుకు మార్పులు తేవాల్సి ఉందన్నారు. ఈ సందర్భంగా అధికారులు ఆయనకు పుష్పగుచ్ఛాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు. సోమేశ్ కుమార్‌ను కలిసిన వారిలోఎ స్పెషల్ కమిషనర్లు బాబు అహ్మద్, ప్రద్యుమ్న, అడిషనల్ కమిషనర్ రామకృష్ణారావుతో పాటు అడిషనల్, జోనల్ కమిషనర్లు, డిప్యూటీ కమిషనర్లు, వివిధ విభాగాల ఉన్నతాధికారులు ఉన్నారు.